Friday, June 09, 2006


మత మార్పిళ్లు


ఇటీవల భారత కొత్త రాయబారిని ఆహ్వానిస్తూ పోప్‌ బెనెడిక్ట్‌ చేసిన వ్యాఖ్యలు.

* "ఏ కారణంతోనూ - ప్రత్యేకించి జాతి, మతపరమైన లేదా సామాజిక స్థాయిని బట్టి పౌరులెవరూ ఎలాంటి విచక్షణకు గురికాకుండా భారత్‌ చూడాలి."

అంటే ప్రస్తుతం అలా జరగటం లేదనా? ఏ రకమైన విచక్షణ గురించి ఆయన అలా మాట్లాడు తున్నారు? మన లౌకిక, ప్రజాస్వామ్యిక రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల గురించి కానీ, పార్లమెంటు, సుప్రీం కోర్టు వంటివి వాటిని నిర్నిరోధంగా అమలు పరచడాన్ని గురించి ఆయనకు అవగాహన వుందా?

భారత దేశంలో హిందువుల జనాభా 80%, అయినప్పటికీ మన రాష్ట్రపతి ముస్లిం, ప్రధానమంత్రి సిక్కు, సర్వాధికారిణిగా వ్యవహరిస్తున్న సోనియా గాంధీ రోమన్‌ కాథలిక్‌ (అందులోనూ ఇటలీ దేశస్థురాలు)

* "మౌలిక హక్కుగా వున్న మతపరమైన స్వేచ్చపై విచక్షణపూరిత నియంత్రణలు విధిస్తూ చట్టాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి."

మోసంచేసి, బలవంతపెట్టి లేదా ప్రలోభ పరచి మత మార్పిళ్ళకు పాల్పడటాన్ని నిషేదిస్తూ కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేయడం పోప్‌కు కలవరం కలిగించినట్లయింది. ఈ మథ్య రాజస్థాన్‌, నాలుగు దశాబ్దాల క్రితం మథ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలు చట్టవ్యతిరేక పద్ధతుల ద్వారా బలవంతంగా మతమార్పిళ్లు చేయడాన్ని నిషేధించాయి. జనమనోభావాల్ని దెబ్బ తీసేవిధంగా ఒక మతంలోంచి మరో మతంలోకి మార్పిళ్లు జరరపపడాన్ని నిషేధించి సామాజిక అలజడిని నిరోధించడానికే ఈ రాష్ట్రాలు ఇలాంటి చట్టాలు చేశాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

* "ఇవి రాజ్యాంగ విరుద్ధమైనవే కాకుండా నవభారత నిర్మాతల ఉన్నత ఆశయ, ఆదర్శాలకు వ్యతిరేకమైన అలంటి చర్యల్ని తిప్పికొట్టాలి."

ఈ ఒక్క విషయంలో మాత్రం యావత్భారతదేశం ఆయనతో ఏకీభవిస్తుంది. నిజానికి మతమార్పిడి నిరోధక చట్టాలు రాజ్యాంగ నిర్మాతల అభిమతానికి అనుగుణంగానే వున్నాయి. 25వ అధికరణంలో వుపయోగించాల్సిన పదజాలం పై రాజ్యాంగ సభలో తీవ్రస్థాయి చర్చ జరిగింది. "మతబోధన, ఆచరణ, ప్రచారం" అన్నది పౌరులందరి మౌలిక హక్కుగా వుండాలని క్రైస్తవ ప్రతినిధులు వాదించారు. ప్రచారం అన్న పదాన్ని తొలగించాలని అనేక మంది పట్టుబట్టారు. అంతేకాదు బలవంతంగానో, ప్రలోభపరిచో మత మార్పిడికి పాల్పడటం ఇప్పుడైనా, ఎప్పుడైనా చట్ట విరుద్ధమేనని, అందువల్ల మత మార్పిడులను నిషేధిస్తూ నిర్ధిష్ట నిబంధనలను పొందుపరచవలసిన అవసరం లేదని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తెలిపారు. చివరకు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ మత మార్పిళ్ల నియంత్రణ కోసం చట్టాలు చేసే అంశాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టాలన్న సూచనను అందరూ అంగీకరించారు.

* "భారత రాజ్యాంగంలోని 25(1) అధికరణంలో హామీ యిచ్చిన ప్రకారం ఒక మతానికి ప్రచారం కల్పించుకొనే హక్కు కల్పించడమంటే, ఇతరులను ఆ మతంలోకి మార్చేందుకు హక్కు కల్పించడమే" - రెవరెండ్‌ స్టెయినిస్లాస్‌

మథ్యప్రదేశ్‌ రాష్ట్రం చేసిన నిషేధ చట్టానికి వ్యతిరేకంగా స్టెయినిస్లాస్‌ తన పిటిషన్‌లో సవాలు చేశారు. కానీ ఆయన పై వాదన వీగిపోయింది. "వేరే మతానికి చెందిన వ్యక్తిని తన మతంలోకి మార్చే హక్కును పౌరుడికి 25(1) అధికరణ ఇవ్వడంలేదు. తన మతంలోని విశేషాంశాలను ప్రచారం చేసి, వ్యాప్తి చేసుకొనే స్వేచ్చ మాత్రమే యిస్తోంది. ఒకరికి ఎంత స్వేచ్ఛవుంటుందో మరొకరికీ అంతే స్వేచ్ఛవుంటుంది. అందువల్ల మరొకరిని తన మతంలోకి మార్చుకొనడం మౌలిక హక్కు ఎంత మాత్రం కాదు" అని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

109 ఎకరాల వాటికన్‌లో మొత్తం 932 మంది నివాసం వుంటే, వారిలో 555 మంది మాత్రమే పౌరులు. వీరంతా రోమను కాథలిక్కులే. కానీ భారత్‌లో జనాభా 110 కోట్లకు పైమాటే. వీరంతా ప్రపంచంలోని ప్రధాన మతాలకు చెందిన వారే. ప్రపంచంలో అతి చిన్న దేశం, పైగా మత రాజ్యం వాటికనైతే, ప్రపంచంలో అతి పెద్ద లౌకిక, ప్రజాస్వామ్యిక దేశం భారత దేశం. ఇంతటి దేశానికి వాటికన్‌ ధర్మోపదేశం చేయాల్సిన పనిలేదు.

(ఈనాడులో ప్రముఖ పాత్రికేయులు ఎ. సూర్య ప్రకాశ్‌)

No comments: