Friday, September 28, 2007


అరిచే కుక్క మొరగదు - రెండు


కుక్క కరిస్తే బొడ్డుచుట్టూ పద్నాలుగింజక్షన్లు చేయించుకోవాలంటూ పెద్దలు వీధికుక్కలతో ఆటలాడుతుండే పిల్లలను హెచ్చరిస్తూండటం మా చిన్నప్పుడు పరిపాటి.ఇప్పుడెవరూ అనటంలేదనుకుంటా. ఎందుకంటే మూడిటితోనే సరిపోయే మోడర్న్ ఇంజక్షన్లు వచ్చేశాయిగా. అంతేకాకుండా కుక్కలకు కూడా అవి కరిచినా ఏమీకాకుండేందుకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లూ వున్నాయిప్పుడు.

క్రితం ఎపిసోడ్లో బొడ్డుచుట్టూ పద్నాలుగింజక్షన్లు చేసుకున్నవాడికి తెలుస్తుంది ఆ బాధేంటో అన్న సంగతి గుర్తుండే వుంటుంది. పద్నాలుగింజక్షన్ల సంగతేమోగానీ 26 (౨౬) ఇంజక్షన్లు చేయించుకున్న వ్యక్తి నాకు తెలుసు. ఆశ్చర్యపోకండి - ఆ వ్యక్తి ఎవరోకాదు మా అన్నయ్యే. మా అన్నయ్య ఇంజనీరింగ్ రెండో సంవత్సరం పరీక్షలు రాసి సెలవలకి శివమొగ్గ-షిమోగ(కర్ణాటక)నుండి ఇంటికొచ్చాడు. అప్పుడు మేము మచిలీపట్టణంలో వున్నాము. కరెక్టుగా గుర్తు లేదుకానీ, సైకిల్ మీద మా నాన్న ఆఫీసునుండి అన్నయ్య ఇంటికి తిరిగి వస్తూండగా కరిచిందని మాత్రం గుర్తు. అరవలేదు, మొరగలేదు కానీ సడన్‌గా వచ్చి కరిచిందిట.

అప్పట్లో ఈ ఇంజక్షన్లు గవర్నమెంటాస్పత్రిలో ఉచితంగా వేసేవాళ్ళు. ఆ ఇంజక్షన్లు బయట దొరికేవు కావు, అందుకని అన్నయ్యను ప్రతిరోజూ గవర్నమెంటాస్పత్రికి తీసుకెళ్ళేవాళ్ళం. మొదట్లో పెద్దగా పట్టించుకోక పోయినా మూడ్రోజులయ్యేసరికి నొప్పి బాగా చేసినట్లుంది. పొట్టంతా వాచిపోయి తెగ ఇబ్బంది పడేవాడు. ఇలా వరుసగా 9 రోజులు గడిచాయి. పదోరోజు ఆస్పత్రికి వెళితే తెలిసింది ఇంజక్షన్లు స్టాకు లేదని - నాల్రోజులైతే గాని రావని. సరేనని ఇంటికొచ్చేశాం నాల్రోజుల తర్వాత వస్తామని చెప్పి, కానీ తర్వాత తెలిసింది - ఆ పద్నాలుగు ఇంజక్షన్ల కోర్సు గ్యాప్ లేకుండా చేయించుకోవాలని. మధ్యలో ఆపితే మళ్లా పద్నాలుగు. అన్నయ్య చేయించుకోనంటే చేయించుకోనని మొండికేశాడు. అది పిచ్చికుక్కైతేనే కదా ప్రమాదం, నన్నకరిచింది మంచికుక్కేనంటాడు. కుక్క కరిచినదానికంటే ఇంజక్షన్ల బాధే ఎక్కువ మరి. మా నాన్న ఆఫీసు స్టాఫు అన్నయ్య చెప్పిన గుర్తులతో ఆ కరిచిన కుక్కకోసం వెతుకులాట మొదలెట్టారు. రెండ్రోజులు వెతికినా కనపడలేదు. ఈలోపెవరో అన్నారు ఆ కరిచిన కుక్క గనుక చనిపోతే మాత్రం గ్యారెంటీగా పిచ్చి వున్నట్లే - జాగ్రత్తని.

నాల్రోజులైపోయాయి - కుక్కమాత్రం కనపడలేదు. నేనప్పుడు హిందూ కాలేజీలో బియ్యెస్సీ చదువుతూండేవాణ్ణి. మా ఫ్రెండ్సందరికీ ఇదే పని. ఎక్కడ కుక్కైనా సరే కొంచె పోలికలు కనిపిస్తే చాలు ఇదేనా ఇదేనా అంటూ చూపించేవాళ్ళు. తెలిసిన డాక్టరవడంతో ఇంజక్షన్లు స్టాకు రావడంతో ఫోన్ చేసి మరీ చెప్పాడు, కానీ అన్నయ్య వెళ్ళనంటే వెళ్ళనని భీష్మించుక్కూచున్నాడు. మా అమ్మకి ఏడుపొకటే తక్కువ. ఓ రెండ్రోజుల తర్వాతను కుంటా మా ఫ్రెండు ప్రవీణ్‌ వాళ్ళింటికి అన్నయ్య రోజూ వెళుతుంటే, అనుమాన మొచ్చి ప్రవీణ్‌ను అడిగితే చెప్పాడు ఆస్పత్రికి వెళ్తున్నారని (ఎందుకంటే ప్రవీణ్ వుండేది మలకాపట్నంలో - ఆస్పత్రికి దగ్గర). అన్నయ్యను నిలదీస్తే చెప్పాడు ఆ కుక్క అన్నయ్యకే కనిపించిందట - చచ్చిపోయి. భయపడి,మాకు చెబితే ఏడిపిస్తామని రెండ్రోజుల నుండీ ప్రవీణ్‌తో వెళుతున్నాడట. నన్నుకూడా ఎవరికీ చెప్పద్దన్నాడు.

నాలుగోరోజు అస్పత్రికి వెళ్లేసరికి కాంపౌండరు చెప్పాడు - స్టాకైపోయినాయని. అన్నయ్యకు కళ్ళనీళ్ళొకటే తక్కువ. విషయమేమిటంటే, డాక్టరు దగ్గరకెళితే తెలిసినాయన కనుక ఇంట్లో చెబుతాడని కాంపౌండరుతో చేయించుకున్నాడు. డాక్టరేమో అన్నయ్యరావటంలేదని వేరేవాళ్ళకు కావాలంటే ఇంజక్షన్లు ఇచ్చేశాడట. చివరికి ఎలాగైతేనేం మా నాన్నగారికి విషయం తెలిసింది. అప్పుడు విజయవాడనుండి మళ్ళీ ఇంకో కోర్సు ఇంజక్షన్లు తెప్పించి బొడ్డుచుట్టూ వేయించారు - మొత్తం 9+3+14, పాపం వెరశి 26.

నాకు తెలిసి ఇంతకంటే బాధాకరమైన ఇంజక్షన్లు చేసుకున్నవారెవరూ లేరు. మీ కెవరైనా తెలిస్తే చెప్పండి.

Sunday, September 23, 2007


హంగరీ - అగ్నిప్రమాదం


మీలో ఎవరైనా అగ్నిప్రమాదం పూర్తిగా చూసారో లేదో గానీ, నాకు మాత్రం ఇదే మొదటి సారి.

బుడా పెస్టులో ఓ వీధిలోని అపార్టుమెంటులో నేనుంటున్నాను. 'ఓ వీధి' అంటే ఏదో ఒక వీధి కాదు - నేనుండే వీధిపేరే 'ఓ వీధి'. (Ó utca) ఓ ఉట్స - O street ఆంగ్లంలో. సాయంకాలం సుమారు ఏడున్నర ఎనిమిది మధ్యలో బాల్కనీలోకి వచ్చి సంజ వెలుగులో సిటీ అందాలు చూస్తున్నాను. మా వీధి మొదల్లో వుండే మరొక అపార్టుమెంట్లోంచి మెఱుపులాంటిదొచ్చింది. ఏమిటా అని చూస్తూండగానే అదొక మంటలాగా తయారయింది. ఓ నిమిషానిగ్గానీ నాకర్థంగాలా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంట వచ్చిందని. మంట పెరిగి పెద్దదవుతూంది - ఆ యింట్లో ఎవరైనా వున్నారో లేదో తెలీదు. ఆశ్చర్యంగా చూస్తూండిపోయా. మంట తగ్గి పొగ సుడులు తిరుగుతూ కిటికీలోనుండి వస్తూండగా వినిపించింది ఫైరింజను సౌండు.ప్రత్యక్షంగా చూస్తున్నాను కనుక చెబుతున్నాను - మంట మొదలైన మూడు లేదా నాలుగో నిమిషంలో ఫైరింజను సౌండు వినిపించింది.

దగ్గర్నుంచి చూద్దామన్న ఉత్సాహంతో అక్కడకి పరిగెత్తాను. దానయ్యలు, విదేశీయులు (నేనుకూడా విదేశీయుడినే - హహ్హ) కెమెరాలతోనూ, మొబైల్లతోనూ ఫొటోలు తీసుకోవడం చూసి హడావుడిలో కెమెరా తీసుకు రావటం మరచిపోయినందుకు నన్నునేనే తిట్టుకున్నాను. నేనక్కడికి చేరుకునే సరికి రెండు బుల్లి బుల్లి (ఒక్కోటి మన సుమో అంత వుంటుందేమో) ఫైరింజన్లు వచ్చాయి. ఇక అక్కడ్ణుంచి ఇంగ్లీషు సినిమా మొదలయ్యింది. ఒక్క నిచ్చెనొక్కటే తక్కువ. (మీలో చాలా మంది ఇంగ్లీషు సినిమాలో అగ్నిప్రమాదాలనార్పడం చూసేవుంటారు - అది విజువలైజ్ చేసుకోండి. చూడనివాళ్ళు -క్షమించండి-చూసినవాళ్ళనడికి తెలుసుకోండి) అచ్చంగా అలాగే జరిగింది. నలుగురు ఫైర్‌డ్రస్సు వేసుకుని, గొట్టాలు పట్టుకుని పైకి (7వ అంతస్తుకి) పరిగెత్తారు. ఇద్దరు క్రిందనుండి (డ్రైవర్లు కామోసు) రోడ్డుమీదుండే ఎర్ర పైపులకు గొట్టాలను తగిలించారు. వాళ్లు లోపలనుండి ఆర్పితే, వీళ్ళిద్దరూ క్రిందనుండి ఒకరి తర్వాత ఒకరు పైకి నీళ్ళు పిచికారీ చేశారు. వావ్‌, పాయింటెడ్ ఫౌంటెను లాగా ఏడంతస్తుల పైకి నీటిధార వెళుతుంటే, నిజంగా భలేగుంది సార్‌.

కాకపోతే మీరు తెరమీద చూశారు,నేను నాలుగు కళ్ళతో చూశాను. మీరు దర్శకుడు చూపించిందే చూశారు నేను చుట్టుపక్కల జరుగుతున్నదీ చూశాను. ఫైరింజన్లు రోడ్డు ప్రక్కగా, పార్కింగు చేసినట్లుగా నిలిపారు ట్రాఫిక్కుకు ఇబ్బందిలేకుండా. ఓ అంబులెన్సూ వచ్చింది కానీ దాని అవసరం పడినట్లు లేదు. రోడ్డు బ్యారికేడ్లూ లేవు, బ్లాకింగూ లేదు. యధావిధిగా ట్రాములూ నడుస్తున్నాయి, కార్లూ తిరుగు తూన్నాయి. నో ట్రాఫిక్ జామ్స్. కాకపోతే రెండ్ణిమిషాలకో, మూడ్ణిమిషాలకో రయ్యికయ్యి రయ్యికయ్యంటూ పోలీసు కార్లు దుమ్ములేపకుండా వచ్చి చూసి వెళుతున్నారు. ఎవరూ ఎవరితో మాట్లాడటంలేదు.

ఓ పదీ పన్నెండు నిమిషాల తర్వాత పొగచూరిన కిటికీ, తడిసిన బిల్డింగూ, నోళ్ళెల్లబెట్టుకుని చూస్తున్న నేను, నా సహోద్యోగి, మరికొందరు దానయ్యలూ, దానమ్మలూ తప్ప అంతా మామూలే. అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించిన విషయమేమిటంటే, ఏడో అంతస్థు(స్తు)లో మంటలొస్తుంటే గ్రౌండు ఫ్లోరులో వుండే షాపోడు (పెద్దదే - ఎలక్ట్రానిక్సూ, నావెల్టీసు) సుబ్బరంగా అమ్ముకుంటున్నాడు.

(వీడెవడండీ, ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే చుట్టకాల్చుకోడానికి నిప్పడిగినట్టు వాళ్ళేదో మంటలార్పడానికి కుస్తీ పడుతుంటే - సినిమాచూసి నట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. లాప్‌టాప్‌లో ఈ ఉదంతం టైపు చేస్తున్నప్పుడు నాగురించి నాకనిపించిన వాక్యం అది. నిజంగానే భలే చేశారు, భలేగ జరిగింది, భలేగుంది అని తప్ప ఒక్క క్షణంకూడా అయ్యో పాపం అనిపించలేదు. మరీ మెటీరియలిస్టుగా అయిపోతున్నానా?)

Saturday, September 22, 2007


పిల్లలు - పార్టీలు


గురువారం మధ్యాహ్నం హంగేరియన్ సహోద్యోగిని సెలవు తీసుకుంది - కారణం తెలీదు. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో అడిగింది - కంప్యూటర్లో ఫొటోషాప్‌తో ఫొటోలు ట్రిమ్ చేసి బోర్డర్ ఫ్రేమ్ జతచేయటం నేర్పమని. అంతకు ముందొకసారి నేను నా ఫొటోలు మాడిఫై చేస్తుంటే చూసి అడిగింది తనకు కూడా నేర్పమని. అప్పుడు సరేనని చెప్పడంతో ఇప్పుడడిగింది. అప్పుడే పెన్ డ్రైవ్ నుండి కాపీ చేసిన ఫొటోలను ఫొటోషాప్ లో తెరిచినప్పుడు చూసాను - చిన్నపిల్లల పార్టీ ఫొటోలు. ఓ చిన్నపిల్లెవరో కానీ చాలా క్యూట్‌గా ముద్దొస్తోంది. అడిగితే చెప్పింది వాళ్ల పాపేనని - అ పార్టీ పుట్టిన రోజు పార్టీ అనిన్నూ. నిన్న మధ్యాహ్నం సెలవు పెట్టి మరీ వెళ్ళడానికి కారణం కూడా అదేననీ. వాళ్ళ పాప ఆరు నిండి ఏడో సంవత్సరంలోకి అడుగు పెట్టిందిట. ఫ్రేమ్ ఎలా జత చేయాలో ఒకట్రెంటికి చూపించిన తరువాత మిగిలినవాటికి తనే చేసుకుంది. ఆరోజు సాయంకాలం కూతుర్ని బయటకు తీసుకు వెళ్తానని చెప్పడంతో ఆఫీసు నుండి ముందే వెళ్ళిపోయింది.

అసలు విషయమేమిటంటే, ఇక్కడలాగా పిల్లల పుట్టిన రోజుకి పెద్దలెవరినీ బొట్టుపెట్టి పిలవరట. సాధారణంగా పిల్లలు పిల్లల్నిమాత్రం పిల్చి పార్టీ ఇస్తారట. పిల్లల పార్టీకి పిల్లలే పెద్దలు. పార్టీ ఎలా జరగాలో, ఎక్కడ జరగాలో, ఎవరెవర్ని పిలవాలో ... అన్నింటిలోను పిల్లల ప్రమేయం వుంటుందిట. పెద్దలు పక్కన సపోర్టివ్‌గా మాత్రం వుంటారట. తప్పుచేస్తే సరిదిద్ది ఎలా చేయాలో చెబుతారట.

ఇదంతా వింటున్నప్పుడనిపించింది, చిన్నప్పటినుంచే పిల్లలకి బాధ్యతలు మీదవేసుకోవటం, సరైన నిర్ణయాలు తీసుకోవటం లాంటివి ఎంత చక్కగా నేర్పిస్తున్నారని. మనదగ్గర చూడండి. పేరుకి పిల్లల పుట్టిన రోజనే గానీ, పెత్తనం అంతా పెద్దలదే. పిల్లాణ్ణి (పిల్లదాన్ని) మాత్రం కొత్తబట్టలంటూ ఒకదానిపై ఒకటి వేసి, ఆడపిల్లలైతే మరీను - అన్నిరకాల షోకులూ చేసి, ఊపిరాడకుండా బిగించి పారేస్తుంటారు. ఎటైనా కదులు తూంటే సవాలక్ష జాగ్రత్తలు - అటెళ్ళకు, ఇది చేయకు, కొత్త పట్టు పరికిణీ నలిగి పోతుంది, ఫాంటు మాసిపోతుంది అంటూ ముకుతాడేస్తూ వుంటారు. వాళ్ళేది చేయాలన్నా పెద్దల అనుమతి కావాల్సిందే. పాపం అనిపిస్తోందిప్పుడు.

Saturday, September 01, 2007


అరిచే కుక్క మొరగదు - ఒకటి


మీలో కుక్కలంటే ఎందరికి భయం ? లేదా భయం లేనిదెంతమందికి?

ఇప్పటిదాకా నా పరిశీలన ప్రకారం (నేనేం పనిగట్టుకునేం రీసెర్చ్ చెయ్యలేదు - జస్ట్ క్యాజువల్ అబ్జర్వేషన్) కుక్కలంటే భయం లేనివారు లేరు. ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు, ఎంతోకొంచెం ప్రతి ఒక్కరూ కుక్కలకి భయపడే వుంటారు.

'కుక్కవున్నది జాగ్రత' అన్న బోర్డు చూసికూడా ధైర్యంగా తలుపు తట్టే దమ్మెవరికుందండీ <-
రోడ్డు మీద నడుస్తుంటే అకస్మాత్తుగా వెనకనుండి ఓ కుక్క భౌమంటే గుండె ఝల్లుమననిదెవరికి <-
అంతేకాదు రాత్రిపూట ఒంటరిగా వస్తూంటే వాళ్ళ సామ్రాజ్యంలోకి చొరబడ్డ శత్రువుల్లాగా మనల్ని క్రూరంగా చూస్తూ మొరిగే కుక్కల్ని చూసి బిక్కచచ్చిపోనివాడెవడు <-

కానీ పగలు వెనక రాత్రి, రాత్రి వెనుక పగలు వున్నట్లు ఈ ప్రపంచంలో కుక్కల్నిచూచి భయపడేవాళ్ళే కాదు, పెంచుకునే వాళ్ళూ వుంటారు. ఈ పెంచుకునే వాళ్ళు రెండు రకాలు. ప్రేమగా పెంచుకునేవాళ్ళు కొందరైతే, అవసరం కోసం పెంచుకునే వాళ్ళు మరికొందరు. (స్టేటస్ కోసం కూడా పెంచుకునే వాళ్ళను కూడా చూశాను)

వీళ్ళ దగ్గరో తమాషా వాదనొకటి నేను తరచూ వింటూవుంటాను. అదేంటంటే, 'ప్రపంచంలో అత్యంత విశ్వాస పాత్రమైన జంతువు కుక్క - అలాంటి కుక్కని చూచెందుకండీ భయపడతారు?' అంటూ వుంటారు కుక్కల్ని పెంచుకునే శునక ప్రేమికులు. నిజమే సుమా! ఓ ఎంగిలి ముద్ద పడేస్తే మనం పొమ్మన్నా పోకుండా మనచుట్టూ తిరుగుతూ వుంటుంది. (ఓ ముద్ద సరిపోలేదు కాబోలు)

'భయపడక చావాలా. ఎంతమంది కుక్కలబారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగట్లేదు. బొడ్డు చుట్టూ ఫధ్నాళుఘు ఇండీషన్లేసుకున్నవాడికి తెలుస్తుంది దాని బాధేంటో' అనేవాళ్ళూ వున్నారు - ప్రత్యక్ష లేక పరోక్షానుభవం మరి.

తార్కికంగా ఆలోచిస్తే, కుక్క ఎవరికి విశ్వాస పాత్రమైనది? మనిషికి అన్నది ఆబ్వియస్ సమాధానం.
మరి మనిషి కుక్కకి విశ్వాస పాత్రుడా కాదా? స్టాటిస్టికల్‌గా మనిషి కరచిన కుక్కల కంటే, కుక్కలు కరచిన మనుషులే ఎక్కువ కాబట్టి కాదనే అనిపిస్తుంది. అందువల్ల కుక్కలు మనుషుల్ని కరవడంలో విచిత్రమేమీ లేదు. కరవడం వాటి జన్మహక్కు. (ఔ అనండి, వెనక మేనగాగాంధీ కర్రట్టుకు నుంచుంది). 'ఆగండాగండి. మనిషి కుక్కల్ని కరవడమేమిటండీ' అంటారా. మరి కుక్కలు మనుషుల్ని కరుస్తున్నాయిగా అందుకన్నమాట. ఓకే!

...మ్‌మ్. ఇంకా ఏదో లోపం కనిపిస్తోందా నా తర్కంలో. ఒక్కక్షణం.
వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముల్లుని ముల్లుతోనే తియ్యాలి అంటారు పెద్దలు అవునా.
కుక్క జంతువు, నాలుగు కాళ్ళుంటాయి - మనిషినీ నాలుక్కాళ్ళ జంతువంటారు. సారూప్యత సరిపోయింది.
'మరి మనిషి కుక్కని కొడతాడు కదా' అనొచ్చు. వాడెవడో తిట్టాడు, నువ్వూ తిట్టు - సరికి సరి. కానీ నువ్వెళ్ళి కొట్టావనుకో, పోలీసోడు నీ తాట తీస్తాడు. అలాగే కావాలంటే కుక్కని కూడా కొట్టమనండి. (వితండవాదమా ... మజాకానా)

తర్కం చెప్పేదేంటంటే...
మనిషి కుక్కల్ని నమ్ముతాడు [1]
కానీ కుక్కలు మనుషుల్ని నమ్మవు [2]
అందువలన మనుషులు కుక్కల్ని నమ్మకూడదు [3]
కాబట్టి ఫైనల్‌గా మన జాగ్రతలో మనం వుండటం మంచిది.

ఈ సందర్భంగా నిజంగా జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తోంది. మా అన్నయ్యకో కుక్క వుంది - పేరు మార్కీ. ఓ సారి బయటనుంచి తిరిగీ తిరిగీ వచ్చి 'నొప్పిగా వున్నాయి కాళ్ళు తొక్కు' అన్నాడు. 'నేను తొక్కను' అన్నా. (నాకెందుకో చిన్నప్పటినుండీ ఇంకొకళ్ళకి కాళ్ళు తొక్కడం, తల పట్టడం,పీక నొక్కడం లాంటి పనులెందుకో ఇష్టం వుండవు - అలాగే నేనూ ఎవరినీ అడగను కూడా). ప్రక్కనే వున్న మా పిన్నిగారబ్బాయి నడిగాడు. 'సరే'నని లేచి తొక్కటానికి కాలు మీద పెట్టాడో లేదో - 'ఖయ్యి'మనరుస్తూ మీద కొచ్చి కాలు పట్టుకొంది మార్కీ - మా అన్నయ్య మీద కెవరో వచ్చారన్నది దాని కోపానికి కారణం. బిక్కచచ్చిపోయాడు మా తమ్ముడు. ఎక్కడో వేరే గదిలో మంచంకింద బొమిక చీక్కుంటూ హాయిగా కూచుంది అంత సడన్‌గా రావడానికి కారణం - ఇందాక వాళ్ళు చెప్పిన విశ్వాసమేనా?

కానీ ఇప్పుడు బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు చేయించుకునేంత అంత బాధక్కర్లేదు - యాంటీరేబీస్ ఇంజక్షన్లు మూడేసుకుంటే చాలుట (మావాడికీ వేయించాం, కుక్కకి ఆల్రడీ వేక్సీన్ చేయించి వున్నా మావాడికి భయం తగ్గటానికి).

ఆలోచిస్తే శునక ప్రేమికులు చెప్పిన దాంట్లో నిజముంది (కుక్క విశ్వాసానికి మారుపేరు). తన యజమానికి ఏమన్నా హాని జరుగుతుందన్న అనుమానం వస్తేచాలు - తెలుగు సినిమా హీరోలా యాక్షన్లో దూకి కాపాడటానికి రెడీగా వుంటుంది. మనం చేసే పనులు యజమానికి హాని చేయని తెలిస్తే అది ఎవరినీ ఏం చేయదన్నది వీరి వాదం. (హాని కాకపోయినా హానిచేస్తున్నట్లనిపించే పనులు చేసినా వాటికి కోపం వస్తుంది - జాగ్రత)

మరి యజమాని లేని కుక్కల సంగతేంటి? మేనకా గాంధీనో, మునిసిపాలిటీ వాళ్ళనో అడగాల్సిన ప్రశ్నిది.

మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం.