Sunday, June 11, 2006


మాంసాహారం


ప్రసాద్‌ గారి చరసాల(charasala)లో మాంసాహారం గురించి చదివాక ఆయన ఆవేదన తెలిసింది.

స్వాతి గారన్నట్లు అవసరం, కోరిక, విచక్షణ లను అదుపులో పెట్టుకోగలిగేది మానవుడు మాత్రమే. వాడెవడో చెయ్యటం లేదు, వీడెవడో చెయ్యటం లేదు అనటం కన్నా ముందు మనం నిఝంగా మారితే, మారి సంతోషంగా వుంటే ... ఆ మనని చూసి మారే వారే ఎక్కువ, బోధనలవల్ల మారేవారి కన్నా. జంతు పరిరక్షణ, ఇంకోటో, మరింకో పేరుతోనే ప్రపంచమంతా వుండే ఈ జంతు ప్రేమ సంఘాల్లోని సభ్యులెంత మంది శాకాహారులో మీకేమైనా తెలుసా? వీళ్ళందరూ కుక్కకు బిస్కట్టో (లేదా మరోటో) ఆశ పెట్టి యాక్ట్‌ చేయిస్తే వూరు కోరు తెలుసా, అది జంతు హింసట!

నారాయణరావు గారు డైరెక్టుగా "నేను మానేశాను, నా కడుపు చచ్చిన/చంపిన జంతువులకు సమాధులు కాకూడదని" అన్నారు. గుడ్‌. పెద్దవారు మీకు తెలియదని కాదు, ఇష్టంతో చేసే పని వలన ఫలితం వుంటుంది కానీ, అయిష్టంతో చేస్తే కాదు - యోగమైనా, భోగమైనా. మీరు ఆ రీతిగా సెలవిచ్చుంటే బాగుండేది. మీ దగ్గరినుండి మరికొన్ని విషయాలు నేర్చుకొన్నట్లయ్యేది.

రోహిణీ కుమార్‌ గారూ, హిట్లర్‌ ఆ ఒక్కటే కాదు చాలా మంచి పనులు చేశాడు. చూసేవాడి ఆలోచనల బట్టి ఎదుటివాడు అర్థమౌతాడంట, అలాగే హిట్లర్‌ను విలన్‌గా చూసే కొద్దీ పాపాలు బోల్డన్ని కనబడుతాయి. నాణేనికి రెండోవైపు చూడడం ప్రారంభించారు. కంగ్రాట్స్‌. ఇంకొకటి, దూడ తాగితే మహా అయితే రోజుకి మూడు, నాలుగు లీటర్లు తాగుతుందా...? ఇప్పటి ఆవులు లేదా గేదలు దగ్గర దగ్గర పది లీటర్ల పాలనిస్తాయి కదా ... మిగతా వాటినేం చేద్దామంటారు? I hope you got my point.

వెంకటరమణ గారి అ),ఆ) లకు:
జంతువులను చంపితే బాధ పడేవారి కన్నా (లేదా బాధపడే వారు లేరనుకున్నా)మనుషులను చంపితే బాధ పడేవారున్నారు కనుక జంతువులను చంపితే తప్పు లేదు, మనుషులను చంపితే తప్పే నంటారు. అయితే ఎవరూ ఆధారపడని అనాధలను, వృద్ధులను (మనుషులైనా సరే) చంపితే, చంపి ఉపయోగిస్తే (ఏదో రకంగా) తప్పులేదా? ఇంకపోతే, జంతువులే కాదు, చెట్లకు కూడా స్పందనలుంటాయని, బాధలుంటాయని (మానసికంగా కూడా) చాలా సార్లు నిరూపణయ్యింది. యజమాని చనిపోతే బాధపడి ఆహారాదులు మానేసి చనిపోయిని పెంపుడు జంతువులెన్నో!

ఇ),ఈ) ఈ విషయంలో మీతో పూర్తి గా ఏకీభవిస్తా, పని చేయించుకోవడానికీ, హింసించడానికీ చాలా తేడావుంది. అలాగే చనిపోయిన వాటిని (చంపిన వాటిని కాదు)వాడుకోవడంలోనూ తప్పులేదు.


ప్రసాద్‌ గారూ, మీ అభిప్రాయం మీరు చెప్పారు. కాదు చాలా చక్కగా వెలిబుచ్చారు. అబ్బా, అమ్మా అంటేనే, లేదా ఏడిస్తేనే మనకు అవతలి వ్యక్తి బాధపడుతున్నాడని తెలుస్తుంది, ఎందుకంటే మనమూ వారిలాంటి వారమే, మనకూ బాధ కలిగితే అలాగే ఏడుస్తాం కనక. కానీ మనకు తెలియని వేషభాషలూ, ఆచార వ్యవహారాలూ వున్నవాటి సంగతో? వాటి బాధను ఎక్స్‌ప్రెస్‌ చేసే విధానం మనకు అర్థం కాకపోతేనో? పెద్దవారు నారాయణరావు గారు లేదా వారిలాంటి అనుభవజ్ఞులేమైనా సలహా చెబుతారేమో .. తార్కికంగా. He knows a lot more. అలాగే ప్రకృతి నిర్ణయించిన ఆహార చక్రాన్ని నియంత్రించడనికి మనమెవరం? మనమేం చేసినా చేయక పోయినా, తన స్థితి అసమతౌల్యానికి గురైనప్పుడు ప్రకృతి తన సమతౌల్యనికి చేయవలసినదేదో అదే చేస్తుంది, జంతువులు బాధ పడవు, మనుషులు బాధపడతారు అనిమాత్రం చూడదు.

చివరగా నేను మాంసాహారినే కానీ మాంసం తినను చిన్నప్పటినుంచీ, ఒక్క కోడి గుడ్డు తప్ప.(అందుకే నన్ను ఎగ్గేరియన్‌ అంటారు). నేను ఒకప్పుడు చికెన్‌, మటన్‌ లాంటివి తినడానికి ట్రై చేసాను కానీ తినలేక పోయాను .. నాకెందుకో తినాలనిపించలేదు. అలాగే నాకు ఊహ తెలిసినప్పటినుంచీ పాలూ, కాఫీ, టీ కూడా తాగను - కానీ మజ్జిగ మాత్రం ఇష్టంగా తాగుతా.

మాంసాహారం తినటం వల్ల వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. జంతువుల గురించి ఆలోచించకుండా, ముందు మన గురించి ఆలోచించండి - మన ఆరోగ్యం మనకు ముఖ్యం కదా! మనం మనకోసమే బతకాలి, అదీ పక్కవార్ని ఇబ్బంది పెట్టకుండా సుమా! మన తరువాతే ఎవరైనా. ఇది (సామాన్యులైన) మనందరికీ వర్తించే నిఝమైన నిజం.

1 comment:

వెంకట రమణ said...

నా అభిప్రాయాన్ని ఇంకొంచం వివరంగా ఇక్కడ చెప్తామనుకుంటున్నాను. ఒక మనిషి మీద ఆధారపడే వాళ్ళతో పాటు చనిపోబోతున్న అతను కూడా తీవ్రమయిన మానసిక క్షోభను అనుభవిస్తాడు. దీనికి కారణం చనిపోయేటప్పుడు అతను అనుభవించే/అనుభవించబోయే శారీరక భాద ఎంతమాత్రం కాదు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో సాధించాలనో, లేదా ఎదో చెయ్యాలనో ఆలోచించుకొని ఉంటారు. ఉదాహరణకు, ఒక అనాధ తను చాలా గొప్పవాడు అయి మిగతా అనాధలకు ఏదయినా చెయ్యాలను కోవచ్చు, అదేవిధంగా ఒక వృద్దుడిని/వృద్దురాలిని తీసుకుంటే వారి మనమడి పెళ్ళి చూడాలని అనుకోవచ్చు. ఈ కోరికలు ఫలించకుండానే మరణిస్తున్నప్పుడు వారికి మానసిక భాద కలుగుతుంది. ఇలాంటి కోరికలు (future plans) జంతువులకు ఉంటాయని నేననుకోను. ఒక మనిషి చనిపోతానని తెలిసినప్పుడు ఏవిధంగాను మానసిక భాద అనుభవించక పోయినట్లయితే అలాంటి వారిని చంపితే తప్పుతేదని నా అభిప్రాయం.(mercy killing ఈ కోవలోకే చెందుతుందని నా అభిప్రాయం).