Wednesday, September 22, 2010


వేయి అద్దాల ఇల్లు


ఇదొక జపనీస్ జానపద గాథ.

చాలా కాలం క్రితం ఎక్కడో దూరంగా ఓ చిన్న గ్రామం వుంది. ఆ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ఒక వేయి అద్దాల ఇల్లు ఒకటి వుంది. దాన్ని గురించి విన్న ఓ అందమైన ఆనందంగా వున్న చిన్న కుక్క పిల్ల ఓ సారి వెళ్ళి అందులో ఏముందో చూద్దామని అక్కడకి బయలు దేరింది. ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ గ్రామాన్ని చేరుకోగానే, చేరుకున్నానన్న ఆనందంతో గంతులు వేస్తూ వేయి అద్దాల ఇంటి వైపు సాగింది. ఇంటి గుమ్మం కనబడగానే కుతూహలంతో చెవులు పైకెత్తి తోక వూపుతూ లోపలికి నడిచింది.

లోపల అందంగా ఆనందంగా వున్న వెయ్యి చిన్న కుక్క పిల్లలు కనిపించాయి. వాటిని చూడగానే దీని సంతోషానికి అంతే లేక పోయింది. తోక వేగంగా వూపుతూ ఆనందంగా అరుస్తూ గెంత సాగింది. అంతే ఆనందంగా, అంతే వేగంగా తోక వూపుతూ మిగిలిన వెయ్యి కుక్క పిల్లలూ ప్రతి స్పందించాయి. దాని ప్రతి నవ్వుకూ వేయి నవ్వులు ప్రతిగా వచ్చాయి. దాని అత్మీయమై ప్రతి చూపుకూ వేయి ప్రతిగా లభించాయి. అలా కొంత సేపు అక్కడ గడిపిన తర్వాత బయటకు వస్తూ "ఇది ఒక అద్భుతమైన ప్రదేశం, అందులో ఈ ఇంటి గురించి చెప్పనలవి కాదు. వీలైనంత తరచుగా ఇక్కడికి వస్తూవుంటాను" అనుకుంటూ వెళ్ళింది.

తిరిగి వెళుతూ వున్న ఈ కుక్కపిల్లకు, డీలాగా, ప్రపంచంలో వున్న బాధలన్నీ నావే అన్నట్లుగా వున్న ఇంకో కుక్క కనిపించింది. ఈ డీలాగా వున్న కుక్కకు ఆనందగా ఎగురుతూ వెళుతున్నమన చిన్న కుక్కుపిల్ల కనిపించింది. అందంగా వెలిగిపోతూన్న ముఖంతో వున్నదాన్ని చూసి ఇంత ఆనందం, సంతోషం ఎక్కడివి అని డీలా కుక్క అడిగింది. తాను వెళ్ళి చూచి వచ్చిన ప్రదేశం గురించి చెప్పి, డీలా కుక్కనికూడా అక్కడికి వెళ్ళమని సలహా ఇచ్చింది. హాయిగా వున్న ఆ కుక్కపిల్లలు తనను దగ్గరకు రానిస్తాయని డీలా కుక్క అనుమానపడితే, ఏం పర్లేదు వెళ్ళమని భరోసా ఇచ్చింది మని చిన్న కుక్కపిల్ల.

చిన్న కుక్కపిల్ల ఎంత చెప్పినా అనుమానం తీరక ఆనందంగా ఆడుకుంటూ వుండే ఆ వేయి కుక్కపిల్లలూ తనను రానిస్తాయో లేదో అన్న శంకతోను, అనుమానంతోనూ, అపనమ్మకంతోనూ అయిష్టంగానే ఆ గ్రామానికి బయలుదేరింది.

చేరవలసిన చోటు వచ్చింది. చిన్నకుక్కపిల్ల చెప్పిన ఇల్లు కనిపించింది. మనసులో వున్న శంకలనూ, అనుమానాలను, అపనమ్మకాలతో లోపలికి అడుగుపెట్టింది. లోపల వేయి కుక్కలు కనిపించాయి. అవి అన్నీ ఈ డీలా కుక్కను అనుమానంతోనూ, అయిష్టంతోనూ చూడసాగాయి. చిన్న కుక్కపిల్ల అబద్దం చెప్పిందనుకుంటూ కోపంతో మొరిగింది. ప్రతిగా ఆ వెయ్యి కుక్కలూ ఎదురు కోపంగా మొరిగాయి. భయంవేసి "ఇంత భయంకరమైన, దరిద్రమైన ప్రదేశాన్ని నేనెక్కడా చూడలేదు. ఇక జీవితంలో ఇక్కడకు రాను" అనుకుంటూ ఆ ఇంట్లోనుంచి బయటకు పారిపోయింది.

నీతి: ప్రపంచంలో వున్న మఖాలన్నీఅద్దాల వంటివే. మనలో వున్నభావావేశాలే వాటిలో ప్రతిఫలిస్తాయి.