Thursday, June 29, 2006


ఇదేనా ప్రజాస్వామ్యం?


తొలిదశలో ఎన్నికలు జరిగిన 11 జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగిస్తుంది. 2001లో తెదేపా హయాంలో జరిగిన వాటితోపోలిస్తే ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి
---వైయ్యస్‌.


స్థానిక సంస్థల తొలిదశ పోలింగ్‌లో అధికార పార్టీ అన్ని రకాల అక్రమాలకూ పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ స్వీయ ఆదేశాల మేరకే అన్నిజిల్లాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు రెచ్చిపోయాయి.
---చంద్రబాబు


కాంగ్రెస్‌ బీభత్సకాండ *
కడప, నల్గొండ జిల్లాల్లో బాంబుల మోత *
సీమలో యథేచ్ఛగా బూత్‌ల ఆక్రమణ *
దేశం ఏజెంట్ల తరిమివేత *
పోలింగ్‌ ఏజెంటుగా ఎమ్మెల్యే సుజాతమ్మ *
గన్‌మెన్‌తో గౌరు చరిత 'పర్యవేక్షణ' *
డోన్‌లో తెదేపా తిరుగుబాటు నేతల హత్య *
పలుచోట్ల లాఠీఛార్జీలు, గాలిలోకి కాల్పులు *
వేలాది ఓట్లు గల్లంతు *

గుర్తింపు పత్రాల్లేక వెనుదిరిగిన ఓటర్లు. 25 చోట్ల రీపోలింగ్‌!

ఎమ్మెల్యేలు పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించకూడదు *
నాయకులు గన్‌మెన్‌ను వెంటబెట్టుకుని పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాకూడదు *
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలు కల్పించాలి *
పోలీసులు, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి *


ఇవన్నీ కాగితాల్లో ఉండే ఎన్నికల నిబంధనలు. మరి బుధవారం 11 జిల్లాల్లో స్థానిక ఎన్నికల పోలింగ్‌ ఎలా జరిగింది?

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని కోయిలకొండ పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పోలింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నారు *
అదే జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గౌరు చరిత బ్రాహ్మణకొట్కూరు పోలింగ్‌ కేంద్రం వద్దకు గన్‌మెన్‌తో సహా వచ్చి పోలింగ్‌ను 'పర్యవేక్షించారు' *
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప, హోంమంత్రి జానారెడ్డి సొంత నియోజకవర్గం చలకుర్తి బాంబుల మోతతో దద్దరిల్లాయి *

కాంగ్రెస్‌ కార్యకర్తలు గోడ కూలగొట్టి మరీ లోనికి ప్రవేశించి బలవంతంగా ఓట్లేసుకున్నారు. పలుచోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దగ్గరుండి పోలింగ్‌ను పర్యవేక్షించారు. పోలీసులు, పోలింగ్‌ సిబ్బంది అధికార పార్టీకి యథాశక్తి సహకరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు పదుల సంఖ్యలో వాహనాలను ఉపయోగించారు.

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌లో ఒకే పార్టీకి ఓట్లు పడుతున్నాయని ఆగ్రహించిన పోలింగ్‌ క్లర్క్‌ బ్యాలెట్‌ బాక్సులో ఇంకు పోశారు.

వేమవరంలో రెండు బూత్‌లను కాంగ్రెస్‌ వారు ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. బంటుమిల్లిలో బ్యాలెట్‌ పత్రాలు పట్టుకుపోవడానికి ప్రయత్నించారు. విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి.

కడప జిల్లాలో తెలుగుదేశానికి పోలింగ్‌ ఏజెంట్లే లేని పరిస్థితిని అధికార పార్టీ సృష్టించగా... అనంతపురం జిల్లాలో చాలాచోట్ల వారిని పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లనీయలేదు. ప్రత్యేకించి రాయలసీమలో అధికార యంత్రాంగం కాంగ్రెస్‌కు పూర్తిగా సహకరించింది.

ప్రజాస్వామ్య మంటే ఇదేనా? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యక దేశం మనది మరి. ఇంత జరిగినా 72.4 శాతం పోలింగ్‌ నమోదయ్యిందట. ఏది నిజమో పైవాడి కెరుక.

2 comments:

spandana said...

అసలు ఈ రాజకీయ మహమ్మారి మానవత్వాన్నే మంటకలిపేస్తోంది. ఆ అమరావతి ఘోరఖలి చూస్తే మనం మనుషులమేనా అనిపిస్తుంది. పెద్ద పెద్ద బండరాళ్ళతో ఒక మనిషి మీద పదిమంది పడి దొరికినచోటల్లా మోది చంపడం!!!! బహిరంగంగా కెమరా సాక్షిగా! ప్రజల్లో పాపభీతి ఏమయ్యింది! దేవుడు లేడనే వీళ్ళకీ తెలిసిపోయిందా?
-- ప్రసాద్

Unknown said...

మురళీకృష్ణ గారు:
మీకు చైనీసు అభిమానులు కూడా ఉన్నట్టున్నారే ;)