Thursday, September 30, 2004

ప్రియ మిత్రులకు,

ఎన్నో రోజులనుండి, (సుమారు నెలా పదిహేను రోజులు) తొందర్లో, తొందర్లో అంటూ చెప్తూన్న ' తెలుగు పాట ' ఇప్పటికి మొదటి అడుగు వేసింది. ఓ పక్షం రోజులపాటు live testing కోసం మీ ముందు పెడుతున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోకండి. మీకు ఎదురైన ఎటువంటి problems నైనా నాకు తెలియజేయండి. వీలైనంత త్వరలో సమాధాలను తప్పనిసరిగా అందిస్తాను.

పైన వున్న లింకులను (links) వుపయోగించి ' తెలుగు పాట ' లోని మిగతా భాగాలను సందర్శించండి.

Sunday, September 05, 2004


సాక్షి - 1.3 (తరువాయి)


సుమారు మూణ్ణెల్ల క్రితం ఇక్కడికి చేరిందిట. వారం రోజుల నుండి బతిమాలుకొంటుంటే, చివరకు ఒప్పుకుందట వాళ్ళ యజమానురాలు ఇంటికి పంపేయడానికి. కాకపోతే చివరి బేరం ఈ ఒక్కటి చేస్తే, 500 రూపాయలు యిస్తా, ఇంటికి హాయిగా వెళ్ళొచ్చని చెప్పిందట. అందుకే రెండ్రోజుల క్రితం ఇందాక ఆటోలోంచి పడేసిన వాళ్ళతో పంపించిందట. ఆరుగురో, ఏడుగురో రెండు రోజులూ రాత్రనకా పగలనకా లేకుండా ఆ పిల్లను ... పాపం, చెప్తూంటే ఆ పిల్ల మాటల్లో ధ్వనించిన బాధను వింటే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఆ పిల్లసంగతి వేరే చెప్పాలా! చివరకు ఆటోవాడి క్రిందకూడా నలిగిందట ఆటో ఖర్చుల లెక్కలో. నావల్ల కాదని ఏడ్చి మొత్తుకుంటే ఇప్పుడిక్కడిలా పడేసి పోయారట. " 500 రూపాయలుకూడా యివ్వలేదు దొంగ నాయళ్ళు, ఎండ్రోజలు మాత్రం *** పోయారు. " అంటూ ఏడుస్తుంటే, ఏం చెప్పాలో అర్థంగాక గమ్మునుండిపోయా.




Monday, August 30, 2004


సాక్షి - 1.2 (తరువాయి)


అంత చీకట్లోనూ అందంగా వుంది ముఖం. కాకపోతే చీప్ మేకప్ సామగ్రి వాడినట్లూంది, ముఖం మీది మేకప్ చెదిరి పోయి కొద్దిగా వికారంగా కనిపిస్తోంది. కురచ లంగా, వోణీ వేసుకుంది. " ఏమైందమ్మా... " అని అడగాలనుకున్న నా మాట నోట్లోనే ఆగిపోయింది. ఆకారం చూడగానే అర్థమైంది - బ్రోతల్ కేసని. ఎవరో బుక్ చేసుకుని పని అవ్వగానే అక్కడ పడేసిపోయారని. కాని అసలు ప్రశ్నేమిటంటే, ఒకటి - దింపకుండా పడెయ్యట మెందుకు?, రెండు - ఇక్కడెందుకు పడేసినట్లు? ఎందుకంటే ఆ ఏరియా నాకు పరిచయమున్నదే - పక్కా కమర్షియల్ ఏరియా - రాత్రి పూట మాత్రం అన్ని షాపులూ కట్టేసుంటాయి.


కాని "ఇవన్నీ మనకెందుకులే, లేని పోని తలకాయనెప్పి ... " అనుకుని వెనుదిరిగి రోడ్డు ముఖం పట్టా. ఇంతలో ఎవరో పిలిచి నట్టనిపించింది. ఆ సందులో ఆ పిల్ల, నేను తప్ప వేరొకరు లేరు. అనుమానంగా వెనక్కి తిరిగి చూశా. ఆ పిల్లే - 16-18 మధ్య వుండొచ్చు. ఓణీ సర్దుకుంటూ వడి వడిగా నావైపు వస్తోంది. కొంచెం బెరుకనిపించినా, ఏం చెయ్యాలో తొయ్యక నిలబడిపోయా. అర్థం కాని భాషలో ఏదో మాట్లాడుతోంది చేతులు అటూ ఇటూ తిప్పుతూ, చూపిస్తూ. పైట తొలగి చినిగిన రవికలోంచి కనిపిస్తోన్న ఆ పిల్ల రొమ్ము కేసి చూస్తుండిపోయా. అంత చీకట్లోనూ రొమ్ము మీద ఎర్రెర్రగా కనిపించింది - బహుశా గాట్లేమో!


నా చూపులెక్కడున్నాయో గమనించిన ఆ పిల్ల ఒక్కసారిగా ఆగిపోయింది. చటుక్కున చెయ్యి చినుగుకు అడ్డం పెట్టుకుని కూలబడిపోయింది. నాలుగైదు క్షణాలు పట్టింది నాకు ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తోందని అర్థమయ్యేందుకు. ఏం చెయ్యాలో అర్థంకాలా. ఓ రెండు నిమిషాల తరువాత " ఏ వూరమ్మా నీది, తెలుగొచ్చా? " అన్నా. నీళ్ళు నిండిన కళ్ళతో అయోమయంగా చూసింది.


"తెలుగు, తెలుగొచ్చా... హిందీ ఆతా ... ఎట్ లీస్ట్ ఇంగ్లీష్... ఫ్రం వేర్ యు కేం? "

కర్ణాటక లోని ఓ వూరి పేరు చెప్పింది. కొంకిణి మాట్లాడుతోందని అర్థమైంది. ఎప్పుడో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న వచ్చీ రాని కన్నడంలో వివరాలు అడిగా. కొద్దిగా తెలిసిన భాష వినపడేసరికి, ఒక్కసారి వరదలా పొంగుకొచ్చింది ఆ పిల్లకి ఏడుపు. భుజం దగ్గర చెయ్యి పట్టుకుని లేపి రోడ్డు మీదకు తీసుకు వచ్చా. ఫుట్ పాత్ మీద కూర్చోబెట్టి ప్రక్కన కూర్చున్నా. బొమ్మలా నాతో వచ్చినా ఏడుపాపలాపిల్ల. రెండు నిమిషాలు ఏడవ నిచ్చి మళ్ళా నెమ్మదిగా కన్నడంలో అడిగా. పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఆ పిల్ల ఇలా చెప్పింది.


(సశేషం)

Sunday, August 29, 2004


సాక్షి - 1.1


నేను రోడ్డు మీద నడుస్తూ వున్నాను. అర్థరాత్రి ఒకటిన్నర కావస్తోంది. ఆల్మోస్ట్ రోడ్డంతా ఖాళీగా వుంది. ఆఫీసులో తప్పనిసరై పూర్తి చేయాల్సిన పని వుండటం వలన అప్పుడప్పుడూ అలా లేటౌతూ వుంటుంది. ఒక్క బస్సూ కనబడటం లేదు. నాకు బండేమీ లేకపోవడంతో నడకే దిక్కయ్యింది. చెదురు మదురుగా మోటారు సైకిళ్ళూ, ఒకటీ అరా ఆటోలూ కనబడుతున్నాయి. బేరం కోసం దగ్గరకొచ్చి స్లో చేసిన ఆటోలను పట్టించుకోకుండా నడవడం మూలాన వాళ్ళు నిరాశగా వెళ్ళి పోతున్నారు.

నాకు ఆటోలంటే కొద్దిగా అలర్జీ. ఎంతో అవసరమైతే తప్ప ఎక్కను. అలాగే 'setwin' బస్సులున్నూ... ఎందు కంటారేమో... ఆ సంగతి తర్వాత చెప్తాను.

బాగా అలవాటైన దారవటం మూలాన, చకచకా నడుస్తున్నాను. బుర్ర ఖాళీగా వుండటం ఇష్టం లేక ఆలోచనల్లో పడింది. కాళ్ళు వాటంతటవే దారి చూసుకుంటున్నాయి. సవాలక్ష ఆలోచనలు - ఒకదాని కొకటి పొంతన లేకుండా బుర్రంతా గిరగిరా తిరుగుతున్నాయి. రకరకాల సమస్యలు... వింతైన పరిష్కారాలు. బుర్రలోని ఆలోచనలను సాగదీస్తూ, సర్రియలిస్టిక్ గా థింక్ చేస్తూ పోతే వచ్చే సమాధానాలు భలే సరదాగానూ, నిజమైతే బాగుండేమో అనిపించేట్లు ... పైగా ... రిలాక్సింగానూ వుంటాయి.

ఇంతలో ' దబ్ ' అన్న చప్పుడు - ఆటో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్న శబ్దం. ఆలోచనల్లోంచి తేరుకుని చుట్టూ చూస్తే ... రోడ్డుకుకుడి వైపునున్న ఓ చిన్న సందులోంచి ఆటో రోడ్డుమీదికొచ్చి రాంగ్ రూట్లో ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. ఒక్క క్షణం యాక్సిడెంటేమో ననిపించింది. కొద్దిగా తేరిపార చూడగా, దూరంగా నున్న లైటు వెలుతురు క్రీనీడలో ఓ యువతి ఆకా రం కనిపించింది. జుట్టు ముడేసుకుని నడుం రుద్దుకుంటూ గొణుక్కుంటోంది. అప్పటిదాకా ఎన్నెన్నో ఆలోచనల్లో తిరుగాడివచ్చిన బుర్ర ఒక్కసారిగా స్తబ్దమైపోయింది. అప్రయత్నంగా కాళ్ళు రోడ్డుదాటాయి, ఏమైందో కనుక్కుందామన్న కుతూహలంతో.

(సశేషం)