Saturday, November 11, 2006


అనువు గాని చోట అధికుల మనరాదు


ఈ నిజాన్ని మరోసారి నిరూపించింది నిన్నటి సంఘటన.

నిన్న రాత్రి నైట్‍షిఫ్ట్ కోసం ౧౦ గంటలకు మోటర్‍బైక్‍ మీదొస్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఆఫీసొక అరకిలోమీటరు దూరముందనగా, తాగి రోడ్డుమీద అడ్డ దిడ్డంగా నడుస్తున్న ఓ ఐదుగురు అడ్డమొచ్చారు. హారన్ కొడితే తప్పుకున్నట్టు తప్పుకుని మళ్ళా మీదకొచ్చారు. అనుకోకుండా అలా వచ్చేసరికి రియర్ వ్యూ మిర్రర్ వాళ్ళకు తగిలి బండి అదుపు తప్పింది. పడబోయి కొద్దిలో నిలదొక్కు కున్నాడు. కోపంతో 'రోడ్డు మీద ఎలా నడవాలో తెలీదా తాగుబోతు నాయాల్లారా' అని వాళ్ళను తిట్టాడు. వాళ్ళు పట్టించుకోక పోయేసరికి, బండి పక్కకి తీసి ఆపి, వాళ్ళనాపి పోలీసులకు కంప్లైంటు చేస్తామన్నా వాళ్ళు పట్టించు కోకుండా ఎదురు మాట్లాడేసరికి మనోడికి తిక్క రేగి (?) మొబైల్ తీసి నిజంగానే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేయబోయాడు.

ఇంకేముంది, వీడొక్కడు, వాళ్ళయిదుగురు. సుబ్బుగాడెంత ప్రతిఘటించినా, ఐదుగురి దాటికి తట్టుకోలేక పోయాడు. వాళ్ళతన్ని కొట్టి పడేసి వెళ్ళి పోయారు. ఆ దారిన పోయే వాళ్ళెవరూ పట్టించుకోక పోయినా, ఒక్కతను మాత్రం (పాపం పూనా నుంచి ఏదో పనిమీద వచ్చాట్ట) చూసి జాలిపడి దగ్గర్లోవున్న ఓ హాస్పిటల్ లో చేర్పించాడు. రోడ్డు పక్కన బండరాళ్ళు వుండటంతో తల మీద, తలవెనుక మెడ పై భాగాన బాగా దెబ్బలు తగిలాయి. బాటిల్తో కూడా కొట్టినట్టున్నారు, పగిలిన గాజు పెంకులు క్రింద వున్నాయి. కుడి కంటి క్రిందుగా చీరుకు పోయింది. సుబ్బు సెల్లోంచే లాస్ట్ డయల్డ్ నెంబరు చూసి పూనా ఆసామి ఫోన్ చేస్తే అదృష్టవశాత్తు మా ఆఫీసతనికే చేరింది. విషయం తెలియగానే మావాళ్ళు పరిగెత్తు కెళ్ళారు.

తప్పు తనది కాకపోయినా, తాగినోళ్ళతో మనకెందుకులే అనుకుని సుబ్బుగాడనుకొని వుంటే ఈ ఖర్మే వుండేది కాదు. వాళ్ళయిదుగుర్ని చూసైనా ఒక్క క్షణం అలోచించినా సరిపోయుందును. తప్పుచేయలేదు కనుక నేను భయపడాల్సిన పనిలేదను కున్నాడు - ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఈ కాలంలో నిజం చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. అందుకే మన పెద్దవాళ్ళన్నారు "అనువుగాని చోట అధికుల మనరాదని".

దురదృష్టకరమైన సంగతేమిటంటే, రోడ్డు మీద ఎందరు వెళుతున్నా, ఈ సంఘటన చూసి స్పందించిన వెధవ ఒక్కడూ లేడు. వాడెవడో ప్రక్క రాష్ట్రం నుంచొచ్చినోడికి తప్ప ఇక్కడి వాళ్ళెవరికీ పట్టలేదు.

మందు తాగడం తప్పా ఒప్పా అన్నదిక్కడ ప్రశ్నకాదు గానీ, పబ్లిగ్గా .. అదీ నడిరోడ్డుమీద తాగుతూ వచ్చే పోయే వాహనాలకూ, పాదచారులకూ ఇబ్బందిగా మారటం ఖచ్చితంగా తప్పే. ఇలా చేయడం తప్పురా నాయినా అని చెప్పినోణ్ణి చితగ్గొట్టటం ఇంకా పెద్ద తప్పు. ఇవన్నీ క్షమించవచ్చేమో కానీ, చూస్తూకూడా పట్టించుకోక పోవడం మాత్రం క్షమించరాని తప్పు. కానీ వీళ్ళకేశిక్షా వుండదు.

ఏమిటోనండీ ... లోకంతీరు ఓ పట్టాన అర్థంకాదు.

లోకా సమస్తా సుఖి:నోభవన్తు!

Wednesday, October 04, 2006


టీవీ వలన కలుగు ప్రయోజనాలు


దసరా సందర్భంగా మా చిచ్చు బుడ్డితో కాలక్షేపం చేద్దామని బెంగుళూరునుండి హైదరాబాదు వెళ్ళాను. సెలవుల్లో పిల్లలకు "హోంవర్క్" ఇవ్వాలన్న ఓ గొప్ప సదుద్దేశ్యంతో మా పక్కింటి పాప వాళ్ళ స్కూలు టీచరు "టీవీ వలన కలుగు ప్రయోజనాలు" అన్న విషయం మీద వ్యాసం రాసుకు రమ్మందట. (Benefits of TV అని ఆంగ్లం లోనే అనుకోండి). ఆ పిల్లకు ఏదో చెప్పారు గానీ, ఒక్క క్షణం ఆలోచిస్తే (మీ రెన్ని క్షణాలు, గంటలు,... ఆలోచించినా కూడా) అసలు టీవీలో పిల్లలకు నిజంగా ఉపయోగపడే కార్యక్రమాలు ఏమున్నాయి అనిపించింది.

మామూలు ఛానళ్ళ సంగతి వదిలి వెయ్యండి, పిల్లల ఛానళ్ళూగా వుంటున్న కార్టూన్ నెట్‌వర్క్ గానీండి, డిస్నీ ఛానళ్ళు, పోగో లేదా మరోటి గానివ్వంటి అత్యధిక శాతం ఫైటింగులూ, హింస మొదలైన వాటి గురీంచే. (వీటిలో కొన్న మంచి కార్యక్రమాలు వస్తున్నాయన్న సంగతి గమనించ దగ్గది)

డా. కినో ఫెరియానీ ఒక శాస్త్రజ్ఞుడు "20 సంవత్సరాల పాటు నేరాలు, మనస్తత్వ శాస్త్రం, బాల మనో విజ్ఞానం వంటి వాటిపై చేసిన అధ్యయనం మూలాన అనేక వేల సార్లు నేనొక కఠోర సత్యాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అదేమిటంటే 80 శాతం మంది బాల నేరస్తులకు వారి తల్లి దండ్రులు మంచి విద్య, లోక కల్యాణం, దేశభక్తి భావనలు కలిగిస్తే వారు నేరస్తులు కాకుండా ఆపగలిగే వాళ్ళం. ఈ విధంగా వారి జీవన స్వరూపం మొత్తం మారిపోయి వుండేది." అని రాశారు.

ఒక సర్వే ప్రకారం 3 సం. వయస్సున్న ఓ బాలుడు టీవీ చూడడం ప్రారంభిస్తే, అతని యింట్లో 12, 13 ఛానళ్ళు కేబుల్ కనెక్షన్ ద్వారా వస్తూ వున్నట్లయితే, అతడు 20 యేళ్ళ వాడయ్యే సరికి 33,000 హత్యలు, 72,000 సార్లు అశ్లీల మరియు బలాత్కార దృశ్యాలు చూసి వుంటాడట. ఇది 2002లో జరిగిన సర్వే, మరి యిప్పుడో - లెక్కలేనన్ని ఛానళ్ళు, పుంఖానుపుంఖాలుగా కుట్రలు, హత్యలు, బలాత్కారాలు, అశ్లీల దృశ్యాలు.

ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అనే పేరుగల చిన్న పిల్లవాడు ఒకటి రెండు సార్లు "హరిశ్చంద్ర నాటకం" చూసి సత్యవాదిగా మారాడు. అతడే మహాత్మా గాంధీ పేరిట ఈనాటికీ పూజింప బడుతున్నాడు. కేవలం హరిశ్చంద్ర నాటకమే ఇంత ప్రభావం చూపితే, ఆ పిల్లవాడి జీవితాంతమూ సత్యాహింసలు పాటించేలా ప్రేరేపిస్తే, జీవితాంతమూ 33వేల హత్యా దృశ్యాలూ, 72వేల అత్యాచార దృశ్యాలు చూసే పసివాళ్ళు ఏం కావాలి?

పిల్లలే దేశ సంపద అని గుర్తుంచుకోండి. వారు భవిషత్తులో మీకూ-దేశానికీ ఉపయోగ పడేలా తయారయ్యే వాతావరణాన్ని కల్పించండి. దేశ నవనిర్మాణానికి సహకరించంది. దేశభావి నేతలనూ (నేతలంటే రాజకీయ నేతలు మాత్రమే కాదండీ, రామానుజం, మోక్షగుండం, సర్వేపల్లి, స్వామినాథన్, కలాం లాంటి వారని), మీ చిన్నారి బాలలనూ నాశనం చేసే అన్నింటినీ బహిష్కరించండి. మీ పిల్లలు మీకూ, సమాజానికీ భారం కాకూడదు.

Saturday, September 16, 2006


ఎమ్మెస్-కేసీయార్‌ల రాజీనామా సవాళ్ళపై కేకే


11-సెప్టెంబర్-2006, సోమవారం:
ఎమ్మెస్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికి కేసీయార్ ఇంకా పుట్టివుండడు. అంతబలముందని చెప్పే ఆయన ఎమ్మెస్ సవాలును స్వీకరించ వచ్చుగా! కేసీయార్‌ను రాజీనామా పంపమనండి. రేపే ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల సంఘంతో మాట్లాడతా. నెలరోజుల్లో ఎన్నికలు జరిగేలా చూస్తా!

12-సెప్టెంబర్-2006, మంగళవారం:
సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో పార్టీకి ప్రమేయముండదు. అవన్నీ వ్యక్తిగతం. ఇలాంటి వాటికి ప్రతిస్పందించవద్దని మావాళ్లకి చెబుతున్నాను.

13-సెప్టెంబర్-2006, బుధవారం:
నా వ్యాఖ్యలు కేసీయార్‌ను బాధించిన పక్షంలో చింతిస్తున్నా. వాటిని ఉపసంహరించుకుంటున్నాను. ఏదో ఆవేశంలో అని... తర్వాత విజ్ఞతతో వెనక్కి తీసుకోవటం సరైన చర్యే. కేసీయార్ కూడా రాజీనామాను వెనక్కితీసుకోవాలి. నిర్ణయంపై పునరాలోచించాలి.

(--14వ తేదీ ఈనాడు మొదటిపేజీ వార్త)

ఎవరండీ బాబూ వీళ్ళని ఎన్నుకున్నది.

Friday, August 25, 2006


తెలంగాణా - ప్రత్యేక రాష్ట్రం


సుమారుగా 3 సంవత్సరాల నుండీ ఈ తెలంగాణా గురించి వినీ వినీ విసిగిపోయిన జనాలెంతమందో. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో కేసీయార్ నిరాహారదీక్ష, ఉపసంహరణ ప్రహసనం సందర్భంగా మా ఆఫీసు వాళ్ళ మాటల సారాంశం.

* తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలి ... ఎందుకు? ఏ ప్రాతిపదిక పైన?
* ప్రత్యేకంగా తెలంగాణా అనే వివక్షతో తెలంగాణా ప్రాంతం వారికి జరిగిన నష్టం ఏమిటి?
* అసలు నష్టం ఏమిటి, అంతా లాభమే కదా. ఎన్నడూ లేనంతగా భూమి రేట్లు పెరిగాయి, ఉద్యోగావకాశాలు పెరిగాయి, కొత్త కంపెనీలు పెరిగాయి, జీతాలు పెరిగాయి, జనాభా పెరిగింది.
* గవర్నమెంటు తెలంగాణేతరులనే పరిశ్రమలు స్థాపించమనీ, తెలంగాణేతరులకే ఉద్యోగాలిమ్మనీ చెప్పిన దాఖలాలైతే ఏమీ లేవు.
* వనరులన్నీ కొల్లగొట్టు కెళ్ళిపోతున్నారనే దాంట్లోనూ పస లేదు. ఒకవేళ అదే నిజమైతే అక్కడి వారు (తెలంగాణేతరులు) ఉద్యోగాల కోసం ఇక్కడి(తెలంగాణా) కెందుకొస్తారు.
* వీటన్నింటినీ మించి కె.సి.ఆర్., నరేంద్ర, వగైరా రాజకీయనాయకుల ఆస్తిపాస్తుల్ని చూడండి ... ఒకప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడానో!
* ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం అంటూ వూరికే అరవడం కాదు, అసలు ప్రత్యేక రాష్ట్రం అంటూ వస్తే వీళ్ళే రకంగా లాభపడతారో సవివరంగా చెప్పమనండి.
* ప్రత్యేక తెలుగు రాష్ట్రం గురించి పొట్టి శ్రీరాములు గారు చేసినట్లు కేసీయార్నో, నరేంద్రనో, లేక విజయశాంతినో చెయ్యమనండి ... తెలంగాణా రాకపోతే చూడండి.

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరొచ్చింది కనుక కొన్ని విషయాలు ఇక్కడ చదవండి.

Friday, August 11, 2006


ఇది పరాకాష్ట ... కొనసాగింపు


"నిన్న జెమిని టివీలో “బంగారం మీకోసం” చూస్తున్నాను. అందులో ఒక ప్రశ్న “Sun flower” పువ్వుని తెలుగులో ఏమంటారు అని! మన జీవిత కాలంలోనే ఇలాంటి క్విజ్ ప్రశ్నలు ఇంకా వినాల్సి వస్తుంది కాబోలు!" అంటూ చరసాల గారి బ్లాగు లోని ఇది పరాకాష్టలో చూసి, క్రింద సుధాకర్, త్రివిక్రమ్ గార్ల కామెంట్లు చదివిన తర్వాత ...

ఆగండి సారూ! అంత కష్టమైన (నిజమా?) ప్రశ్నలు వేస్తున్న ఝాన్సీనో, ఉదయభానునో లేక రమ్యకృష్ణనో చూసి కాదు తల జుట్టు పీక్కోవాల్సింది - వాటిక్కూడా సమాధానాలు చెప్పలేక బహుమతి కోసం క్లూ (clue)ల కోసం బతిమాలాడే పెద్దవాళ్ళని చూసి.

టీవీ వాళ్లనేంచెయ్యమంటారు? సమాధానం చెబితేనే బహుమతివ్వాలి. బహుమతులివ్వకపోతే జనాల్లో కార్యక్రమం పాపులరవ్వదు. కాబట్టే అంతలేసి ఖస్టమైన ప్రశ్నలడుగుతున్నారు మరి. గట్టిగా మాట్లాడితే ద్రౌపది భర్తలైదుగురి పేర్లూ (ఇంతకీ ఐదని కూడా తెలుసా లేదో) చెప్పలేని వాళ్ళని చూసి పీక్కోవాలండీ తలో, జుట్టో, మరోటో!

Thursday, August 10, 2006


నల్లికి నరుడే మందు !


డబ్బుల కోసం రక్తదానం చేసేవారిని మించిపోయి ... రెండు రూపాయిల కోసం ఆ రక్తాన్ని నల్లులకు స్వచ్ఛందంగా సమర్పించుకుంటున్నారు పశ్చిమ బెంగాల్లోని పేదలు. ఇక్కడ నగరాల శివార్లలోను, పట్నాల్లోనూ దాబాల సంఖ్య తక్కవేమీ కాదు. చాలా దాబాల్లో కుర్చీలు, టేబుళ్ళకు బదులు నులకమంచాలే వాడుతుంటారు. ఈ మంచాలకు కొబ్బరి లేదా జనపనారతో పేనిన తాళ్ళను పట్టీలుగా వాడడంతో నల్లుల సమస్య చాలా ఎక్కువ.

వేడినీళ్ళు పోయడం, క్రిమిసంహారక మందులు వాడడం వాటిని నివారించవచ్చు కానీ దాబాల యజమానులు అవి చాలా ఖరీదైన చర్యలుగా భావిస్తున్నారు. అందుకు వారో చవకరకం ఉపాయాన్ని కనుక్కున్నారు. గ్రామాల్నుంచి వచ్చే పేదల్నే పురుగుమందులుగా మారుస్తున్నారు.

సాయంకాలం దాబా తెరుస్తూనే ఓ వ్యక్తి 90 (౯౦) శాతం నగ్నంగా నల్లులు రక్తం పీల్చుకుని సంతృప్తి పడేదాకా పడుకుంటాడు. తరువాత ఆ నల్లులు తృప్తి చెంది మంచం కోళ్ళలోని ఇరుకు సందుల్లోకి జారుకుంటాయి. తర్వాత ఎవరు కూర్చున్నా మర్నాటి దాకా కుట్టవు. ఇలా మంచం మీది నల్లుల్ని తృప్తిపరచినందుకు అతడికి దక్కేది రెండ్రూపాయలే.

దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లాలోని దాబా యజమాని దల్బీర్ ఖేత్రి మాట్లాడుతూ "మంచాల్ని పూర్తిగా వేణ్ణీట్లో ముంచితే నల్లల్ని నివారించవచ్చు. కానీ అని ఆరడానికి ఒక రోజంతా పడుతుంది. అందుకని అలా చేయలేక పోతున్నాం. పురుగుమందులు వాడదామంటే ఖరీదు చాలా ఎక్కువ. మా కస్టమర్లంతా ట్రక్కు డ్రైవర్లూ, క్లీనర్లే. అంత భరించలేక ఈ మార్గాన్ని ఎంచుకున్నాం." అని వివరించారు. "ఏదో ఒక ఉపాది దొరికింది - అంతే చాలు" అని జాబువా జిల్లాలో నల్లులకు తన రక్తాన్ని ఆహారంగా పెడుతున్న ఓ వ్యక్తి పేర్కొన్నాడు.
-- ఈనాడు వార్త

Saturday, August 05, 2006


ఓ మంచిమాట


"ప్రపంచంలో వుండే జీవులన్నింటిలో సిగ్గు పడే లేక సిగ్గు పడాల్సిన అవసరం వున్న జీవి మనిషి ఒక్కడే."

- మార్క్‌ ట్వైన్‌
ఆలోచిస్తే ఎంత అర్థముందండీ ఈ చిన్ని వాక్యంలో.

Sunday, July 30, 2006


ధ్యానము


నాస్తి ధ్యాన సమం తీర్థమ్
నాస్తి ధ్యాన సమం దానమ్
నాస్తి ధ్యాన సమం యజ్ఞమ్
నాస్తి ధ్యాన సమం తపమ్
తస్మాత్ ధ్యానం సమాచరేత్

ధ్యానానికి సమమైన తీర్థం లేదు.
ధ్యానానికి సమమైన దానం లేదు.
ధ్యానానికి సమమైన యజ్ఞం లేదు.
ధ్యానానికి సమమైన తపస్సు లేదు.
అందువల్ల రోజూ ధ్యానం చేయాలి.

ధ్యానమంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాసే ధ్యానం. సూర్యోదయానికి ముందే లేచి, నిత్య కర్మలు ఆచరించి, ఉచితాసనం మీద పద్మాసనం వేసుకుని, శరీరానికి చక్కగా పరిశుభ్రమైన గాలి తగిలేలా - అవసరం అయితే అగరువత్తి వెలిగించుకుని - రెండు చేతులనూ ధ్యానముద్రలో మోకాళ్లపై వుంచి కూర్చోవాలి. కనులు మూసుకుని, దృష్టిని భ్రూ మధ్యమున నిలిపి దీర్ఘశ్వాసను తీసుకోవాలి. శ్వాసను కొద్దిసేపు లోపలే ఆపి వుంచి, వీలైనంత నెమ్మదిగా శ్వాసను బయటకు విడిచి పెట్టాలి. ఇది చేస్తున్నంత సేపూ మనస్సును శ్వాస ప్రక్రియ మీద కేంద్రీకరించాలి. ఈ విధంగా ఏడు సార్లు (అంటే సుమారు పది నిమిషముల సమయం) చేసిన పిమ్మట ఐదారు నిమిషములు శాంతంగా కూర్చోవాలి.

దీని వలన మనస్సు శాంతించి, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుతాయి. బుద్ధి తీక్షణమౌతుంది. శరీరం చైతన్యవంతమవుతుంది.

Sunday, July 16, 2006


గుర్తుకొస్తున్నాయి


మా టీవీ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 కు 'గుర్తుకొస్తున్నాయి' అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. అప్పుడప్పుడు సినిమాల కోసం, పాటల కోసం టీవీ పెట్టే నేను ఈ రోజెందుకో ఛానల్స్ స్కాన్ చేస్తూండగా మా టీవీ లో ఈ కార్యక్రమం చూట్టం జరిగింది. క్లుప్తంగా కార్యక్రమం ఏమిటంటే సమాజంలోని అలనాటి (మరచిపోయిన)లబ్దప్రతిష్ఠులను పిలిచి వాళ్ళ మధురస్మృతులను మనతో పంచుకొనే కార్యక్రమం. నిజంగానే బాగుంది. చాలా టీవీల్లో చూసే ఇంటర్వ్యూల్లోలాగా కాకుండా ఇందులోని ఏంకర్ /ఇంటర్వ్యూయర్ రఘు కుంచే పిలిచిన వాళ్ళచేతే ఎక్కువ సేపు మాట్లాడించాడు.మొదట పొడి పొడిగా మొదలైనా కొద్ది సేపట్లో వాళ్ళు తమ మనసు పొరల్లోకి వెళ్ళి ఎన్నో సంగతులు చెప్పారు.

ఈ రోజు బి.వసంత గారితో 'గుర్తుకొస్తున్నాయి'. వాగ్ధానం చిత్రంతో గాయనీమణిగా ప్రవేశం చేసిన వసంత గారు ఎన్నో విషయాలు చెప్పారు. తన మొదటి పాటలు, తోటి గాయకుల విశేషాలు, తను పనిచేసిన సంగీతదర్శకులు తో అనుభవాలు ఎన్నో గుర్తు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఆవిడ సంగీత దర్శకత్వం వహించిన ఒక కన్నడ, ఒక తెలుగు చిత్రాల గురించీ చెప్పారు. సుమారు 3000 పాటలు పాడిన ఆవిడ, వాటితో పాటు ఇంకా పదును తగ్గని ఆవిడ కంఠస్వరంతో ఆపాత మధురాలనీ వినిపించారు.

ఆసక్తి వున్నవాళ్ళు చూడండి. వచ్చేవారం ఒకప్పటి సూపర్ హీరోయిన్ 'కృష్ణవేణి' గారితో కార్యక్రమం. కృష్ణవేణిగారి గురించి ఓ రెండు ముక్కలు. అక్కినేని 'కీలుగుఱ్ఱం' సినిమాలో హీరోయిన్ ఈవిడ. రామారావు గారి మొదటి సినిమా 'మనదేశం' కు నిర్మాత ఈవిడే. ఇంకా ఎన్నో విషయాలు ఆవిడా నోటిద్వారా తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం 10:30 కు మాటీవీ చూడండి.

(ఇది మాటీవీ వారికి సంబంధించిన ప్రకటన మాత్రం కాదు)

Saturday, July 01, 2006


పాపం - ప్రాయశ్చిత్తం


"దాసుని తప్పు దండం(దణ్ణం) తో సరి"
"చేసిన తప్పు చెబితే పోతుంది"
"పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు"


వీటి గురించి మీ అభిప్రాయం ఏమిటి?

వెనకటికెవరో ఏదో బ్లాగులో(దొరక్కానే లింకిస్తాను) భక్తి గురించి వ్రాస్తూ కొన్ని ప్రశ్నలేసారు. అందులో ఒకటి అజామిళుడి గురించి. అవి చదివిన తర్వాతే ఈ ఆలోచననొచ్చింది.

నిజమే, మొదలు సద్బ్రాహ్మణుడైనా, తరువాత వేశ్యాలోలుడై భ్రష్టుడైనా, అవసానకాలంలో యమభటులను చూచి భీతితో తన కిష్టమైన చిన్న కొడుకుని "నారాయణా" అని పిలిచినందుకు విష్ణు దూతలు అతన్ని కాపాడారు. పశ్చాత్తాపుడైన అజామిళుడు దైవచింతనామగ్నుడై కొంతకాలం తరువాత విష్ణుసాయుజ్యం పొందాడు. ఇదీ కథ స్థూలంగా.

ఇదే విషయం గురించి మాట్లాడుతుంటే మావాడొకడు "హిందూ మతం పర్లేదు, అట్లీస్ట్ ఏం చేయాలో సొల్యూషన్ చెబుతుంది తుడిచెయ్యకుండా. అదే కిరస్తానీ మతమైతే (ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం లేదు) చేయాల్సిన తప్పులన్నీ (ఎంజాయ్)చేసి, ఆదివారం పొద్దుట చర్చ్‌కెళ్ళి ఫాదరీతో దేవుడా! తప్పులు చేశాను - క్షమించంటే చాలు, అన్ని పాపాలూ క్లాస్ వన్ ఫినాయిల్‌తో కడిగినట్లు కడిగేస్తాడట తెలుసా" అంటూ చిన్న సైజు లెక్చరిచ్చాడు. మరి ముసల్మానుల సంగతేంటో మరి (వాళ్ళు పరమ స్ట్రిక్టేమో - కన్నుకు కన్ను, కాలుకు కాలు!!)

మతాల ఉద్దేశ్యం తేలిగ్గా కడుక్కునే మార్గముంది కనుక యధేచ్ఛగా పాపాలు చేయమని, లేదా ఏ రకంగా చేసినా తప్పు తప్పే(పాపం) కనుక క్షమించకూడదని మాత్రం కాదనుకుంటా? ఎనీ సెకండ్ ఒపీనియన్?

అసలు పాపం అంటే ఏమిటి?
పాపం యొక్క తీవ్రత ఎలా తెలుస్తుంది?
అసలు మనం పాపం అంటున్న దాన్ని పాపం అని ఎవరు/ఎప్పుడు/ఎందుకు సెలవిచ్చారు?

For every action there is an equal & opposite reaction - Einstein
కాబట్టి, తప్పేంటో, దాని తీవ్రతేంటో తెలిస్తేనే కదా దానికి చెయ్యాల్సిన ప్రతిచర్య/ప్రతిక్రియ గురించి అలోచించడనికి.

ఇలా అలోచిస్తే, తప్పు/పాపం తెలియక చేసినవాడికి, తెలిసి చేసిన వాడికి తేడా ఏమిటి? అంటే సంఘటన కాంటెక్స్‌ట్ గురించి కూడా ఆలోచించాలా, వద్దా?

ఏమిటో అన్నీ ప్రశ్నలే? ఇంకొంచెం ప్రశాంతంగా, దీర్ఘంగా, తార్కికంగా ఆలోచించాలనుకుంటాను. ఎవరన్నా సాయం చేద్దురూ? Can anybody lend a hand?

Thursday, June 29, 2006


ఇదేనా ప్రజాస్వామ్యం?


తొలిదశలో ఎన్నికలు జరిగిన 11 జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగిస్తుంది. 2001లో తెదేపా హయాంలో జరిగిన వాటితోపోలిస్తే ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి
---వైయ్యస్‌.


స్థానిక సంస్థల తొలిదశ పోలింగ్‌లో అధికార పార్టీ అన్ని రకాల అక్రమాలకూ పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ స్వీయ ఆదేశాల మేరకే అన్నిజిల్లాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు రెచ్చిపోయాయి.
---చంద్రబాబు


కాంగ్రెస్‌ బీభత్సకాండ *
కడప, నల్గొండ జిల్లాల్లో బాంబుల మోత *
సీమలో యథేచ్ఛగా బూత్‌ల ఆక్రమణ *
దేశం ఏజెంట్ల తరిమివేత *
పోలింగ్‌ ఏజెంటుగా ఎమ్మెల్యే సుజాతమ్మ *
గన్‌మెన్‌తో గౌరు చరిత 'పర్యవేక్షణ' *
డోన్‌లో తెదేపా తిరుగుబాటు నేతల హత్య *
పలుచోట్ల లాఠీఛార్జీలు, గాలిలోకి కాల్పులు *
వేలాది ఓట్లు గల్లంతు *

గుర్తింపు పత్రాల్లేక వెనుదిరిగిన ఓటర్లు. 25 చోట్ల రీపోలింగ్‌!

ఎమ్మెల్యేలు పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించకూడదు *
నాయకులు గన్‌మెన్‌ను వెంటబెట్టుకుని పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాకూడదు *
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలు కల్పించాలి *
పోలీసులు, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి *


ఇవన్నీ కాగితాల్లో ఉండే ఎన్నికల నిబంధనలు. మరి బుధవారం 11 జిల్లాల్లో స్థానిక ఎన్నికల పోలింగ్‌ ఎలా జరిగింది?

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని కోయిలకొండ పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పోలింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నారు *
అదే జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గౌరు చరిత బ్రాహ్మణకొట్కూరు పోలింగ్‌ కేంద్రం వద్దకు గన్‌మెన్‌తో సహా వచ్చి పోలింగ్‌ను 'పర్యవేక్షించారు' *
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప, హోంమంత్రి జానారెడ్డి సొంత నియోజకవర్గం చలకుర్తి బాంబుల మోతతో దద్దరిల్లాయి *

కాంగ్రెస్‌ కార్యకర్తలు గోడ కూలగొట్టి మరీ లోనికి ప్రవేశించి బలవంతంగా ఓట్లేసుకున్నారు. పలుచోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దగ్గరుండి పోలింగ్‌ను పర్యవేక్షించారు. పోలీసులు, పోలింగ్‌ సిబ్బంది అధికార పార్టీకి యథాశక్తి సహకరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు పదుల సంఖ్యలో వాహనాలను ఉపయోగించారు.

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌లో ఒకే పార్టీకి ఓట్లు పడుతున్నాయని ఆగ్రహించిన పోలింగ్‌ క్లర్క్‌ బ్యాలెట్‌ బాక్సులో ఇంకు పోశారు.

వేమవరంలో రెండు బూత్‌లను కాంగ్రెస్‌ వారు ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. బంటుమిల్లిలో బ్యాలెట్‌ పత్రాలు పట్టుకుపోవడానికి ప్రయత్నించారు. విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి.

కడప జిల్లాలో తెలుగుదేశానికి పోలింగ్‌ ఏజెంట్లే లేని పరిస్థితిని అధికార పార్టీ సృష్టించగా... అనంతపురం జిల్లాలో చాలాచోట్ల వారిని పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లనీయలేదు. ప్రత్యేకించి రాయలసీమలో అధికార యంత్రాంగం కాంగ్రెస్‌కు పూర్తిగా సహకరించింది.

ప్రజాస్వామ్య మంటే ఇదేనా? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యక దేశం మనది మరి. ఇంత జరిగినా 72.4 శాతం పోలింగ్‌ నమోదయ్యిందట. ఏది నిజమో పైవాడి కెరుక.

Sunday, June 11, 2006


మాంసాహారం


ప్రసాద్‌ గారి చరసాల(charasala)లో మాంసాహారం గురించి చదివాక ఆయన ఆవేదన తెలిసింది.

స్వాతి గారన్నట్లు అవసరం, కోరిక, విచక్షణ లను అదుపులో పెట్టుకోగలిగేది మానవుడు మాత్రమే. వాడెవడో చెయ్యటం లేదు, వీడెవడో చెయ్యటం లేదు అనటం కన్నా ముందు మనం నిఝంగా మారితే, మారి సంతోషంగా వుంటే ... ఆ మనని చూసి మారే వారే ఎక్కువ, బోధనలవల్ల మారేవారి కన్నా. జంతు పరిరక్షణ, ఇంకోటో, మరింకో పేరుతోనే ప్రపంచమంతా వుండే ఈ జంతు ప్రేమ సంఘాల్లోని సభ్యులెంత మంది శాకాహారులో మీకేమైనా తెలుసా? వీళ్ళందరూ కుక్కకు బిస్కట్టో (లేదా మరోటో) ఆశ పెట్టి యాక్ట్‌ చేయిస్తే వూరు కోరు తెలుసా, అది జంతు హింసట!

నారాయణరావు గారు డైరెక్టుగా "నేను మానేశాను, నా కడుపు చచ్చిన/చంపిన జంతువులకు సమాధులు కాకూడదని" అన్నారు. గుడ్‌. పెద్దవారు మీకు తెలియదని కాదు, ఇష్టంతో చేసే పని వలన ఫలితం వుంటుంది కానీ, అయిష్టంతో చేస్తే కాదు - యోగమైనా, భోగమైనా. మీరు ఆ రీతిగా సెలవిచ్చుంటే బాగుండేది. మీ దగ్గరినుండి మరికొన్ని విషయాలు నేర్చుకొన్నట్లయ్యేది.

రోహిణీ కుమార్‌ గారూ, హిట్లర్‌ ఆ ఒక్కటే కాదు చాలా మంచి పనులు చేశాడు. చూసేవాడి ఆలోచనల బట్టి ఎదుటివాడు అర్థమౌతాడంట, అలాగే హిట్లర్‌ను విలన్‌గా చూసే కొద్దీ పాపాలు బోల్డన్ని కనబడుతాయి. నాణేనికి రెండోవైపు చూడడం ప్రారంభించారు. కంగ్రాట్స్‌. ఇంకొకటి, దూడ తాగితే మహా అయితే రోజుకి మూడు, నాలుగు లీటర్లు తాగుతుందా...? ఇప్పటి ఆవులు లేదా గేదలు దగ్గర దగ్గర పది లీటర్ల పాలనిస్తాయి కదా ... మిగతా వాటినేం చేద్దామంటారు? I hope you got my point.

వెంకటరమణ గారి అ),ఆ) లకు:
జంతువులను చంపితే బాధ పడేవారి కన్నా (లేదా బాధపడే వారు లేరనుకున్నా)మనుషులను చంపితే బాధ పడేవారున్నారు కనుక జంతువులను చంపితే తప్పు లేదు, మనుషులను చంపితే తప్పే నంటారు. అయితే ఎవరూ ఆధారపడని అనాధలను, వృద్ధులను (మనుషులైనా సరే) చంపితే, చంపి ఉపయోగిస్తే (ఏదో రకంగా) తప్పులేదా? ఇంకపోతే, జంతువులే కాదు, చెట్లకు కూడా స్పందనలుంటాయని, బాధలుంటాయని (మానసికంగా కూడా) చాలా సార్లు నిరూపణయ్యింది. యజమాని చనిపోతే బాధపడి ఆహారాదులు మానేసి చనిపోయిని పెంపుడు జంతువులెన్నో!

ఇ),ఈ) ఈ విషయంలో మీతో పూర్తి గా ఏకీభవిస్తా, పని చేయించుకోవడానికీ, హింసించడానికీ చాలా తేడావుంది. అలాగే చనిపోయిన వాటిని (చంపిన వాటిని కాదు)వాడుకోవడంలోనూ తప్పులేదు.


ప్రసాద్‌ గారూ, మీ అభిప్రాయం మీరు చెప్పారు. కాదు చాలా చక్కగా వెలిబుచ్చారు. అబ్బా, అమ్మా అంటేనే, లేదా ఏడిస్తేనే మనకు అవతలి వ్యక్తి బాధపడుతున్నాడని తెలుస్తుంది, ఎందుకంటే మనమూ వారిలాంటి వారమే, మనకూ బాధ కలిగితే అలాగే ఏడుస్తాం కనక. కానీ మనకు తెలియని వేషభాషలూ, ఆచార వ్యవహారాలూ వున్నవాటి సంగతో? వాటి బాధను ఎక్స్‌ప్రెస్‌ చేసే విధానం మనకు అర్థం కాకపోతేనో? పెద్దవారు నారాయణరావు గారు లేదా వారిలాంటి అనుభవజ్ఞులేమైనా సలహా చెబుతారేమో .. తార్కికంగా. He knows a lot more. అలాగే ప్రకృతి నిర్ణయించిన ఆహార చక్రాన్ని నియంత్రించడనికి మనమెవరం? మనమేం చేసినా చేయక పోయినా, తన స్థితి అసమతౌల్యానికి గురైనప్పుడు ప్రకృతి తన సమతౌల్యనికి చేయవలసినదేదో అదే చేస్తుంది, జంతువులు బాధ పడవు, మనుషులు బాధపడతారు అనిమాత్రం చూడదు.

చివరగా నేను మాంసాహారినే కానీ మాంసం తినను చిన్నప్పటినుంచీ, ఒక్క కోడి గుడ్డు తప్ప.(అందుకే నన్ను ఎగ్గేరియన్‌ అంటారు). నేను ఒకప్పుడు చికెన్‌, మటన్‌ లాంటివి తినడానికి ట్రై చేసాను కానీ తినలేక పోయాను .. నాకెందుకో తినాలనిపించలేదు. అలాగే నాకు ఊహ తెలిసినప్పటినుంచీ పాలూ, కాఫీ, టీ కూడా తాగను - కానీ మజ్జిగ మాత్రం ఇష్టంగా తాగుతా.

మాంసాహారం తినటం వల్ల వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. జంతువుల గురించి ఆలోచించకుండా, ముందు మన గురించి ఆలోచించండి - మన ఆరోగ్యం మనకు ముఖ్యం కదా! మనం మనకోసమే బతకాలి, అదీ పక్కవార్ని ఇబ్బంది పెట్టకుండా సుమా! మన తరువాతే ఎవరైనా. ఇది (సామాన్యులైన) మనందరికీ వర్తించే నిఝమైన నిజం.

Friday, June 09, 2006


మత మార్పిళ్లు


ఇటీవల భారత కొత్త రాయబారిని ఆహ్వానిస్తూ పోప్‌ బెనెడిక్ట్‌ చేసిన వ్యాఖ్యలు.

* "ఏ కారణంతోనూ - ప్రత్యేకించి జాతి, మతపరమైన లేదా సామాజిక స్థాయిని బట్టి పౌరులెవరూ ఎలాంటి విచక్షణకు గురికాకుండా భారత్‌ చూడాలి."

అంటే ప్రస్తుతం అలా జరగటం లేదనా? ఏ రకమైన విచక్షణ గురించి ఆయన అలా మాట్లాడు తున్నారు? మన లౌకిక, ప్రజాస్వామ్యిక రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల గురించి కానీ, పార్లమెంటు, సుప్రీం కోర్టు వంటివి వాటిని నిర్నిరోధంగా అమలు పరచడాన్ని గురించి ఆయనకు అవగాహన వుందా?

భారత దేశంలో హిందువుల జనాభా 80%, అయినప్పటికీ మన రాష్ట్రపతి ముస్లిం, ప్రధానమంత్రి సిక్కు, సర్వాధికారిణిగా వ్యవహరిస్తున్న సోనియా గాంధీ రోమన్‌ కాథలిక్‌ (అందులోనూ ఇటలీ దేశస్థురాలు)

* "మౌలిక హక్కుగా వున్న మతపరమైన స్వేచ్చపై విచక్షణపూరిత నియంత్రణలు విధిస్తూ చట్టాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి."

మోసంచేసి, బలవంతపెట్టి లేదా ప్రలోభ పరచి మత మార్పిళ్ళకు పాల్పడటాన్ని నిషేదిస్తూ కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేయడం పోప్‌కు కలవరం కలిగించినట్లయింది. ఈ మథ్య రాజస్థాన్‌, నాలుగు దశాబ్దాల క్రితం మథ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలు చట్టవ్యతిరేక పద్ధతుల ద్వారా బలవంతంగా మతమార్పిళ్లు చేయడాన్ని నిషేధించాయి. జనమనోభావాల్ని దెబ్బ తీసేవిధంగా ఒక మతంలోంచి మరో మతంలోకి మార్పిళ్లు జరరపపడాన్ని నిషేధించి సామాజిక అలజడిని నిరోధించడానికే ఈ రాష్ట్రాలు ఇలాంటి చట్టాలు చేశాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

* "ఇవి రాజ్యాంగ విరుద్ధమైనవే కాకుండా నవభారత నిర్మాతల ఉన్నత ఆశయ, ఆదర్శాలకు వ్యతిరేకమైన అలంటి చర్యల్ని తిప్పికొట్టాలి."

ఈ ఒక్క విషయంలో మాత్రం యావత్భారతదేశం ఆయనతో ఏకీభవిస్తుంది. నిజానికి మతమార్పిడి నిరోధక చట్టాలు రాజ్యాంగ నిర్మాతల అభిమతానికి అనుగుణంగానే వున్నాయి. 25వ అధికరణంలో వుపయోగించాల్సిన పదజాలం పై రాజ్యాంగ సభలో తీవ్రస్థాయి చర్చ జరిగింది. "మతబోధన, ఆచరణ, ప్రచారం" అన్నది పౌరులందరి మౌలిక హక్కుగా వుండాలని క్రైస్తవ ప్రతినిధులు వాదించారు. ప్రచారం అన్న పదాన్ని తొలగించాలని అనేక మంది పట్టుబట్టారు. అంతేకాదు బలవంతంగానో, ప్రలోభపరిచో మత మార్పిడికి పాల్పడటం ఇప్పుడైనా, ఎప్పుడైనా చట్ట విరుద్ధమేనని, అందువల్ల మత మార్పిడులను నిషేధిస్తూ నిర్ధిష్ట నిబంధనలను పొందుపరచవలసిన అవసరం లేదని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తెలిపారు. చివరకు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ మత మార్పిళ్ల నియంత్రణ కోసం చట్టాలు చేసే అంశాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టాలన్న సూచనను అందరూ అంగీకరించారు.

* "భారత రాజ్యాంగంలోని 25(1) అధికరణంలో హామీ యిచ్చిన ప్రకారం ఒక మతానికి ప్రచారం కల్పించుకొనే హక్కు కల్పించడమంటే, ఇతరులను ఆ మతంలోకి మార్చేందుకు హక్కు కల్పించడమే" - రెవరెండ్‌ స్టెయినిస్లాస్‌

మథ్యప్రదేశ్‌ రాష్ట్రం చేసిన నిషేధ చట్టానికి వ్యతిరేకంగా స్టెయినిస్లాస్‌ తన పిటిషన్‌లో సవాలు చేశారు. కానీ ఆయన పై వాదన వీగిపోయింది. "వేరే మతానికి చెందిన వ్యక్తిని తన మతంలోకి మార్చే హక్కును పౌరుడికి 25(1) అధికరణ ఇవ్వడంలేదు. తన మతంలోని విశేషాంశాలను ప్రచారం చేసి, వ్యాప్తి చేసుకొనే స్వేచ్చ మాత్రమే యిస్తోంది. ఒకరికి ఎంత స్వేచ్ఛవుంటుందో మరొకరికీ అంతే స్వేచ్ఛవుంటుంది. అందువల్ల మరొకరిని తన మతంలోకి మార్చుకొనడం మౌలిక హక్కు ఎంత మాత్రం కాదు" అని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

109 ఎకరాల వాటికన్‌లో మొత్తం 932 మంది నివాసం వుంటే, వారిలో 555 మంది మాత్రమే పౌరులు. వీరంతా రోమను కాథలిక్కులే. కానీ భారత్‌లో జనాభా 110 కోట్లకు పైమాటే. వీరంతా ప్రపంచంలోని ప్రధాన మతాలకు చెందిన వారే. ప్రపంచంలో అతి చిన్న దేశం, పైగా మత రాజ్యం వాటికనైతే, ప్రపంచంలో అతి పెద్ద లౌకిక, ప్రజాస్వామ్యిక దేశం భారత దేశం. ఇంతటి దేశానికి వాటికన్‌ ధర్మోపదేశం చేయాల్సిన పనిలేదు.

(ఈనాడులో ప్రముఖ పాత్రికేయులు ఎ. సూర్య ప్రకాశ్‌)