Wednesday, October 04, 2006


టీవీ వలన కలుగు ప్రయోజనాలు


దసరా సందర్భంగా మా చిచ్చు బుడ్డితో కాలక్షేపం చేద్దామని బెంగుళూరునుండి హైదరాబాదు వెళ్ళాను. సెలవుల్లో పిల్లలకు "హోంవర్క్" ఇవ్వాలన్న ఓ గొప్ప సదుద్దేశ్యంతో మా పక్కింటి పాప వాళ్ళ స్కూలు టీచరు "టీవీ వలన కలుగు ప్రయోజనాలు" అన్న విషయం మీద వ్యాసం రాసుకు రమ్మందట. (Benefits of TV అని ఆంగ్లం లోనే అనుకోండి). ఆ పిల్లకు ఏదో చెప్పారు గానీ, ఒక్క క్షణం ఆలోచిస్తే (మీ రెన్ని క్షణాలు, గంటలు,... ఆలోచించినా కూడా) అసలు టీవీలో పిల్లలకు నిజంగా ఉపయోగపడే కార్యక్రమాలు ఏమున్నాయి అనిపించింది.

మామూలు ఛానళ్ళ సంగతి వదిలి వెయ్యండి, పిల్లల ఛానళ్ళూగా వుంటున్న కార్టూన్ నెట్‌వర్క్ గానీండి, డిస్నీ ఛానళ్ళు, పోగో లేదా మరోటి గానివ్వంటి అత్యధిక శాతం ఫైటింగులూ, హింస మొదలైన వాటి గురీంచే. (వీటిలో కొన్న మంచి కార్యక్రమాలు వస్తున్నాయన్న సంగతి గమనించ దగ్గది)

డా. కినో ఫెరియానీ ఒక శాస్త్రజ్ఞుడు "20 సంవత్సరాల పాటు నేరాలు, మనస్తత్వ శాస్త్రం, బాల మనో విజ్ఞానం వంటి వాటిపై చేసిన అధ్యయనం మూలాన అనేక వేల సార్లు నేనొక కఠోర సత్యాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అదేమిటంటే 80 శాతం మంది బాల నేరస్తులకు వారి తల్లి దండ్రులు మంచి విద్య, లోక కల్యాణం, దేశభక్తి భావనలు కలిగిస్తే వారు నేరస్తులు కాకుండా ఆపగలిగే వాళ్ళం. ఈ విధంగా వారి జీవన స్వరూపం మొత్తం మారిపోయి వుండేది." అని రాశారు.

ఒక సర్వే ప్రకారం 3 సం. వయస్సున్న ఓ బాలుడు టీవీ చూడడం ప్రారంభిస్తే, అతని యింట్లో 12, 13 ఛానళ్ళు కేబుల్ కనెక్షన్ ద్వారా వస్తూ వున్నట్లయితే, అతడు 20 యేళ్ళ వాడయ్యే సరికి 33,000 హత్యలు, 72,000 సార్లు అశ్లీల మరియు బలాత్కార దృశ్యాలు చూసి వుంటాడట. ఇది 2002లో జరిగిన సర్వే, మరి యిప్పుడో - లెక్కలేనన్ని ఛానళ్ళు, పుంఖానుపుంఖాలుగా కుట్రలు, హత్యలు, బలాత్కారాలు, అశ్లీల దృశ్యాలు.

ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అనే పేరుగల చిన్న పిల్లవాడు ఒకటి రెండు సార్లు "హరిశ్చంద్ర నాటకం" చూసి సత్యవాదిగా మారాడు. అతడే మహాత్మా గాంధీ పేరిట ఈనాటికీ పూజింప బడుతున్నాడు. కేవలం హరిశ్చంద్ర నాటకమే ఇంత ప్రభావం చూపితే, ఆ పిల్లవాడి జీవితాంతమూ సత్యాహింసలు పాటించేలా ప్రేరేపిస్తే, జీవితాంతమూ 33వేల హత్యా దృశ్యాలూ, 72వేల అత్యాచార దృశ్యాలు చూసే పసివాళ్ళు ఏం కావాలి?

పిల్లలే దేశ సంపద అని గుర్తుంచుకోండి. వారు భవిషత్తులో మీకూ-దేశానికీ ఉపయోగ పడేలా తయారయ్యే వాతావరణాన్ని కల్పించండి. దేశ నవనిర్మాణానికి సహకరించంది. దేశభావి నేతలనూ (నేతలంటే రాజకీయ నేతలు మాత్రమే కాదండీ, రామానుజం, మోక్షగుండం, సర్వేపల్లి, స్వామినాథన్, కలాం లాంటి వారని), మీ చిన్నారి బాలలనూ నాశనం చేసే అన్నింటినీ బహిష్కరించండి. మీ పిల్లలు మీకూ, సమాజానికీ భారం కాకూడదు.

1 comment:

Sudhakar said...

మీడియాకు కూడా పిల్లలపై బాధ్యత పెరగాలండి. ఈ మధ్య మన తెలుగు ప్రసార వాహికలు చూస్తుంటే విరక్తి కలుగుతుంది. :-(