మా టీవీ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 కు 'గుర్తుకొస్తున్నాయి' అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. అప్పుడప్పుడు సినిమాల కోసం, పాటల కోసం టీవీ పెట్టే నేను ఈ రోజెందుకో ఛానల్స్ స్కాన్ చేస్తూండగా మా టీవీ లో ఈ కార్యక్రమం చూట్టం జరిగింది. క్లుప్తంగా కార్యక్రమం ఏమిటంటే సమాజంలోని అలనాటి (మరచిపోయిన)లబ్దప్రతిష్ఠులను పిలిచి వాళ్ళ మధురస్మృతులను మనతో పంచుకొనే కార్యక్రమం. నిజంగానే బాగుంది. చాలా టీవీల్లో చూసే ఇంటర్వ్యూల్లోలాగా కాకుండా ఇందులోని ఏంకర్ /ఇంటర్వ్యూయర్ రఘు కుంచే పిలిచిన వాళ్ళచేతే ఎక్కువ సేపు మాట్లాడించాడు.మొదట పొడి పొడిగా మొదలైనా కొద్ది సేపట్లో వాళ్ళు తమ మనసు పొరల్లోకి వెళ్ళి ఎన్నో సంగతులు చెప్పారు.
ఈ రోజు బి.వసంత గారితో 'గుర్తుకొస్తున్నాయి'. వాగ్ధానం చిత్రంతో గాయనీమణిగా ప్రవేశం చేసిన వసంత గారు ఎన్నో విషయాలు చెప్పారు. తన మొదటి పాటలు, తోటి గాయకుల విశేషాలు, తను పనిచేసిన సంగీతదర్శకులు తో అనుభవాలు ఎన్నో గుర్తు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఆవిడ సంగీత దర్శకత్వం వహించిన ఒక కన్నడ, ఒక తెలుగు చిత్రాల గురించీ చెప్పారు. సుమారు 3000 పాటలు పాడిన ఆవిడ, వాటితో పాటు ఇంకా పదును తగ్గని ఆవిడ కంఠస్వరంతో ఆపాత మధురాలనీ వినిపించారు.
ఆసక్తి వున్నవాళ్ళు చూడండి. వచ్చేవారం ఒకప్పటి సూపర్ హీరోయిన్ 'కృష్ణవేణి' గారితో కార్యక్రమం. కృష్ణవేణిగారి గురించి ఓ రెండు ముక్కలు. అక్కినేని 'కీలుగుఱ్ఱం' సినిమాలో హీరోయిన్ ఈవిడ. రామారావు గారి మొదటి సినిమా 'మనదేశం' కు నిర్మాత ఈవిడే. ఇంకా ఎన్నో విషయాలు ఆవిడా నోటిద్వారా తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం 10:30 కు మాటీవీ చూడండి.
(ఇది మాటీవీ వారికి సంబంధించిన ప్రకటన మాత్రం కాదు)
Sunday, July 16, 2006
గుర్తుకొస్తున్నాయి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment