Tuesday, December 23, 2008


కాకలు తీరిన వీరులు - 2(ఆ)


"అర్రెర్రే... ఇదేమిటిలా జరిగింది. ఎంతో ప్లాన్ చేసి పకడ్బందీగా అమలు చేసినా ఓడిపోయామేమిటి" అనుకుంటూ అమెరికన్లు కారణాలు వెతకటం మొదలెట్టారు. వీళ్ళేంచేసినా పద్ధతి ప్రకారం చేస్తారు కనుక, వెంటనే బడ్జెట్ కేటాయింది రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ కమిటీ ఒహటి వేసి దానికో బట్టతలని ఛైర్మన్ చేశారు. ఓ నెల్రోజులు అన్ని రకాలు గానూ స్టడీ చేసి వాళ్ళిలా చెప్పారు.

"ఇదంతా కో-ఆర్డినేషన్ ప్రాబ్లెం. తెడ్డేసే వాళ్ళు ఒకే రిథమ్ లో వేయక పోవడం వలన ముందు వెనకలయ్యి, డైరెక్షన్ బేలన్స్ కాక పడవ వంకర టింకరగా వెళ్ళింది. దాని వల్ల ప్రయాణం చేయాల్సిన 5 కి.మీ దూరానికి గానూ 5.78కి.మీ ప్రయాణం చేయాల్సి వచ్చింది." ఈ రిపోర్టు చదివిన తల పండిన గురూజీ గారు - దాన్ని అనలైజ్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చెయ్యటానికి ఓ అనలిస్ట్ ను రిక్రూట్ చేసుకున్నారు. ఈ అనలిస్టు గారు రిక్రూట్‌మెంట్ స్పెషలిస్టును, కోచ్‌ను, ఫిట్‌నెస్ ట్రైనర్‌నూ పిలిచి మీటింగ్ పెట్టాడు. మీటింగ్‌కు గురూజీకూడా హాజరయ్యారు. మరి గురూజీ వచ్చారంటే వారితో పాటూ పియ్యేగారు కూడా విచ్చేశారు. ఓ రోజంతా కష్టపడి విచారించీ విచారించీ ఇలా తేల్చారు.

రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ కమిటీ వారి రిపోర్టు ప్రకారం కో-ఆర్డినేషన్ లేదు కనుక, తెడ్డేసేవాళ్ళలో కో-ఆర్డినేషన్ తెచ్చేందుకు ఓ వారం రోజుల పాటు కో-ఆర్డినేషన్ మీద స్పెషల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ క్లాసు, పడవమీద వాళ్ళ వాళ్ళకు ఆన్ సైట్ సలహాలిచ్చేందుకు ఇద్దర్ని రిక్రూట్ చేసేందుకూ నిర్ణయించారు. ఇద్దరెందుకంటే ఒకరు కుడివైపువారికి, ఇంకొకరు ఎడమ వైపు వారికీ సలహాలిచ్చేందుకట.

జపనీయుల్ని కాంటాక్ట్ చేసి "రెణ్ణెల్లలో మళ్ళా పోటీ చేద్దాం -- ఓడిపోవడానికి సిద్ధంకండి" అంటూ మెస్సేజ్ పంపారు. జపనీయులు "ఓకే" అంటూ రెండక్షరాల రిప్లై పంపారు.

ఇక్కడ తెడ్డేసే వాళ్ళు ఫుల్ బిజీ - కో-ఆర్డినేషన్ క్లాసులూ, ఫిట్‌నెస్ ట్రైనింగులూ ... మరచిపోయా ... మీటింగ్‌లో ఇంకో విషయం కూడా డిసైడయ్యింది - తెడ్డేసే వాళ్ళ బలం పెరిగేందుకు బలవర్థకమైన ఆహారం ఇచ్చేందుకు డైటీషియన్, ప్రత్యేక కేటరర్‌ను కూడా నియమించారు. ఇలా వీటితో రెండు నెలలు గడిచాయి. పోటీ టైమ్ వచ్చింది.

యధాప్రకారం పడవలు నీళ్ళలో దించారు. 20 మంది తెడ్డేసేవాళ్ళు, కోచ్, మరిద్దరు కో-ఆర్డినేషన్ సలహాదార్లు. కానీ పడవలో 21 మందికే చోటు. చివరికి కో-ఆర్డినేషన్ లేకనే క్రితం సారి ఫెయిలయ్యారు కనుక కో-ఆర్డినేషన్ సలహాదార్లు తప్పనిసరని, వారికోసం ఇద్దరు తెడ్డేసేవాళ్ళని పడవ దించేశారు.

తుపాకీ పేలింది - పోటీ మొదలయ్యింది. మీరనుకుంటున్నట్లుగానే మళ్ళా ప్రాచ్యుల్నే విజయం వరించింది.

సస్పెన్సేమీ లేదు - ఈ పాటికి మీకు విషయం అర్థమయ్యేవుంటుంది. కానీ కథింకా అవలేదు.

రెండుసార్లు ఓడిపోయిన రోషంతో ఈ సారి గురూజీ గారే రంగంలోకి దిగారు - ఒక్కళ్ళే కాదు - సపరివార సమేతంగా. మీటింగులు, ఓటింగులయ్యాయి. ఓటమికి కారణాలు తెలిసాయి. (మీరనుకుంటున్నట్లుగా కాదు) ఫలితం ... కోచ్‌లూ, ఫిట్‌నెస్ ట్రైనర్‌లూ, కో-ఆర్డినేషన్ సలహాదార్లూ సరిగా పనిచేసినా, తెడ్డేసేవాళ్ళు సరిగా పని చెయ్యలేకపోవడం వలన ఇలాజరిగింది. కారణం మోటివేషన్ సరిగా లేకపోవడం. పైగా వీళ్ళలో కొందరు తొందరగా అలసిపోతున్నారు కూడా. మళ్ళీ పని మొదలెట్టారు. మోటివేషన్ క్లాసులూ, కోచింగూ, కో-ఆర్డినేషన్ క్లాసులూ, ఫిట్‌నెస్ ట్రైనింగులూ అన్నీ అయ్యాయి. యధా ప్రకారం జపనీయుల్ని కాంటాక్ట్ చేసి రెణ్ణెల్లలో మళ్ళీ పోటీ చేద్దాం అన్నారు - (ఎందుకైనా మంచిదని ఓడిపోవడానికి సిద్ధంకండని మాత్రం అనలా).

పడవలో ఎంతమంది పడతారో ఈ సారి ముందుగానే తెలుసు కనుక మొత్తం 21 మందీ రడీ అయ్యారు. ఈ సారి గురూజీగారు ప్రత్యక్షంగా తమ వాళ్ళ పెర్ఫార్మెన్సు చూడాలని ముచ్చట పడ్డారు కూడానూ. దాంతో పడవలో గురూజీ గారు, వారి తోక, గురూజీ వారి ఉత్సాహాన్ని చూసి ఉద్రేకపడ్డ అనలిస్టూ, కో-ఆర్డినేషన్ సలహాదార్లూ, కోచ్, కొత్తగా మోటివేషన్ స్పెషలిస్టూ, వీళ్ళేడుగురూ పోతే మిగిలిన 14 మంది తెడ్డేసేవాళ్ళతో ముచ్చటగా మూడవసారి పోటీ ప్రారంభమయ్యింది.

పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికి, ఈ ఏడుగురి సలహాలు, సూచనలూ మొదలయ్యాయి. ఒకడలా అంటే, ఇంకోడిలా అంటాడు. తొందరగా అంటారు, మెల్లిగా అంటారు, వార్మప్ అంటారు, కో-ఆర్డినేషనంటారు, మోటివేషనంటారు. తెడ్డేసేవాళ్ళకి ఓపిక నశించింది. వాళ్ళలో కొద్దిగా నోరుండేవాడు లేచి, "పనిచేసే వాళ్ళని తీసేసి, పనికిమాలిన సలహాలిచ్చే మీరందరూ ఎక్కితే ఇంక పడవెలా ముందుకు సాగుతుంది. 21 మంది తెడ్డేస్తేనే గెలవలేనివాళ్ళం, మీలాంటివాళ్ళెంత మందొచ్చి ఇలా బోడి సలహాలిచ్చినా 14 మందితో ఎలా గెలుస్తామనుకున్నారు. పైగా మీ బరువొకటి. ఓడిపోతే మళ్ళా మీరు మా బరువెక్కువైందని ఇంకో నలుగుర్ని పీకకామానరు. మాకిలాక్కాదు గానీ, మీరే తెడ్డేసి గెలచి ఆ కప్పేదో మీరే తీసుకోండి" అని 14 మందితో కలిసి నీళ్ళలో దూకి యీదుకుంటూ ఒడ్డుకొచ్చేసారు.

ట్విస్టేంటంటే, ఇంతకాలం కథనడిపిన మన పెద్దతలకాయలెవ్వరికీ తెడ్డేయటం కాదు కదా ఈత కూడా రాదు. కోచ్ ఏదో కష్టపడి భారీకాయంతో ఈదలేక ఈది రొప్పుతూ బయటపడ్డాడు. మిగిలినవారెవ్వరూ హెల్ప్ హెల్ప్ అని అరవటం మినహా మరేం చేయలేక పోయారు. చివరికి జపనీయులే వాళ్ళని ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రహసనమంతా విన్న అప్రాచ్య ప్రభుత్వం కమిటీని రద్దుచేసింది. అదండీ సంగతి.

Tuesday, December 09, 2008


కాకలు తీరిన వీరులు - 2(అ)


ఎప్పుడో మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు మేమందరం సరదాగా చెప్పుకునే జోకొకటి.

మేనేజ్‌మెంట్ రంగంలో అనేక పరిశోధనలు, ప్రయోగాలు చేసి - అభివృద్ది ఎలా చెయ్యాలో, చెందుతుందో తెలుకున్నామంటున్న (కాకలు తీరిన వీరులు గా చెప్పుకొంటున్న) అప్రాచ్యులకీ (ప్రస్తుత సందర్భంలో అమెరికన్లకీ), నిశ్శబ్ధవిప్లవం ద్వారా అభివృద్ధిని సాధిస్తూన్న ప్రాచ్యులకీ (ప్రస్తుత సందర్భంలో జపానీయులకీ) ఓ సారి పోటీ వచ్చింది.

మాకు ఏ రంగంలో నైనా ఎదురు లేదు. మీ రేదంటే అదే ... సై అంటే సై. మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, ఐటీ,... వీటన్నిటిలో ఆల్రెడీ ముందున్నాం. కాబట్టి వేరే ఏదైనా - మీకు బాగా తెలిసిన దాన్నే ఎన్నుకోండి. నెలరోజుల్లోనే దాన్ని మీకన్నా బాగా తెలుసుకుని గెలుస్తాం [అ]

అలాగే. మా చుట్టుంతా నీళ్ళే కనక, పడవ పందేలు పెట్టుకుందాం (రోయింగ్) [జ]

అంతేనా. దీనికి నెలరోజుకు కూడా ఎక్కువే [అ]

-- సరే అంటే సరే అనుకున్నారు.

అమెరికన్లు - వెంటనే ఒక కమిటీ ఫార్మ్ చేశారు. ఓ తల పండిన మేనేజ్‌మెంట్ గురూని దానికి ఛైర్మన్ గా చేశారు. యధావిధిగా అతనికో పియ్యే. పడవ తెడ్డేసే వాళ్ళని ఎన్నుకునేందుకు ఓ రిక్రూట్‌మెంట్ స్పెషలిస్టు, తరువాత వాళ్ళకో కోచ్, ఫిట్‌నెస్ ట్రైనర్ నూ ఎన్నుకొని వాళ్ళకు పనప్పగించారు. రిక్రూటర్ మంచి శరీర ధారుడ్యంతో, బలంగా వున్న 21 మందితో పాటూ స్టాండ్ బై గా వుండేందుకు ఇంకో 5 గురినెక్కువ ఎన్నుకొన్నాడు. అందరికీ చాలా రిగరస్ గా ట్రైనింగిచ్చారు.

జపనీయులు - ఏ హడావుడీ లేకుండా వాళ్ళ రోజువారీ పనిని చేసుకుంటున్నారు.

పోటీకి గడువు సమీపించింది. ఇటు 21 మంది, అటు 21 మంది. పడవలు నీళ్ళలోకి దిగాయి. నీళ్ళలోని పడవల్లోకి మనుషులెక్కారు. పందెం ప్రారంభానికి సూచనగా గంట మ్రోగింది.

ఇరు పక్షాల వాళ్లూ చకచకా తెడ్లు వేస్తున్నారు. నీళ్ళమీద నుండి చల్లటి గాలేస్తున్నా చెమట్లు కారుతున్నాయి. చాలా ఉత్కంఠంగా సాగిన ఆ పోటీలో చివరికి ప్రాచ్యులే గెలిచారు.

(ఎందుకో - తర్వాతేమిటో - తరువాతి టపాలో)

Monday, November 17, 2008


కాకలు తీరిన వీరులు


ఈ రోజు మధ్యాహ్నం భోంచేస్తూ అదీ ఇదీ మాట్లాడుతూంటే టాపిక్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కేసి మళ్ళింది

...
ఈ ఫైనాన్స్ సెక్టార్లో ఎంతోమంది కాకలు తీరిన వీరులున్నారుగదా... [ఒకడు]

... ఎవరాళ్ళు? [ఇంకోడు]

అంటే - ఏ పెద్ద కంపెనీనన్నా తీసుకో, దాన్ని నడిపే సన్నాసి ఐఐయ్యమ్మో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండో వస్తాడు కదా! [ఒకడు]

... ఓ ఆ తెలివైన వాళ్ళ గురించా నీవు మాట్లాడేది. అర్థమైంది కాకలు తీరిన వీరులంటే. ఇహ చెప్పు. [ఇంకోడు]

ఇంత మంది కాకలు తీరిన వీరులు, టాప్ మోస్ట్ టాలెంటెడ్ ఎకనమిస్టులు, ఇంకా, ఇంకా ... వీళ్ళందరూ వుండికూడా బాంకు లెందు కిట్టా తగలడ్డాయి, షేర్ మార్కెట్టెందుకింత అతలా కుతల మౌతోంది? [ఒకడు]

... పడిపోతుంటే ఎట్టావుంటోందో చూట్టానికేమో (నవ్వుతూ) [ఇంకోడు]

వాళ్ళకేం మూటలు మూటలు ఆల్రెడీ దాచుకున్నారు - మామూలోళ్ళకే ఈ బాధంతా. [ఒకడు]

భలే ప్రశ్నేసావయ్యా - నిన్నో మెన్నో గుర్తులేదు. సియెన్నెన్నోడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తినిదే ప్రశ్నడిగాడు.  [మరొకడు]

ఏమన్నాడయ్యా నారాయణమూర్తి? [ఒకడు]

Greed takes over Ethics & Values [మరొకడు]

భలేక్కొట్టాడు దెబ్బ [ఇంకోడు]

నిజమేరా - ఈ రోజుల్లో ఎవడు తిన్నగా పనిచేస్తున్నాడు. ఎక్కడ చూసినా మెయ్యటాలూ, మేపటాలూనూ. [ఒకడు]

ఎంత చదువు చదివినా పొట్టకూటికే ...  [మరొకడు]

...కాదు కాదు, పక్కోళ్ళ పొట్ట కొట్టడానికే - లేక పోతే లక్షల్లక్షలు తీసుకుంటూ కూడా ఇదేం బుద్ధో! [ఒకడు]

అంటే వీళ్ళల్లో కాకలు తీరిన వీరత్వం కన్నా కాకాల కలవాటు పడ్డ బీరులెక్కువ మందన్నమాట. [ఇంకోడు]

Monday, October 13, 2008


అత్యున్నత జీవనశైలి (ఐడియల్ లైఫ్ స్టైల్)


ఓ పెద్ద ఊర్లో ఒక సమావేశం జరుగుతోంది. దానికి దేశదేశాలనుంచి ఓ వంద మంది గొప్ప గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనుష్యులు, అధ్యాపకులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, పండితులు, మతాధిపతులు, పీఠాధిపతులు, వేంచేసి యున్నారు. ఇంతకీ అక్కడ సమావేశంలో చర్చించే విషయం అత్యున్నత జీవనశైలి (ఐడియల్ లైఫ్ స్టైల్) గురించి.



ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వారి వారి జీవితానుభవాలనుంచీ, వారు చదివిన పుస్తకాలు, మత గ్రంధాలు, శాస్త్ర గ్రంధాలనుండీ ఉదాహరణలు ఉటంకిస్తూ వారివారి అభిప్రాయాలను వెలి బుచ్చుతున్నారు. ఇష్టమున్నవాళ్ళు, ఆ అభిప్రాయలతో ఏకీభవించిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తూంటే, నచ్చనివాళ్ళూ, ఇష్టం లేనివాళ్ళూ వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు.



కొందరు ధనముంటే చాలంటే, మరికొందరు జ్ఞానవంతమైన జీవనానికి అనుకూలంగా వున్నారు. ఇంకొందరు దైవభక్తి, పాపభీతికి తలొగ్గితే, మరికొందరు అంగబలమూ, అధికారానికి పెద్దపీఠవేశారు. సాంకేతికంగా వృద్ధి చెందిన జీవనశైలే పరమావధిగా కొందరు భావిస్తే, ప్రశాంత మైన పల్లెజీవనానికి మించినదిలేదనేవారింకొందరు. ఈవిధంగా చాలా వేడి వేడిగా చర్చలు ఆరు రోజులుగా నడుస్తున్నా, ఇంతవరకూ ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. ఏకాభిప్రాయానికి రావటానికి ఇంకొక్కరోజు మాత్రమే గడువుండటంతో చివరకు నిర్వాహకులు ఓటింగ్ పద్ధతిని అనుసరించడానికి నిర్ణయించారు.



ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఒక్కొక్కళ్ళు వేడివేడిగా ప్రక్కవాళ్ళతో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలలోని పసను ప్రక్కవాళ్ళకు వినిపిస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రక్క వాళ్ళను ప్రభావితం చేసి ఇంకొన్ని ఓట్లను పొందుదామని తాపత్రయం. ఇలా అందరూ హడావుడిగా వుంటే, సాదా సీదాగా వున్న ఓ మధ్యవయసు వ్యక్తి ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓటింగ్ కార్యక్రమం పూర్తయ్యింది. లెక్కించేందుకు ముందు చివరిసారిగా నిర్వాహకులు అందరూ ఓటువేశారా అని కనుక్కుంటున్నారు.



నిర్వాహకుల్లో కొద్దిగా ఆలోచన కలిగిన ఓ చురుకైన వ్యక్తి, ముఖ్య నిర్వాహకుడు - మొదలునుంచీ ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాంతంగా వున్న మధ్య వయసు వ్యక్తిని గమనిస్తూవున్నాడు. అతనెప్పుడూ ఏ వ్యక్తితోనూ, ఎవరి అభిప్రాయంతోనూ ఏకీభవించడంగానీ, వ్యతిరేకించడంగానీ చేయలేదు. అసలు అతను అతని అభిప్రాయాన్ని కూడా ఎవరితోనూ పంచుకున్నట్లు కనబడనూలేదు. ఇప్పుడూ అలానే ప్రశాతంగా ఓ మూల కూర్చొని ఉన్నాడు. ఇదంతా చూసిన ఆ నిర్వాహకుడికి అతనికి కూడా ఓ అవకాశం ఇస్తే బాగుంటుందనిపించింది.



ఇంతలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందరూ ఎవరికి వారే తమ అభిప్రాయమే గెలుస్తున్న అభిప్రాయంలో వున్నారు. ఫలితం ప్రకటించేందుకు ఆ చురుకైన నిర్వాహకుడు ఫలితాల కాగితంతో మైకు ముందుకు వచ్చాడు. అందరికీ ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. వచ్చిన అందరికీ తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం వచ్చినా, ఒకవ్యక్తి మాత్రం తన అభిప్రాయాలను చెప్పలేకపోయాడనీ, చివరిగా అతనికీ ఓ అవకాశం ఇస్తున్నామనీ, దయచేసి అందర్నీ నిశ్శబ్ధంగా వుండమని ప్రార్థించాడు. మధ్యవయసు వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని స్టేజ్ మీదకు మాట్లాడడానికి ఆహ్వానించాడు.



ఆ మధ్యవయసు వ్యక్తి తన గురించి పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు. "నేను భారత దేశం లోని ఓ సాధారణమైన చిన్న పట్టణం నుంచి వచ్చాను. నాకు ముగ్గురు పిల్లలు. నాలుగెకరాలు కూరగాయలు పండించే పొలం, గ్రామ సభలో అకౌంటెంటు ఉద్యోగం."



ఈ మాటలు పూర్తయ్యీ కాకమునుపే సభలో మిగిలిన వారి ముఖాల్లో తేలికభావం, అసలెవరతన్ని ఈ సభకాహ్వానించారని గుసగుసలూ మొదలయ్యాయి. నిర్వాహకుడు వారించాక కొద్దిగా సద్దుమణిగారు. తిరిగి అతను మొదలు పెట్టాడు. "నేనేమీ ఈ సమావేశానికి వెళతాననలేదు, కానీ మా పట్టణ ప్రజలు, పెద్దల బలవంతం మీద వచ్చాను. కానీ ఇక్కడ మీలాంటి పెద్దల్నీ, పండితులనీ చూశాక నాలాంటి వాడు చెప్పేదేముంటుందని వూరకున్నాను."



ఇంతలో సభలోంచి ఎవరో నీ వెవరి అభిప్రాయానికి ఓటేసావన్నారు. "మీ రెవరి అభిప్రాయంతోనూ నేనేకీభవించలేక పోయాను కనుక ఓటే వెయ్యలేదు" అన్నాడతను.



"మీరెవరి అభిప్రాయంతోనూ ఏకీభవించలేక పోయానన్నారు. బాగుంది. అయితే మీ అభిప్రాయంకూడా చెప్పండి" అన్నాడు నిర్వాహకుడు.



"మీరింతవరకూ చెప్పిన అభిప్రాయాలన్నీ మనిషి సుఖజీవితానికి తోడ్పడతాయి తప్ప అర్థవంతమైన జీవనానికి కాదు. అర్థవంతమైన జీవితమంటే ఏమిటో మీకు తెలియనిదేమీ కాదు. ఏ శ్రమా, కష్టం లేకుండా గడిపే సుఖవంతమైన జీవితానికీ, భూమిలోపల ఆరడుగుల గోతిలోని జీవితానికీ తేడా ఏముంది? ఇబ్బందులనధిగమిస్తూ, కష్టాలనెదుర్కొంటూ, అసహాయులకు ఆసరా అందిస్తూ సాగే జీవనమే సామాజిక, దేశ పురోభివృద్ధికి మూలం. అదే అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్" అంటూ ముగించాడు.



సభలో ఏ ఒక్కరూ ఏమీ మాట్లాడలేదు. నిర్వాహకుడు మైకు ముందుకు వచ్చి ఈ వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఎవరికైనా వుంటే మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. తన చేతిలోని ఫలితాల కాగితాన్ని తెరవకుండానే చించేసి, ఆ మధ్య వయసు వ్యక్తికి ధన్యవాదాలతో సభను ముగించాడు.

Thursday, May 22, 2008


ఐతే ఏంటి?


(పేపర్లో వార్త - కర్ణాటకలో కల్తీ సారా మృతులు 190)
(స్ధలం - ఆఫీసులో మధ్యాహ్నం తిన్నాక)


కల్తీ సారా తాగి చనిపోయినవారి సంఖ్య 150 దాటింది.
ఎవరా నూటేభై?
కూలీ నాలీ చేసుకునే లేబర్ క్లాస్.
ఓ... లేబర్ క్లాసా!
లేబర్ క్లాసైతే మాత్రం వాళ్లు మాత్రం మనుషులు కారా?
మనుషులే, వాళ్లలోను రక్తం వుంటుంది (నవ్వు). కానీ వాళ్ళవల్ల దేశానికేం ఉపయోగం, భారం తప్ప.
భారమా!!?
కాక, మనది బీదదేశం ఎందుకైంది - ఇలా లేబర్ క్లాసు వాళ్ళెక్కువయ్యే కదా.
ఆహా!!!
అంతేకాదు, ఎప్పుడైనా హాలీవుడ్ సినిమాల్లో ఇండియాను చూశావా. అడుక్కుతినేవాళ్లు, చేపలు పట్టేవాళ్లు, పాములాడించే వాళ్ళు వుండేదే భారద్దేశం అని చూపిస్తారు. ఎంత బాధేస్తుందో.
అయితే మాత్రం బీదోళ్లు చస్తే నీకు ఓకేనా. చూస్తుంటే బీదోళ్ళందర్నీ చంపేయాలనేట్లున్నావే.
అవున్రోయ్. ఆ పనిచేస్తే ఇండియా అమెరికా కన్నా రిచ్ కంట్రీ అయిపోతుంది.
కానీ కొన్ని విషయాలు మర్చిపోతున్నావు.
ఏమిటవి?
నీ బట్టలెవరూ వుతకరు, ఇస్త్రీచెయ్యరు. అంట్లు తోమరు, ఇల్లు తుడవరు. అన్నీచచ్చినట్లు నువ్వే చేసుకోవాలి.
...
పొలాల్లో పనిచేయాలన్నా, బిల్డింగులు కట్టాలన్నా వాళ్లే గతి.
...
అంతెందుకు, స్టేషన్లో దిగింతర్వాత నీ సామాన్లు మోసుకురావాలన్నా వాళ్లేగతి.
...
చివరకి కంపుకొట్టే చెత్త క్లీన్ చెయ్యాలన్నా వాళ్ళే కావాలి.
...
ఇప్పుడు చెప్పు వాళ్లే లేకపోతే నీ రిచ్ భారద్దేశం గతేంటో. కంపుగొట్టుది (హ్హ హ్హ)
...
...
...
హా... ఐడియా.

ఏంటది?
వుతకడానికి వాషింగ్ మెషీనూ, అంట్లకు డిష్ వాషరూ, క్లీనింగ్‌కు వాక్యూమ్ క్లీనరూ
మ...
ఆగాగు, ఇస్త్రీకు కూడా ఇలానే ఏదో వుండే వుంటుంది. లేకపోతే కనుక్కుంటాం.
...
క్రాప్ మెషీన్లూ, గ్రీప్ మెషీన్లూ అంటూ ఎలాను వున్నాయి.
ఓర్నీ..!!
ఆ మరి, బిల్డింగులకూ ఇలాగే మెషీన్లు వాడతా. మరీ అవసరమైతే రోబోట్లు తయారు చేసి వాడుకుంటాం మిగతా వాటికి.
...
మరిప్పుడేమంటావ్?
అంతేనంటావా! నిజానికి ఈ లేబరోళ్లతో పెద్ద తంటారా బాబు. ఓ రోజొస్తే ఓ రోజు రారు. బతిమాలితే నెత్తికెక్కుతారు. నుంచో బెట్టి దోచేస్తారు. నువ్వన్నట్లయితే ఈ గొడవలేమీ వుండవనుకుంటా!
(కాలరెగరేసాడు)
(ప్రక్క సీటతను తలతిప్పి)

రాజకీయనాయకులకు మరి ఓట్లెవరేస్తారు?
...
అదీ గుడ్డిగా!! (చిరునవ్వు)

(డూ యూ హేవ్ ఎనీ ఐడియా?)

Tuesday, April 29, 2008


ఏన్యువల్ డే - ౩


మేనేజరు ఒకాయన, వయసు 30-35 మధ్య వుండొచ్చు, అంతకు ముందే వీడియోలో మిగతా ఉద్యోగస్తులకి సందేశాలిచి, అవార్డులందుకున్నాడు. అతను పార్టీ ఉత్సాహంలో తాగి తన లగ్జరీ కారులో, సహోద్యోగులతో బయటకు వెళ్లబోయాడు. పార్కింగ్ ప్లేస్ నిండా వెహికల్స్ వున్నా మద్యం మత్తులో స్పీడుగా వచ్చాడు. ఆ రావటం అక్కడే నుంచుని వున్న ఓ క్యాబ్ డ్రైవర్ మీదుగా పోనిచ్చాడు.

సాక్షుల కథనం ప్రకారం, ఆ క్యాబ్ డ్రైవర్ కాలు, చేయి పోయాయి. తప్పు తనదైనా, కారు ఆపి క్యాబ్ డ్రైవర్ల మీద అరిచాడట సదరు మేనేజరు. దాంతో కోపించిన మిగిలిన క్యాబ్ డ్రైవర్లు అతన్ని కొట్టబోగా, తప్పించుకొనే ప్రయత్నంలో కారుని అలాగే రివర్సుచేసి దూకించాడట ఆ ప్రబుద్ధుడు.

ఎంత వేగంగా తోలాడోగాని ఓ ఫర్లాంగు దూరంలో వున్న ఓ రాయికి గుద్ది ఫల్టీ కొట్టించాడు. కోపంతో వున్న క్యాబ్ డ్రైవర్లు వెంబడించి, ఫల్టీ కొట్టివున్న కారులోంచి అతన్ని లాగి, అద్దం పగిలి ముఖమంతా రక్తమోడుతున్నా, చావచితక్కొట్టారట.

ఇంతలో పోలీసులు, ఆంబులెన్సు వచ్చి గాయపడిన ఇద్దరినీ తీసుకెళ్ళారట.

తర్వాత అతన్ని ఉద్యోగంలోంచి తొలగించారని వార్త.

కొన్ని ఛాయా చిత్రాలు...








చివరగా మూడు ముక్కలు
(1)
ఎంత తెలివి గలవాడైనా, ఎంత ఎత్తులో వున్నా సమయం వచ్చేసరికి చావుదెబ్బ తినాల్సిందే. అందులోనూ తప్పు మనదైతే పాపం సానుభూతి కూడా దక్కదు.
(2)
మద్యం ఎవడ్నైనా సరే పుచ్చిపోయేట్లు చేస్తుంది - తస్మాత్ జాగ్రత్త!
(3)
ఆవేశం అన్నిరకాల అనర్థాలకు మూలం - అహంకారం చూపకుండా కొద్దిగా సంయమనం పాటించి వుంటే నాలుగు దెబ్బలతో తినడంతో సరిపోయేది. పాపం!!

Friday, April 18, 2008


ఏన్యువల్ డే - ౨


క్రితం టపాకి సంబంధించిన కొన్ని ఫొటోలు

పాశ్చాత్య నృత్య ప్రదర్శన (అ)


అవార్డులూ - రివార్డులూ (ఆ)


లేజర్ షో (ఇ)


ఫ్యూజన్ డాన్స్ - ౧ (ఈ)


ఫ్యూజన్ డాన్స్ - ౨ (ఉ)


ఫ్యూజన్ డాన్స్ - ౩ (ఊ)


ఫ్యూజన్ డాన్స్ పూర్తయ్యేలోపు చిత్రించిన చిత్తరువు (ఎ)


అబ్బ ఏం జనమండీ (హ్హ హ్హ) - ౧ (ఏ)


అబ్బ ఏం జనమండీ (హ్హ హ్హ) - ౨ (ఐ)



ఇకపోతే క్రితం సారి చెబుతానన్న సంఘటన .. క్షమించండి .. వచ్చే టపాలో!

Thursday, April 17, 2008


ఏన్యువల్ డే - ౧


ఓ ప్రముఖ కంపెనీ (పేరు గోప్యంగా వుంచడమైనది) ఆన్యువల్ డే (ఆంగ్లంలో ఏమంటారో?) సందర్భంగా పాలెస్ గ్రౌండ్సులో భారీ ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మా బామ్మర్ది అందులో పనిచేస్తుడడంతో నాకూ ఎక్స్టెండయ్యింది ఆహ్వానం. ఎప్పుడూ చూడలేదు కదా అని అంతా బయలుదేరాం.

ఏర్పాట్లు మాత్రం నిజంగానే బ్రహ్మాండం. ఏంకర్లుగా ఓ ఇద్దర్ని బయటనుంచి పిలిపించారట - ఏమీ లాభంలేదు. కుళ్ళు జోకులేస్తూ (ఇంగ్లీషు మరియు కన్నడంలో) నవ్వించడానికి ప్రయత్నిచారు - కానీ పెద్దగా ఫలితం లేదు - జనాల్లో స్పందన లేదు. నాలుగు డేన్సులూ, రెండు పాటలూ - బయటివారి ఆర్కెస్ట్రా. లైటింగెఫక్ట్స్ లో పస లేదు, కానీ లేజర్ షో మాత్రం బాగుంది కానీ చూపించిన కాన్సెప్టు పెద్దగా బాలేదు. మధ్య మధ్యలో అవుట్ స్టాండింగ్ (?) ఉద్యోగస్తులకు అవార్డులూ, రివార్డులూనూ. ఇందులోనూ ఓ మచ్చేమిటంటే మావాడికో అవార్డు రావలసి వుండగా, చదివే ఏంకరమ్మ వేరేవాడి పేరు చదివితే, వాడానందంగా పుచ్చుకున్నాడు. రెండ్రోజుల తర్వాత మా వాడికి సారీ చెప్పారనుకోండి. చివరికి ఫుడ్డు తాజ్ వాళ్ళకి ఆర్డరిచ్చినా (పెద్దగా పేరు రాయించారు) బాలేదు. అసలు తాజ్ వాళ్ళు ఇంత దరిద్రంగా చేస్తారా అనిపించింది.

కష్టపడి మారతహళ్ళి నుండి పేలెస్ గ్రౌండ్సు కెళితే ఇంత చప్పగా వుందేంటా ప్రోగ్రాం అనుకుంటుంటే మరచి పోలేని సంఘటనొకటి జరిగింది.

సంఘటన వట్టి మాటలతో కాకుండా - బొమ్మలతో చూపిస్తా వచ్చే టపాలో.

Wednesday, April 09, 2008


అరిచే కుక్క మొరగదు - మూడు


నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ సంవత్సరం బందరు నక్కలతోటలో ఫ్రెండుతో (కోడూరి సాయిబాబు) కలిసి రూమ్ తీసుకుని వున్నాను. ఓ రోజు క్లాసులో చాలా మంది "రోజూ వినేదేగా క్లాసులు - బోరు కొడుతోంది సినిమాకెళ్దాం" అన్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి - మా కాలేజీలో 50 మందిదాకా వుండేవాళ్లం (తెలుగు, ఇంగ్లీషు మీడియంలు రెండూ కలిపి), కానీ అందరికీ కలిపి ఒకే క్లాసు - పంతుళ్లు తెలుగు, ఇంగ్లీషు కలగలిపి చెప్పేవారు. ఈ 50 మందిమి ఒక్కమాట మీద వుండేవాళ్లం, ఒకరిద్దరు తప్ప (వాళ్లగురించి మరోసారెప్పుడైనా).

సినిమా అనుకోగానే అందరం కాలేజీ డుమ్మా కొట్టేసి సైకిల్లేసుకుని హాలుకు బయలుదేరాం. తీరా హాలు దగ్గరికెళ్లి చూద్దుంగదా, ఆల్రెడీ చూసిన సినిమా - పైగా మహిళా చిత్రం. మాకోపికలేదని వెనక్కి మళ్ళితే కొందరు 'కలాపోసన' కోసం ముందుకెళ్ళారు. నాతో పాటూ నా రూమ్మేటూ రూముకు చేరుకుని చేసేదేమీ లేక చెస్ ముందేసుక్కూచున్నాం. అప్పట్లో నెట్ కెఫేలూ, కంప్యూటర్ డ్రోములూ లేవు. అసలు మేమెవరమూ కంప్యూటరే చూడలేదు - ఇంగ్లీషు సినిమాల్లో తప్ప. ఓ అరగంటయ్యే సరికి ఇద్దరం పూర్తిగా ఆటలో మునిగిపొయ్యాం.

"దబ్" మన్న చప్పుడు - చూస్తే మా సుబ్రహ్మణ్యం. సుమారు ఏడడుగులు ఎత్తుంటుంది మేమద్దెకుంటున్న ప్రహరీ గోడ. రోడ్డుకు కొంచెం దిగువనుండడంతో ప్రహరీ ఎత్తుగా కట్టించారు బయటనుంచి ఎవరికీ కనపడకూడదని.

"ఏం సుబ్రమణ్యం ఏమైంది? అసలు ఈ పక్కనుంచెట్లా వచ్చావు-గేటు తీసుకు రావచ్చుకదా? అయినా అంతెత్తు ఎలా దూకావురా?" అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేశాం.

"ఇంత లోతుంటుందని తెలీక దూకేశా" మోకాళ్ళు నొక్కుకుంటూ లోపలికొచ్చాడు. చెస్ బోర్డు చూసి "మీకు చెస్సాడటం వచ్చా?" అన్నాడు బోర్డు పక్కనే చతికిలబడుతూ. సమాధానం కోసం ఎదురుచూడకుండా ఆటలో వేలు పెట్టాడు. ఓ పావు(కాలు) గంట తర్వాత ఆటైపోయాక అడిగాడు "అవును మీరిక్కడున్నారేంటి?" అని. వాడి ప్రశ్న మాకస్సలర్థం కాలా.

"మేమిక్కడున్నామని తెలీకుండానే గోడదూకావా?" ఆన్నాడు సాయి.
"గోడదూకాక తెలిసింది మీరిక్కడున్నారని. అయినా దీ** ఇంతలోతుందేంటిది. ఏ నా **కొడుకు కట్టించాడో, అబ్బ కాళ్ళిరిగి పోయాయనుకున్నా" అన్నాడు. మా సుబ్రహ్మణ్యం బ్రాహ్మణుడు. సంస్కృతంలో ఉద్ధండుడు. వాక్యానికో సంస్కృత సమాసం వాడందే కుదరదు వాడికి.
"మరెవరికోసం దూకావు .. లేడీస్ హాస్టలు కూడా కాదిది" అన్నాడు సాయి వ్యంగ్యంగా.
"దొంగ** కుక్క వెంటబడితే ముందూ వెనకా చూసుకోకుండా దూకాల్సొచ్చింది."
"ఛా..ఛా. కర్రతోనో, కాలుతోనో తన్నుండాల్సింది - వెధవది కుక్కుకు కూడా భయపడాలా" అన్నా.
"అమ్మో మానాన్న తంతాడు" అన్నాడు భయంగా.
"దారేపోయే కుక్కని కొడితే మీనాన్నకేంటిరా." అన్నాడు సాయి.
"అయినా కుక్కని కొట్టావన్న సంగతి మీనాన్నకెలా తెలుస్తుంది" అన్నా లా పాయింటు లాగుతూ.
"ఆ కుక్క మాదే .. ఆనుకునుండే పక్కిళ్లే మాది" అన్నాడు సుబ్రహ్మణ్యం దిగాలుగా.
...
...
...
ఓ ఆర్నెల్లు మాకు నవ్వుకోడానికి మంచి విషయం. అందరికీ చెప్పామని ఉడుక్కున్నా, చెస్సాడడానికి మళ్లీ వస్తూంటాడు మారూముకి - గోడదూకి కాదండోయ్, గేటు తీసుకునే.

Monday, April 07, 2008


ఉగాది (యుగాది) - మళ్లీ మొదలు!


సుమారు ఆరు నెలలయ్యింది సాక్షిలో పోస్టు రాసి. కర్ణుడి చావుకి కారణాలనేకం, అలాగే నాకు బోలెడన్ని. మునుపెపుడో చెప్పా - బద్ధకం వాటిలో ముఖ్యమైనదని. ఇప్పటికీ అదే నిజమనుకోండి.

మొన్నీ మధ్య బెబ్లాసం(బెంగళూరు బ్లాగర్ల సంఘం)కి వెళ్లినప్పుడు ప్రవీణ్ అడిగారు ఈ మధ్యేమీ రాయటంలేదని. రాయాలనివుంది కానీ కొత్త కొత్త పనుల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నాను. ఓ మంచి రోజు చూసుకు మళ్ళీ మొదలెడతానని.

ఆ మంచిరోజు ఇదే నేమో

అందరికీ సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు

కొత్త సంవత్సరం - సర్వధారి నామ సంవత్సర సాక్షిగా - రోజూ కాక పోయినా, కనీసం నెలకో రెండో మూడో బ్లాగుతానని ప్రమాణం చేస్తున్నాను.

(మనలో మాట - నాకు పెద్దగా ప్రమాణాలంటే నమ్మకం లేదండీ)