Friday, September 28, 2007


అరిచే కుక్క మొరగదు - రెండు


కుక్క కరిస్తే బొడ్డుచుట్టూ పద్నాలుగింజక్షన్లు చేయించుకోవాలంటూ పెద్దలు వీధికుక్కలతో ఆటలాడుతుండే పిల్లలను హెచ్చరిస్తూండటం మా చిన్నప్పుడు పరిపాటి.ఇప్పుడెవరూ అనటంలేదనుకుంటా. ఎందుకంటే మూడిటితోనే సరిపోయే మోడర్న్ ఇంజక్షన్లు వచ్చేశాయిగా. అంతేకాకుండా కుక్కలకు కూడా అవి కరిచినా ఏమీకాకుండేందుకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లూ వున్నాయిప్పుడు.

క్రితం ఎపిసోడ్లో బొడ్డుచుట్టూ పద్నాలుగింజక్షన్లు చేసుకున్నవాడికి తెలుస్తుంది ఆ బాధేంటో అన్న సంగతి గుర్తుండే వుంటుంది. పద్నాలుగింజక్షన్ల సంగతేమోగానీ 26 (౨౬) ఇంజక్షన్లు చేయించుకున్న వ్యక్తి నాకు తెలుసు. ఆశ్చర్యపోకండి - ఆ వ్యక్తి ఎవరోకాదు మా అన్నయ్యే. మా అన్నయ్య ఇంజనీరింగ్ రెండో సంవత్సరం పరీక్షలు రాసి సెలవలకి శివమొగ్గ-షిమోగ(కర్ణాటక)నుండి ఇంటికొచ్చాడు. అప్పుడు మేము మచిలీపట్టణంలో వున్నాము. కరెక్టుగా గుర్తు లేదుకానీ, సైకిల్ మీద మా నాన్న ఆఫీసునుండి అన్నయ్య ఇంటికి తిరిగి వస్తూండగా కరిచిందని మాత్రం గుర్తు. అరవలేదు, మొరగలేదు కానీ సడన్‌గా వచ్చి కరిచిందిట.

అప్పట్లో ఈ ఇంజక్షన్లు గవర్నమెంటాస్పత్రిలో ఉచితంగా వేసేవాళ్ళు. ఆ ఇంజక్షన్లు బయట దొరికేవు కావు, అందుకని అన్నయ్యను ప్రతిరోజూ గవర్నమెంటాస్పత్రికి తీసుకెళ్ళేవాళ్ళం. మొదట్లో పెద్దగా పట్టించుకోక పోయినా మూడ్రోజులయ్యేసరికి నొప్పి బాగా చేసినట్లుంది. పొట్టంతా వాచిపోయి తెగ ఇబ్బంది పడేవాడు. ఇలా వరుసగా 9 రోజులు గడిచాయి. పదోరోజు ఆస్పత్రికి వెళితే తెలిసింది ఇంజక్షన్లు స్టాకు లేదని - నాల్రోజులైతే గాని రావని. సరేనని ఇంటికొచ్చేశాం నాల్రోజుల తర్వాత వస్తామని చెప్పి, కానీ తర్వాత తెలిసింది - ఆ పద్నాలుగు ఇంజక్షన్ల కోర్సు గ్యాప్ లేకుండా చేయించుకోవాలని. మధ్యలో ఆపితే మళ్లా పద్నాలుగు. అన్నయ్య చేయించుకోనంటే చేయించుకోనని మొండికేశాడు. అది పిచ్చికుక్కైతేనే కదా ప్రమాదం, నన్నకరిచింది మంచికుక్కేనంటాడు. కుక్క కరిచినదానికంటే ఇంజక్షన్ల బాధే ఎక్కువ మరి. మా నాన్న ఆఫీసు స్టాఫు అన్నయ్య చెప్పిన గుర్తులతో ఆ కరిచిన కుక్కకోసం వెతుకులాట మొదలెట్టారు. రెండ్రోజులు వెతికినా కనపడలేదు. ఈలోపెవరో అన్నారు ఆ కరిచిన కుక్క గనుక చనిపోతే మాత్రం గ్యారెంటీగా పిచ్చి వున్నట్లే - జాగ్రత్తని.

నాల్రోజులైపోయాయి - కుక్కమాత్రం కనపడలేదు. నేనప్పుడు హిందూ కాలేజీలో బియ్యెస్సీ చదువుతూండేవాణ్ణి. మా ఫ్రెండ్సందరికీ ఇదే పని. ఎక్కడ కుక్కైనా సరే కొంచె పోలికలు కనిపిస్తే చాలు ఇదేనా ఇదేనా అంటూ చూపించేవాళ్ళు. తెలిసిన డాక్టరవడంతో ఇంజక్షన్లు స్టాకు రావడంతో ఫోన్ చేసి మరీ చెప్పాడు, కానీ అన్నయ్య వెళ్ళనంటే వెళ్ళనని భీష్మించుక్కూచున్నాడు. మా అమ్మకి ఏడుపొకటే తక్కువ. ఓ రెండ్రోజుల తర్వాతను కుంటా మా ఫ్రెండు ప్రవీణ్‌ వాళ్ళింటికి అన్నయ్య రోజూ వెళుతుంటే, అనుమాన మొచ్చి ప్రవీణ్‌ను అడిగితే చెప్పాడు ఆస్పత్రికి వెళ్తున్నారని (ఎందుకంటే ప్రవీణ్ వుండేది మలకాపట్నంలో - ఆస్పత్రికి దగ్గర). అన్నయ్యను నిలదీస్తే చెప్పాడు ఆ కుక్క అన్నయ్యకే కనిపించిందట - చచ్చిపోయి. భయపడి,మాకు చెబితే ఏడిపిస్తామని రెండ్రోజుల నుండీ ప్రవీణ్‌తో వెళుతున్నాడట. నన్నుకూడా ఎవరికీ చెప్పద్దన్నాడు.

నాలుగోరోజు అస్పత్రికి వెళ్లేసరికి కాంపౌండరు చెప్పాడు - స్టాకైపోయినాయని. అన్నయ్యకు కళ్ళనీళ్ళొకటే తక్కువ. విషయమేమిటంటే, డాక్టరు దగ్గరకెళితే తెలిసినాయన కనుక ఇంట్లో చెబుతాడని కాంపౌండరుతో చేయించుకున్నాడు. డాక్టరేమో అన్నయ్యరావటంలేదని వేరేవాళ్ళకు కావాలంటే ఇంజక్షన్లు ఇచ్చేశాడట. చివరికి ఎలాగైతేనేం మా నాన్నగారికి విషయం తెలిసింది. అప్పుడు విజయవాడనుండి మళ్ళీ ఇంకో కోర్సు ఇంజక్షన్లు తెప్పించి బొడ్డుచుట్టూ వేయించారు - మొత్తం 9+3+14, పాపం వెరశి 26.

నాకు తెలిసి ఇంతకంటే బాధాకరమైన ఇంజక్షన్లు చేసుకున్నవారెవరూ లేరు. మీ కెవరైనా తెలిస్తే చెప్పండి.

Sunday, September 23, 2007


హంగరీ - అగ్నిప్రమాదం


మీలో ఎవరైనా అగ్నిప్రమాదం పూర్తిగా చూసారో లేదో గానీ, నాకు మాత్రం ఇదే మొదటి సారి.

బుడా పెస్టులో ఓ వీధిలోని అపార్టుమెంటులో నేనుంటున్నాను. 'ఓ వీధి' అంటే ఏదో ఒక వీధి కాదు - నేనుండే వీధిపేరే 'ఓ వీధి'. (Ó utca) ఓ ఉట్స - O street ఆంగ్లంలో. సాయంకాలం సుమారు ఏడున్నర ఎనిమిది మధ్యలో బాల్కనీలోకి వచ్చి సంజ వెలుగులో సిటీ అందాలు చూస్తున్నాను. మా వీధి మొదల్లో వుండే మరొక అపార్టుమెంట్లోంచి మెఱుపులాంటిదొచ్చింది. ఏమిటా అని చూస్తూండగానే అదొక మంటలాగా తయారయింది. ఓ నిమిషానిగ్గానీ నాకర్థంగాలా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంట వచ్చిందని. మంట పెరిగి పెద్దదవుతూంది - ఆ యింట్లో ఎవరైనా వున్నారో లేదో తెలీదు. ఆశ్చర్యంగా చూస్తూండిపోయా. మంట తగ్గి పొగ సుడులు తిరుగుతూ కిటికీలోనుండి వస్తూండగా వినిపించింది ఫైరింజను సౌండు.ప్రత్యక్షంగా చూస్తున్నాను కనుక చెబుతున్నాను - మంట మొదలైన మూడు లేదా నాలుగో నిమిషంలో ఫైరింజను సౌండు వినిపించింది.

దగ్గర్నుంచి చూద్దామన్న ఉత్సాహంతో అక్కడకి పరిగెత్తాను. దానయ్యలు, విదేశీయులు (నేనుకూడా విదేశీయుడినే - హహ్హ) కెమెరాలతోనూ, మొబైల్లతోనూ ఫొటోలు తీసుకోవడం చూసి హడావుడిలో కెమెరా తీసుకు రావటం మరచిపోయినందుకు నన్నునేనే తిట్టుకున్నాను. నేనక్కడికి చేరుకునే సరికి రెండు బుల్లి బుల్లి (ఒక్కోటి మన సుమో అంత వుంటుందేమో) ఫైరింజన్లు వచ్చాయి. ఇక అక్కడ్ణుంచి ఇంగ్లీషు సినిమా మొదలయ్యింది. ఒక్క నిచ్చెనొక్కటే తక్కువ. (మీలో చాలా మంది ఇంగ్లీషు సినిమాలో అగ్నిప్రమాదాలనార్పడం చూసేవుంటారు - అది విజువలైజ్ చేసుకోండి. చూడనివాళ్ళు -క్షమించండి-చూసినవాళ్ళనడికి తెలుసుకోండి) అచ్చంగా అలాగే జరిగింది. నలుగురు ఫైర్‌డ్రస్సు వేసుకుని, గొట్టాలు పట్టుకుని పైకి (7వ అంతస్తుకి) పరిగెత్తారు. ఇద్దరు క్రిందనుండి (డ్రైవర్లు కామోసు) రోడ్డుమీదుండే ఎర్ర పైపులకు గొట్టాలను తగిలించారు. వాళ్లు లోపలనుండి ఆర్పితే, వీళ్ళిద్దరూ క్రిందనుండి ఒకరి తర్వాత ఒకరు పైకి నీళ్ళు పిచికారీ చేశారు. వావ్‌, పాయింటెడ్ ఫౌంటెను లాగా ఏడంతస్తుల పైకి నీటిధార వెళుతుంటే, నిజంగా భలేగుంది సార్‌.

కాకపోతే మీరు తెరమీద చూశారు,నేను నాలుగు కళ్ళతో చూశాను. మీరు దర్శకుడు చూపించిందే చూశారు నేను చుట్టుపక్కల జరుగుతున్నదీ చూశాను. ఫైరింజన్లు రోడ్డు ప్రక్కగా, పార్కింగు చేసినట్లుగా నిలిపారు ట్రాఫిక్కుకు ఇబ్బందిలేకుండా. ఓ అంబులెన్సూ వచ్చింది కానీ దాని అవసరం పడినట్లు లేదు. రోడ్డు బ్యారికేడ్లూ లేవు, బ్లాకింగూ లేదు. యధావిధిగా ట్రాములూ నడుస్తున్నాయి, కార్లూ తిరుగు తూన్నాయి. నో ట్రాఫిక్ జామ్స్. కాకపోతే రెండ్ణిమిషాలకో, మూడ్ణిమిషాలకో రయ్యికయ్యి రయ్యికయ్యంటూ పోలీసు కార్లు దుమ్ములేపకుండా వచ్చి చూసి వెళుతున్నారు. ఎవరూ ఎవరితో మాట్లాడటంలేదు.

ఓ పదీ పన్నెండు నిమిషాల తర్వాత పొగచూరిన కిటికీ, తడిసిన బిల్డింగూ, నోళ్ళెల్లబెట్టుకుని చూస్తున్న నేను, నా సహోద్యోగి, మరికొందరు దానయ్యలూ, దానమ్మలూ తప్ప అంతా మామూలే. అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించిన విషయమేమిటంటే, ఏడో అంతస్థు(స్తు)లో మంటలొస్తుంటే గ్రౌండు ఫ్లోరులో వుండే షాపోడు (పెద్దదే - ఎలక్ట్రానిక్సూ, నావెల్టీసు) సుబ్బరంగా అమ్ముకుంటున్నాడు.

(వీడెవడండీ, ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే చుట్టకాల్చుకోడానికి నిప్పడిగినట్టు వాళ్ళేదో మంటలార్పడానికి కుస్తీ పడుతుంటే - సినిమాచూసి నట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. లాప్‌టాప్‌లో ఈ ఉదంతం టైపు చేస్తున్నప్పుడు నాగురించి నాకనిపించిన వాక్యం అది. నిజంగానే భలే చేశారు, భలేగ జరిగింది, భలేగుంది అని తప్ప ఒక్క క్షణంకూడా అయ్యో పాపం అనిపించలేదు. మరీ మెటీరియలిస్టుగా అయిపోతున్నానా?)

Saturday, September 22, 2007


పిల్లలు - పార్టీలు


గురువారం మధ్యాహ్నం హంగేరియన్ సహోద్యోగిని సెలవు తీసుకుంది - కారణం తెలీదు. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో అడిగింది - కంప్యూటర్లో ఫొటోషాప్‌తో ఫొటోలు ట్రిమ్ చేసి బోర్డర్ ఫ్రేమ్ జతచేయటం నేర్పమని. అంతకు ముందొకసారి నేను నా ఫొటోలు మాడిఫై చేస్తుంటే చూసి అడిగింది తనకు కూడా నేర్పమని. అప్పుడు సరేనని చెప్పడంతో ఇప్పుడడిగింది. అప్పుడే పెన్ డ్రైవ్ నుండి కాపీ చేసిన ఫొటోలను ఫొటోషాప్ లో తెరిచినప్పుడు చూసాను - చిన్నపిల్లల పార్టీ ఫొటోలు. ఓ చిన్నపిల్లెవరో కానీ చాలా క్యూట్‌గా ముద్దొస్తోంది. అడిగితే చెప్పింది వాళ్ల పాపేనని - అ పార్టీ పుట్టిన రోజు పార్టీ అనిన్నూ. నిన్న మధ్యాహ్నం సెలవు పెట్టి మరీ వెళ్ళడానికి కారణం కూడా అదేననీ. వాళ్ళ పాప ఆరు నిండి ఏడో సంవత్సరంలోకి అడుగు పెట్టిందిట. ఫ్రేమ్ ఎలా జత చేయాలో ఒకట్రెంటికి చూపించిన తరువాత మిగిలినవాటికి తనే చేసుకుంది. ఆరోజు సాయంకాలం కూతుర్ని బయటకు తీసుకు వెళ్తానని చెప్పడంతో ఆఫీసు నుండి ముందే వెళ్ళిపోయింది.

అసలు విషయమేమిటంటే, ఇక్కడలాగా పిల్లల పుట్టిన రోజుకి పెద్దలెవరినీ బొట్టుపెట్టి పిలవరట. సాధారణంగా పిల్లలు పిల్లల్నిమాత్రం పిల్చి పార్టీ ఇస్తారట. పిల్లల పార్టీకి పిల్లలే పెద్దలు. పార్టీ ఎలా జరగాలో, ఎక్కడ జరగాలో, ఎవరెవర్ని పిలవాలో ... అన్నింటిలోను పిల్లల ప్రమేయం వుంటుందిట. పెద్దలు పక్కన సపోర్టివ్‌గా మాత్రం వుంటారట. తప్పుచేస్తే సరిదిద్ది ఎలా చేయాలో చెబుతారట.

ఇదంతా వింటున్నప్పుడనిపించింది, చిన్నప్పటినుంచే పిల్లలకి బాధ్యతలు మీదవేసుకోవటం, సరైన నిర్ణయాలు తీసుకోవటం లాంటివి ఎంత చక్కగా నేర్పిస్తున్నారని. మనదగ్గర చూడండి. పేరుకి పిల్లల పుట్టిన రోజనే గానీ, పెత్తనం అంతా పెద్దలదే. పిల్లాణ్ణి (పిల్లదాన్ని) మాత్రం కొత్తబట్టలంటూ ఒకదానిపై ఒకటి వేసి, ఆడపిల్లలైతే మరీను - అన్నిరకాల షోకులూ చేసి, ఊపిరాడకుండా బిగించి పారేస్తుంటారు. ఎటైనా కదులు తూంటే సవాలక్ష జాగ్రత్తలు - అటెళ్ళకు, ఇది చేయకు, కొత్త పట్టు పరికిణీ నలిగి పోతుంది, ఫాంటు మాసిపోతుంది అంటూ ముకుతాడేస్తూ వుంటారు. వాళ్ళేది చేయాలన్నా పెద్దల అనుమతి కావాల్సిందే. పాపం అనిపిస్తోందిప్పుడు.

Saturday, September 01, 2007


అరిచే కుక్క మొరగదు - ఒకటి


మీలో కుక్కలంటే ఎందరికి భయం ? లేదా భయం లేనిదెంతమందికి?

ఇప్పటిదాకా నా పరిశీలన ప్రకారం (నేనేం పనిగట్టుకునేం రీసెర్చ్ చెయ్యలేదు - జస్ట్ క్యాజువల్ అబ్జర్వేషన్) కుక్కలంటే భయం లేనివారు లేరు. ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు, ఎంతోకొంచెం ప్రతి ఒక్కరూ కుక్కలకి భయపడే వుంటారు.

'కుక్కవున్నది జాగ్రత' అన్న బోర్డు చూసికూడా ధైర్యంగా తలుపు తట్టే దమ్మెవరికుందండీ <-
రోడ్డు మీద నడుస్తుంటే అకస్మాత్తుగా వెనకనుండి ఓ కుక్క భౌమంటే గుండె ఝల్లుమననిదెవరికి <-
అంతేకాదు రాత్రిపూట ఒంటరిగా వస్తూంటే వాళ్ళ సామ్రాజ్యంలోకి చొరబడ్డ శత్రువుల్లాగా మనల్ని క్రూరంగా చూస్తూ మొరిగే కుక్కల్ని చూసి బిక్కచచ్చిపోనివాడెవడు <-

కానీ పగలు వెనక రాత్రి, రాత్రి వెనుక పగలు వున్నట్లు ఈ ప్రపంచంలో కుక్కల్నిచూచి భయపడేవాళ్ళే కాదు, పెంచుకునే వాళ్ళూ వుంటారు. ఈ పెంచుకునే వాళ్ళు రెండు రకాలు. ప్రేమగా పెంచుకునేవాళ్ళు కొందరైతే, అవసరం కోసం పెంచుకునే వాళ్ళు మరికొందరు. (స్టేటస్ కోసం కూడా పెంచుకునే వాళ్ళను కూడా చూశాను)

వీళ్ళ దగ్గరో తమాషా వాదనొకటి నేను తరచూ వింటూవుంటాను. అదేంటంటే, 'ప్రపంచంలో అత్యంత విశ్వాస పాత్రమైన జంతువు కుక్క - అలాంటి కుక్కని చూచెందుకండీ భయపడతారు?' అంటూ వుంటారు కుక్కల్ని పెంచుకునే శునక ప్రేమికులు. నిజమే సుమా! ఓ ఎంగిలి ముద్ద పడేస్తే మనం పొమ్మన్నా పోకుండా మనచుట్టూ తిరుగుతూ వుంటుంది. (ఓ ముద్ద సరిపోలేదు కాబోలు)

'భయపడక చావాలా. ఎంతమంది కుక్కలబారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగట్లేదు. బొడ్డు చుట్టూ ఫధ్నాళుఘు ఇండీషన్లేసుకున్నవాడికి తెలుస్తుంది దాని బాధేంటో' అనేవాళ్ళూ వున్నారు - ప్రత్యక్ష లేక పరోక్షానుభవం మరి.

తార్కికంగా ఆలోచిస్తే, కుక్క ఎవరికి విశ్వాస పాత్రమైనది? మనిషికి అన్నది ఆబ్వియస్ సమాధానం.
మరి మనిషి కుక్కకి విశ్వాస పాత్రుడా కాదా? స్టాటిస్టికల్‌గా మనిషి కరచిన కుక్కల కంటే, కుక్కలు కరచిన మనుషులే ఎక్కువ కాబట్టి కాదనే అనిపిస్తుంది. అందువల్ల కుక్కలు మనుషుల్ని కరవడంలో విచిత్రమేమీ లేదు. కరవడం వాటి జన్మహక్కు. (ఔ అనండి, వెనక మేనగాగాంధీ కర్రట్టుకు నుంచుంది). 'ఆగండాగండి. మనిషి కుక్కల్ని కరవడమేమిటండీ' అంటారా. మరి కుక్కలు మనుషుల్ని కరుస్తున్నాయిగా అందుకన్నమాట. ఓకే!

...మ్‌మ్. ఇంకా ఏదో లోపం కనిపిస్తోందా నా తర్కంలో. ఒక్కక్షణం.
వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముల్లుని ముల్లుతోనే తియ్యాలి అంటారు పెద్దలు అవునా.
కుక్క జంతువు, నాలుగు కాళ్ళుంటాయి - మనిషినీ నాలుక్కాళ్ళ జంతువంటారు. సారూప్యత సరిపోయింది.
'మరి మనిషి కుక్కని కొడతాడు కదా' అనొచ్చు. వాడెవడో తిట్టాడు, నువ్వూ తిట్టు - సరికి సరి. కానీ నువ్వెళ్ళి కొట్టావనుకో, పోలీసోడు నీ తాట తీస్తాడు. అలాగే కావాలంటే కుక్కని కూడా కొట్టమనండి. (వితండవాదమా ... మజాకానా)

తర్కం చెప్పేదేంటంటే...
మనిషి కుక్కల్ని నమ్ముతాడు [1]
కానీ కుక్కలు మనుషుల్ని నమ్మవు [2]
అందువలన మనుషులు కుక్కల్ని నమ్మకూడదు [3]
కాబట్టి ఫైనల్‌గా మన జాగ్రతలో మనం వుండటం మంచిది.

ఈ సందర్భంగా నిజంగా జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తోంది. మా అన్నయ్యకో కుక్క వుంది - పేరు మార్కీ. ఓ సారి బయటనుంచి తిరిగీ తిరిగీ వచ్చి 'నొప్పిగా వున్నాయి కాళ్ళు తొక్కు' అన్నాడు. 'నేను తొక్కను' అన్నా. (నాకెందుకో చిన్నప్పటినుండీ ఇంకొకళ్ళకి కాళ్ళు తొక్కడం, తల పట్టడం,పీక నొక్కడం లాంటి పనులెందుకో ఇష్టం వుండవు - అలాగే నేనూ ఎవరినీ అడగను కూడా). ప్రక్కనే వున్న మా పిన్నిగారబ్బాయి నడిగాడు. 'సరే'నని లేచి తొక్కటానికి కాలు మీద పెట్టాడో లేదో - 'ఖయ్యి'మనరుస్తూ మీద కొచ్చి కాలు పట్టుకొంది మార్కీ - మా అన్నయ్య మీద కెవరో వచ్చారన్నది దాని కోపానికి కారణం. బిక్కచచ్చిపోయాడు మా తమ్ముడు. ఎక్కడో వేరే గదిలో మంచంకింద బొమిక చీక్కుంటూ హాయిగా కూచుంది అంత సడన్‌గా రావడానికి కారణం - ఇందాక వాళ్ళు చెప్పిన విశ్వాసమేనా?

కానీ ఇప్పుడు బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు చేయించుకునేంత అంత బాధక్కర్లేదు - యాంటీరేబీస్ ఇంజక్షన్లు మూడేసుకుంటే చాలుట (మావాడికీ వేయించాం, కుక్కకి ఆల్రడీ వేక్సీన్ చేయించి వున్నా మావాడికి భయం తగ్గటానికి).

ఆలోచిస్తే శునక ప్రేమికులు చెప్పిన దాంట్లో నిజముంది (కుక్క విశ్వాసానికి మారుపేరు). తన యజమానికి ఏమన్నా హాని జరుగుతుందన్న అనుమానం వస్తేచాలు - తెలుగు సినిమా హీరోలా యాక్షన్లో దూకి కాపాడటానికి రెడీగా వుంటుంది. మనం చేసే పనులు యజమానికి హాని చేయని తెలిస్తే అది ఎవరినీ ఏం చేయదన్నది వీరి వాదం. (హాని కాకపోయినా హానిచేస్తున్నట్లనిపించే పనులు చేసినా వాటికి కోపం వస్తుంది - జాగ్రత)

మరి యజమాని లేని కుక్కల సంగతేంటి? మేనకా గాంధీనో, మునిసిపాలిటీ వాళ్ళనో అడగాల్సిన ప్రశ్నిది.

మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం.

Sunday, August 19, 2007


ఫ్లాష్ బాక్ - ఒకటి (మొదటికి మోసం)


మొదటికి మోసం

అకస్మాత్తుగా పిడుగు (?) లాంటి వార్త హెఢాఫీసు నుండి వచ్చింది. పది రోజుల్లో క్లయింటు ప్లేసు కెళ్ళాల్సుంటుందనీ, పాస్‌పోర్టు పార్క్‌లేన్లో వున్న ట్రావెల్ ఏజెంటు కివ్వమనీ చెప్పారు. టెక్నికల్ కాన్ఫరెన్సుకాల్లో కూచున్నాక తెలిసింది - వెళ్ళాల్సింది నెదర్లాండు, హంగరీ, రొమేనియాల్లో ఒకదానికని. క్లయింట్లు అడిగిన ప్రశ్నల్నిబట్టి అర్థమైందేమిటంటే వాళ్ళేదో PHPలో ప్రాజెక్టు చేస్తున్నారు, దానికి అవసరమైన భారీ మార్పులు చేర్పుల కొఱకు టెక్నికల్ టీమ్ లీడ్, సీనియర్ ప్రోగ్రామరూ కావాలనిన్నూ. అయితే ట్విస్టేటంటే, మా కంపెనీలో పూర్తిస్థాయి పిహెచ్పీ ప్రోగ్రామరెవరూ లేరు.

ఏదారీ లేకపోయినా దారి చేసుకు వెళ్ళేవాడే పైకొస్తాడన్నారు పెద్దలు. మరి దారున్నప్పుడేం ఖర్మ అనుకుని ప్రొసీడైపోయారు మా వాళ్ళు. నిజానికి నాదాకా రాకపోదురు వాళ్లు. మూడు సంవత్సరాల అనుభవం వున్న కొత్తోణ్ణొకడ్ని(కొత్త మా కంపెనీకి) తెస్తే పెదవి విరచారవతలి వాళ్ళు. ఇంకోయిద్దర్ని తెచ్చినా నచ్చక పోయేసరికి వేరేకంపెనీని వెతుక్కోడానికి నిర్ణయించుకున్నారు అవతలివాళ్ళు. ఆ దెబ్బకి హుటాహుటిన టెక్నికల్ కాల్ పెట్టించారు నాకు. నేనేదో పొడుస్తాననికాదు గానీ, పూర్వాశ్రమంలో మల్టీలింగువల్ (బహుభాషా?) ప్రాజెక్టొకటి పీహెచ్పీలో చేసివున్నా - దాంతో చివరి ప్రయత్నంగా నన్ను తోసారు. నా రెజ్యూములో పాత ప్రాజెక్టుని పైకి తెచ్చి వాళ్ళకి కాజా తినిపించారు మావాళ్ళు.

అన్నీ వున్నవాడు డీలాగా వెళితే, ఏమీలేనివాడు కాలరెగరేసుకు మరీ వెళతాట్ట. ఎలాగైతేనేం మొత్తానికి వాళ్ళని బురిడీ కొట్టించి ఒప్పించేశాం. (ఎలా అని అడక్కండి - ట్రేడ్ సీక్రెట్!) రెండ్రోజుల తర్వాత తెలిసింది వెళ్ళాల్సింది హంగరీ లోని బుడాపెస్తు కని. కానీ వీసా వచ్చినప్పుడు కదా ప్రయాణం అని తాపీగా కూర్చన్నా. కానీ మరుసటి రోజే హంగేరియన్ ఎంబసీ నుంచి ఫోను - ఇంటర్వ్యూకు రమ్మని. ఆఫీసులో మా మేనేజరు దగ్గర్నుంచి ట్రావెలేజెంటు వరకూ ఒహటే టెన్షను. టెన్షను లేనిదల్లా నాకొక్కడికే. ఎందుకంటే బయటి దేశాలు మనకి అచ్చిరావు - రెండుసార్ల అనుభవం మరి.

ఢిల్లీలో చాణక్యపురిలో వున్న నీతి మార్గ్‌లో వున్న హంగేరియన్ ఎంబసీలో అనుభవం బహు చిత్రమైనది - ఇంకోసారి డీటెయిల్డుగా బుర్రతింటా!!

వీసా కన్ఫర్మ్ (నిర్ధారణ - బాగున్నట్టు లేదు) అయిన తర్వాత వెంటనే ఆఫీసుకూ, ట్రావెలేజంటుకూ ఫోన్చేసి వాళ్ళ టెన్షన్ తగ్గించా. నేను తిరిగి హైదరాబాదు వచ్చేసరికి సర్‌ప్రైజ్ న్యూసేంటంటే, తర్వాతి రోజు తెల్లవారు ఝామున-మూడు గంటలకే ప్రయాణం అని.

టెక్నికల్ కాన్ఫరెన్సుకాలు (పదిహేను జూలై మధ్యాహ్నం మూడున్నర) జరిగినప్పటినుండీ విమానం ఎక్కేవరకూ (ఇరవైయ్యొకటి జూలై ఉదయం మూడున్నర), ఈ ఐదున్నర రోజుల్లో ఊహిచని వెన్నో జరిగాయి.

అయ్యో, అసలు విషయం చెప్పటం మర్చేపోయా. ప్రస్తుతం డాట్నెట్ ప్రోగ్రామర్ని కదా, బయటకు (దేశం వదిలి) వెళ్తున్నందుకు అందరూ, ముఖ్యంగా జూపోలు (జూనియర్ ప్రోగ్రామర్లు) ఆనందంగానే వున్నా (అంతేకదా, వాళ్ళని పనయ్యిందాని బెత్తం పుచ్చుకునేవాణ్ణి నేనుండనుకదా), సీపోగాడు (సీనియర్ ప్రోగ్రామర్) మాత్రం ఏడుస్తున్నాడు. మా జూపోలకీ వీడికీ అస్సలు పడదు. నేన్లేకపోతే వాడి మాటెవరూ వినరు. నేనుండను కనుక వాడే ప్రస్తుతం రెస్పాన్సిబుల్ - క్లయింటు కూడా సరే అన్నాడు మరి (మా సీపో కోతలు బాగా కోస్తాడు తెండి). వారం క్రితం ఫోను చేస్తే సీపో ఏడుస్తున్నాడు - ఎవడూ పనిచెయ్యటంలేదని. పని కాకపోతే మేనేజ్‌మెంటు వాడి పెర్ఫామెన్స్ అలవెన్సు కోస్తుంది. ఏడవకేం చేస్తాడు మరి. అంతేకాక, ఆల్రెడీ క్లయింటోసారి వీడి మీద అరిచాడట - క్లయింటు ప్రాజెక్టు కాన్సిల్ అన్నాడంటే వీడికి తిరునామాలే. ఏ మవుతుందో వేచి చూడాల్సిందే.

Saturday, August 11, 2007


స్తబ్ధత


{స్వగతం}
ఇన్ని రోజులు స్తబ్ధుగా వుండటానికి కారణాలు చాలా వున్నాయి - కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్లుగా.

ఊరు మారటం - బెంగళూరు నుండి హైదరాబాదుకు [1]
నా మొదటి వుద్యోగం బెంగుళూరు లోనే. తర్వాత హైదరాబాదు షిఫ్టయ్యా. కొత్త వుద్యోగం బెంగళూరులో రావటంతో మళ్ళీ బెంగళూరు, ఆపై కొత్త బ్రాంచీ కోసం తిరిగి హైదరాబాదు. ఏక్‌నిరంజన్ గాళ్ళయితే ప్రాబ్లెం లేదుకానీ, పెళ్ళాం పిల్లలతో ఊరు మారడం అంత సులభమేం కాదు సుమీ!

కొత్త ఆఫీసు, కొత్త ప్లేసు, కొత్త జనం [2]
కొంత సమయం పడుతుంది అడ్జస్టయ్యేందుకు - మిగిలిన వాళ్ళని అడ్జస్ట్ చేసేందుకు. కొత్త ఆఫీసవడం వల్ల ఏ పని కావాలన్నా ఒకటికి నాల్గింతలు టైం తీసుకుంటోంది. దానికి తోడు కొత్త జనం - పనికి కొత్త, ఇక చెప్పేదేముంది!

కొత్త ప్రాజెక్టు - వర్కు లోడు పెరగటం [3]
పాతాఫీసునుండి మోసుకొచ్చిన పాత ప్రాజెక్టుతో పాటు, కొత్తాఫీసుకు రాగానే కొత్త ప్రాజెక్టూ వచ్చి పడింది. కొత్తగా చేరినవారికింకా పని అలవాటు కాకపోవడం - నా నెత్తి పెద్ద బండయ్యింది.

ఇంట్లో బాదర బందీలు [4]
గ్యాస్ కనెక్షనూ, చుట్టుపక్కల కూరగాయలూ-సూపర్‌మార్కెట్టులూ (ఇంటావిడకి నచ్చేట్టుగా) వెతకడం, బట్టలారేసుకోవడానికి దండెం కట్టడం, గోడకు మేకులు కొట్టడం, మొదలైనవి.

పాత పరిచయాలు - చుట్టరికాలూ [5]
హైదరాబాదుకు పాతకాపునే కనుక పాత పరిచయాల్ని తిరగేయటం, చుట్టుపక్కాల్ని పలకరిచడం - సాయంకాలమైతే ఇదే పని.

ఆరోగ్య సమస్యలు [6]
నాకు ఫుడ్ పాయిజనింగ్, నాన్నకు లో-షుగరూ, మేనమామ భార్యకు కేన్సరూ, ఇంకో మేనమామ వియ్యంకురాలికి మైల్డు స్ట్రోకూ, ఏంచెప్పమంటారు లెండి.

ఇల్లు - నో ఇంటర్నెట్టూ [7]
కొత్తగా రావటం వల్ల ఇంట్లో ఇంకా ఇంటర్నెట్టు లేదు. అందులోను కొత్త అపార్టుమెంటవ్వడంతో పక్క ఫ్లాట్ల వాళ్ళెవరికి కూడా ఇంటర్నెట్టు లేదు. బియస్సెన్నెల్ కు ఫోను కోసం అప్లై చెయ్యాలి :-(
...
...
...
...
...
...

కానీ చివరిగా ... బద్దకమెక్కువైంది. హహ్హహ్హ!!!

Thursday, August 09, 2007


అనుభవం


ఆర్నెల్ల క్రితమే కొన్న ఓ భారీ షిప్పొకటి ఒక్క ట్రిప్పుకే మూల పడేసరికి సొంతదారులకి బండ పడినట్లయింది. షిప్పు తయారీదారులకి కబురు పెడితే వాళ్లు షిప్పును తమ దగ్గరికి తీసుకు వస్తేకానీ రిపేరు చేయలేమన్నారు. ఆగిన షిప్పును వాళ్ల దగ్గరికి చేర్చడానికయ్యే ఖర్చు ఎంతవుతుందాని లెక్కేసేసరికి కళ్ళు బైర్లుకమ్మి లోకల్ మెకానిక్కుల కోసం వెతికారు. ఓ పేరు మోసిన కంపెనీ నుండి ట్రక్కులో బోల్డన్ని టూల్స్ తీసుకుని నలుగురు ఎక్స్‌పర్ట్స్ వచ్చారు. నాల్రోజులపాటూ పరీక్షించీ పరీక్షించీ చివరికి ప్రాబ్లెమేంటో అర్థం కాలేదు కాబట్టి రిపేరు చార్జీలు లేకుండా ఒట్టి సర్వీసు చార్జీలు మాత్రం కట్టండి అని పాతిక వేలకు బిల్లిచ్చారు.

పని కాకపోయినా చేతి చమురొదిలేసరికి బేజారైపోయి, పనైతేనే డబ్బులంటూ వేరే మెకానిక్కులకు కబురు పెట్టారు. మినిమం సర్వీసు చార్జీల్లేందే ఎవ్వరూ రామన్నారు. ఇక తప్పక ఒప్పుకున్నారు. వారాలు గడుస్తున్నాయి, పెద్ద చిన్నా కంపెనీల మెకానిక్కులొస్తున్నారు - చూస్తున్నారు - పోతున్నారు. డబ్బులయితే ఖర్చవుతున్నాయి గానీ, ఇంజను మాత్రం మాట్లాడటంలేదు. రెండునెలలనుంచీ ఈ తతంగం అంతా చూస్తున్న ఓ కళాసీ (ఓడలో పని చేసే కూలీ), యజమాని దగ్గరికి అతనికి తెలిసిన పాత ముసలి మెకానిక్కు తీసుకొచ్చాడు. ఇంతమంది పెద్ద పెద్ద కంపెనీ మెకానిక్కులకే పనిచేయనిది ఆఫ్ట్రాల్ ఈ ముసలోడి కేమవుతుంది అని కొట్టిపారేశారు. కానీ షిప్పింజనీరు ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని - పనైతేనే డబ్బులని చెప్పి ముసలి మెకానిక్కుని రమ్మన్నాడు.

మరుసటి రోజు పొద్దున్నే ఓ మూట భుజానేసుకొచ్చాడు. మూటను పక్కన పెట్టి,ఒక్కడే ఇంజనును పరీక్షచేయసాగాడు. మధ్యాహ్నం గడచిపోయింది. అందరూ భోజనాలు కానిచ్చేశారు, కానీ ముసలి మెకానిక్కు మాత్రం భోజనం సంగతే ఆలోచించకుండా చెమటలు కారుతున్నా అలాగే పరీక్షిస్తూ వున్నాడు. సుమారు నాలుగవుతూండగా బయటకొచ్చి మూటవిప్పి పాత గుడ్డతో చెమట తుడుచుకొని, పాత పనిముట్లన్నింటిలోంచీ ఓ చిన్న సుత్తి బయటకు తీసాడు. ఇంజను దగ్గరకువెళ్ళి చేత్తో సవరదీస్తూ సున్నితంగా సుత్తితో నాల్గు దెబ్బలేసాడు. అంతే ఇంజను పని చేయడం మొదలు పెట్టింది. ఓడ యజమానుల ఆనందానికి లెక్కేలేదు. ముసలోడిని బిల్లిమ్మన్నారు - బిల్లిచ్చాడు.

బిల్లుచూసి ఆశ్చర్యపోయి వాళ్ళు డీటెయిల్డు బిల్లు కావాలన్నారు. ముసలాడిచ్చిన డీటెయిల్డు బిల్లు చూసిన తర్వాత మారుమాట్లాడకుండా అడిగినంతా యిచ్చి, అతన్నే షిప్పు మెకానిక్కుగా ఖాయం చేసుకున్నారు.

అతనిచ్చిన బిల్లు ..


1) సుత్తితో కొట్టినందుకు ............... రూ. 10.00
2) సుత్తితో ఎక్కడ కొట్టాలో కనుక్కున్నందుకు ... రూ. 9,990.00
-----------------
వెరసి మొత్తం .................. రూ.10,000.00
-----------------

Thursday, April 05, 2007


శోధన: మూడు వందల వీరులు


శోధన: మూడు వందల వీరులు

సుమారు రెండు వారాల క్రితం చూశానీ సినిమాని. చెక్కిన శిల్పాల్లాంటి 300 మంది స్పార్టన్ వీరులు లక్షలాది పర్షియన్ సైనికులతో చేసే యుద్ధం. గ్లాడియేటర్ తో పోల్చను గానీ, మందితో హడావుడి లేకుండా, గ్రాపిక్స్ అతిగా కనపడకుండా, మనం ప్రక్కనే వుండి చూస్తున్నాం అన్నట్లుగా తీశారు.

నిజమే, మన భారతంలోనూ ఇంతకంటే పస కలిగిన కథావస్తువు లెన్నో!

Friday, March 23, 2007


పాపం సుబ్బారావ్!


ఇంటి దగ్గర పెళ్ళాంతో దెబ్బలాడి విసుగ్గా రోడ్డు మీదకొచ్చాడు సుబ్బారావు. సాయంకా కావస్తోంది. నడుస్తోంది రోడ్డుకు ఎడమ వైపే అయినా బుర్ర నిండా అలోచనలతో రోడ్డుమీద ధ్యాసైతే లేదు పాపం సుబ్బారావుకి. ఐదు నిముషాలు అలా నడిచాడో లేదో సడన్ గా పాత టీవీయస్సొకటి గుద్దటంతో క్రిందపడ్డాడు సుబ్బారావుని. అసలే పెళ్ళాం మీది కాకతో వున్నాడేమో కోపంగా చూశాడు గుద్దిన వ్యక్తి వంక. గుద్దిందెవరో కాదు, పదో తరగతి చదువుతున్న ప్రక్కవీథి పుల్లారావు కొడుకు. తన వంక చూసుకున్నాడు. పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు. మోచేయి కొద్దిగా గీచుకు పోయింది, కానీ బట్టలు మాత్రం ఖరాబయ్యాయి. పుల్లారావు టీవియస్ కు మాత్రం బాగనే డామేజయ్యింది. హెడ్ లైటు అద్దం పగిలింది, ముందు మడ్ గార్డ్ సొట్ట పోయింది, రియర్వ్యూ మిర్రర్ పగిలింది, హేండిల్ బెండొచ్చినట్లుంది. కానీ పిల్లాడికేమీ అవలేదు.

లైసెన్సు లేకుండా, రోడ్డుమీద రాంగ్ రూట్లో రావడమే కాకుండా యాక్సిడెంట్ చెయ్యడంతో ఉన్న కోపం ఇంకొంచెం పెరిగింది. పిల్లోడు బిత్తర చూపులతో చూస్తుండడంతో, ఆ కోపం రెస్పాన్సిబిలిటీ లేకుండా పిల్లోడికి బండి నిచ్చిన పుల్లారావు మీదకి తిరిగింది. ఏం తిట్టకుండా బండి లాక్కుని, మీ నాన్నను తీసుకుని ఇంటికి వస్తే ఇస్తానని చెప్పి బండితో సహా ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళగానే పెళ్ళాం నవ్వు మొహం చూడగానే అప్పటివరకూ వున్న చిరాకు, కోపంతో పాటు బండి సంగతి కూడా మర్చిపోయాడు. రెండో రోజు కానిస్టేబులొచ్చి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళి పుల్లారావు తన మీద కిడ్నాప్ కేసు పెట్టాడని చెప్పేసరికి మతి పోయింది.

అసలు సంగతేంతంటే, రాత్రంతా కొడుకు ఇంటికి రాకపోయే సరికి పొద్దున్న వీధిలో విచారించిన పుల్లారావుకి, ముందురోజు సాయంత్రం తనకొడుకుతో సుబ్బారావు మాట్లాడాడన్న విషయం తెలిసింది. అంతే ముందూ వెనుకా అలోచించకుండా సుబ్బారావు తన కొడుకుని కిడ్నాప్ చేశాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు.

అందరూ అనుకోవడం పుల్లారావు కొడుకు టెన్త్ పరీక్షలకు సరిగ్గా చదవక పోవడం, దానికి తోడు తండ్రికి చెప్పకుండా బండిని తీసుకు రావడమే కాకుండా యాక్సిడెంట్ చేయడంతో భయపడి పారిపోయింటాడు. అదంతా అటూ ఇటూ తిరిగి, సుబ్బారావు మీదకొచ్చింది. పాపం సుబ్బారావు ... ఢెబ్బై వేలు కట్టి జామీను మీద బయటకొచ్చినా, ఇప్పుడు ప్రతి రోజూ పోలీసు స్టేషన్ లో హాజరేసుకుంటున్నాడు. పారిపోయిన పుల్లారావు కొడుకు కడుపు కాలి ఇంటికి తిరిగొచ్చేదాకా సుబ్బారావుకీ అవస్థ తప్పదేమో!

(సుబ్బారావేమీ పుల్లారావుకు జరిగింది చెప్పి కేసును విత్ డ్రా చేయించుకోవచ్చుగా అనుకుంటారేమో. ఆ పనీ అయ్యింది. తానేమీ అనలేదనీ, తండ్రిని పిలిచి చెబితే పిల్లాడికి బుద్ధి చెపుతాడని మాత్రమే బండి తీసుకెళ్ళానని వివరించినా వినలేదు పుల్లారావు. పుల్లారావు వాదన ప్రకారం తాను ఇల్లు (లంచం సొమ్ముతో) కట్టుకున్నానన్న దుగ్దతో సుబ్బారావే ఈ పని చేసుంటాడు ... లేదా తన కొడుకుని బాగా తిట్టి కొట్టడంతో నయినా పారిపోయిండాలి. ఏదేమైనా తన కొడుకు పారిపోవడానికి కారణం సుబ్బారావే కనుకు, తన కొడుకు క్షేమంగా తిరిగొస్తే కాని కేసు వాపస్ తీసుకోనంటాడు పుల్లారావు.)

Monday, March 19, 2007


శాలివాహన శకం... ఉగాది ఆవిర్భావం


బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజును గుర్తుచేసుకుంటూ జరుపుకొనే పండుగ ఉగాది పండుగ. యుగాదిని నిరంతరం గుర్తుంచుకోవాలన్న విషయం దీని వెనుక ఉంది. ఈ విషయాన్ని బ్రహ్మాండ పురాణం లాంటి పురాణాలు చెబుతున్నాయి. సృష్టిని ప్రారంభించిన తరువాత దాన్ని పరిపాలించమని బ్రహ్మదేవుడు కొంతమంది దేవతలకు బాధ్యతలను అప్పగించాడు. వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలను పాలించడానికి ముందుకు వచ్చిన శుభసందర్భాన్ని పండుగగా జరుపుకోవడం ఆ దేవతల మీద భక్తిని ప్రకటించడం అవుతుంది. అలాగే జ్యోతిషశాస్త్ర సంబంధంగా కూడా ప్రజా పరిపాలనకు సంబంధించిన విషయం ఒకటి పంచాంగంలో ప్రకటితమవుతుంది. ఉగాది నాటి పర్వదిన విధివిధానాలలో పంచాంగ శ్రవణం ఒకటి. పంచాంగాన్ని వినేటప్పుడు శాస్త్రజ్ఞుడు నవనాయకులను గురించి ప్రస్తావిస్తాడు. వారిలో రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి (వాణిజ్య పంటలకు అధిపతి), ధాన్యాధిపతి (వరి ధాన్యంలాంటి ధాన్యపంటలకు అధిపతి), అర్ఘాధిపతి (మెట్టపంటలకు అధిపతి), మేఘాధిపతి (వర్షాలు, నీటిపారుదలకు అధిపతి), రసాధిపతి (నూనెలు, చమురు ధాన్యాల అధిపతి), నీరసాధిపతి (లోహాలు, గనుల అధిపతి) అనే తొమ్మిది మంది అధిపతుల విషయం ప్రస్తావితమవుతుంది. ఈ తొమ్మిదింటికీ మనకున్న నవగ్రహాలలో ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. గ్రహాలన్నీ దైవ సంబంధాలే. కనుక ఆ దైవాలంతా తమ బాధ్యతలను ఉగాది నాడే స్వీకరిస్తారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పండుగ జరుపుకోవడం కూడా ఉగాది వెనుక ఉన్న ఓ పరమార్ధంగా పెద్దలు చెబుతారు.

చైత్ర శుక్ల పాడ్యమి ఇలా సంవత్సరాదిగా (ఉగాదిగా) తరతరాలుగా జరుపుకుంటున్నారు. ఈ ఉగాదికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. ఇది విక్రమార్క, శాలివాహనుల పరిపాలనకు సంబంధించినదిగా ప్రచారంలో ఉంది. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్నది శాలివాహన శకమని, ఉత్తరాన ఉన్నది విక్రమార్క శకమని ప్రచారంలోకి రావడానికి ఉన్న కారణాన్ని ఈ కథ వివరిస్తుంది.

పూర్వం పురంధరపురంలో ఓ వర్తకుడు ఉండేవాడు. గొప్ప ధనవంతుడైన ఆ వర్తకుడికి నలుగురు కుమారులు కలిగారు. కాలక్రమంలో వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైంది. అయినా ఆ వర్తకుడు తన నలుగురు కుమారులకు సంపదలను పంచి ఇవ్వలేదు. కానీ మరణించే ముందు తన నలుగురు కుమారులను పిలిచి మూతలు బిగించి ఉన్న నాలుగు పాత్రలను ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరిచి చూడమని, వాటిలో ఎవరు ఏ పని చేయాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు. అతడి కుమారులు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరిచి చూశారు. మొదటి పాత్రలో మట్టి, రెండో దానిలో బొగ్గులు, మూడో దానిలో ఎముకలు, నాలుగో దానిలో తవుడు మాత్రమే కనిపించాయి. దాని అర్ధం వారికి తెలియక నాటి రాజైన విక్రమార్కుడి దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పారు. విక్రమార్కుడికి కూడా ఆ ప్రాతల విషయం బోధపడలేదు. ఆ నలుగురు కుమారులు ఎలాగా అని ఆలోచించి ప్రతిష్ఠానపురం వెళ్ళి అక్కడున్న వారిని కూడా అడిగారు. కానీ ఎవరూ చెప్పలేకపోయారు. అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు.

ఆ బాలుడు ఓ వితంతువు కుమారుడు. అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చిందంటారు. ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయం ఇచ్చాడు. కుమ్మరి ఆశ్రయంలో ఉన్నప్పుడే ఆమె బాలుడిని ప్రసవించింది. పుట్టిన బిడ్డకు శాలివాహనుడు అని పేరుపెట్టింది. శాలివాహనుడు నాలుగు పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు. వర్తకుడి కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను, ఎముకలతో నిండిన పాత్ర వచ్చినవాడు పశుసంపదను, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన వాడు ధాన్యాన్ని పంచుకోవాలని, అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహనుడు తేల్చిచెప్పాడు. శాలివాహనుడి మాటలు నలుగురికీ నచ్చి అలాగే పంచుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి విక్రమార్కుడి దాకా చేరింది. విక్రమారుడు శాలివాహనుడిని చూడాలని కుతూహలపడి కబురు చేశాడు. కానీ శాలివాహనుడు తాను రానని ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని అన్నాడు. దాంతో విక్రమార్కుడికి కోపం వచ్చి శాలివాహనుడిని సంహరించడానికి చతురంగ బల సమేతుడై వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు చేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీదకు పంపాడు. ఇద్దరి మధ్య భీకరంగా పోరు సాగింది. చివరకు శాలివాహనుడు సమ్మోహన శస్త్రాన్ని ప్రయోగించి విక్రముడి సేన అంతా నిద్రపోయేలా చేశాడు. విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజును ప్రార్ధించి తన సేనలకు మెలుకువ వచ్చేలా చేశాడు. ఆ తరువాత ఇద్దరికీ రాజీకుదిరింది.

ఈ కథకే మరి కొంత మార్పుతో మరి కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి. దాని ప్రకారం శాలివాహన, విక్రమార్కుల యుద్ధ సమయంలో ఎవరి విజయమూ తేలనప్పుడు ఆకాశవాణి వినిపించిందట. నర్మదా నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు, దక్షణ దిక్కున ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుడు పాలించమని ఆకాశవాణి చెప్పిన తరువాత ఆ ఇద్దరూ యుద్ధాన్ని మానివేశారట. అలా శాలివాహనుడు ఒక శకానికి స్థాపకుడయ్యాడు. ఆ శక స్థాపన జరిగింది చైత్ర శుక్ల పాఢ్యమినాడనీ, ఆ అపూర్వ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతరకాలంలో ఉగాది ఆవిర్భవించిందని ప్రజల్లో ప్రచారంలో ఉంది.

డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు -
(ఈనాడు)

Friday, February 16, 2007


ఆ ఏడూ...


జీవితంలో ప్రతి ఒక్కరూ (మరొక్కసారి ప్రతి ఒక్కరూ) కనీసం ఒక్కసారైనా... నేనిలా అవుదామనుకున్నాను ... నేనిలా చేస్తే బాగుండేది... ఇది కాకపోతే అది అయ్యుండేదిఅని అనుకుంటూ భవిష్య ప్రణాళికలేస్తూ వుంటారు.

స్కూల్లో పక్కనున్న వాణ్ణి ఫస్ట్ వచ్చినందుకు పంతులు మెచ్చుకుంటూంటే, అందరూ ఆరాధనగా అతన్ని చూస్తూంటే, ఈ సారి నేనూ ఫస్ట్ వచ్చి అందర్లో హీరో అవ్వాలని అనుకోనివాడెవ్వడు?

కాలేజీలో ఝామ్మంటూ లేటెస్ట్ ఫ్యాషన్ లతో కొత్త బైకు మీద జల్సా చేస్తూ తిరిగే కుర్రాడి వెనుక్ తిరిగే అమ్మాయిల్ని చూస్తూ తనూ అలా గోపికల మధ్య కృష్ణుడిలా వుండాలని అనుకోనివాడెవ్వడు?

కష్టపడకుండా బోల్డంత డబ్బొచ్చే వుద్యోగం కావాలనీ, అందమైన అణకువైన అమ్మాయి భార్య కావాలనీ, పేలెస్ లాంటి ఇంట్లో రాజభోగాలనుభవించాలని, ఇంకా ఎన్నో ఎన్నెన్నో కలలు కంటూంటాం. కదూ!

కానీ ప్రతి ఒక్కరూ అన్నీ కాకపోయినా కొన్నైనా తమ కలల్ని నిజం చేసుకునుంటారు. ఒక్కసారి ఆలోచించండి. కొన్నింటిని నిజం చేసుకోగలిగిన మనం మరికొన్నింటిని (గొంతెమ్మ కోర్కెల్ని వదిలెయ్యండి) ఎందుకు సాకారం చేసుకోలేక పోతున్నాం? వేరొకడు చెయ్యగలిగిన దాన్ని మనమెందుకు చెయ్యలేక పోతున్నాం?

వాడికుంది మనకు లేదు అని చప్పరించకండి. వాడికున్నది మనకెందుకు లేదని ఆలోచించండి. లేనిదాన్నెలా సంపాదించాలని శోధించండి.

ఈ ప్రపంచంలో కొన్ని సూత్రాలకు / పరిమితులకు లోబడి ప్రతిదీ సుసాధ్యమే!

ఏడు ప్రపంచ వింతల గురించి అందరికీ తెలుసుకదా! అలాగే జీవితంలో మనం అనుకున్నది సాదించడానికీ ఓ ఏడున్నాయి.

ప్రస్తుతం నేనెవరిని? [1]

నేనెలా కావాలని కోరుకుంటున్నాను? [2]

ఎవరు / ఏ మార్గం నేనెలా కావాలని కోరుకున్నానో అలా చెయ్యగలదు? [3]

నేనెలా కావాలనుకున్నానో అలా అయ్యేందుకు నేనేవిధమైన మార్పు చెందాలి? [4]

ఈ మార్పు చెందేందుకు నేనేమి చెయ్యాలి? [5]

ఈ విధంగానే / విధాలుగానే నేనెందుకు మారాలి? [6]

ఎప్పటికీ మార్పు (నేనెలా కావాలనుకున్నానో) పూర్తికావాలి? [7]

ప్రతిరోజూ ఈ ఏడూ మననం చేసుకుంటూంటే, మనకు తెలీకుండానే మనలో ఒక బలీయమైన సంకల్పం కలుగుతుంది. అది చాలు మొదటి అడుగు వెయ్యడానికి. పేరున్న ప్రతివాణ్ణీ పరిశీలించండి. మంచైనా చెడైనా. ఎలా సంపాదించాడు వాడు దాన్ని? ఆలోచించండి. ప్రతి ప్రశ్నకూ సమాధానం వుంది. వుండితీరుతుంది. సమాదానం లేని ప్రశ్నే వుండదు.

మీరేదవ్వాలనుకున్నా మీకుండాల్సిన ముఖ్య లక్షణం / అర్హత ఒక్కటే ... మీ మీద మీకు నమ్మకం. అదిలేకపోతే అన్నీ వున్నా మీరేమీ కాలేరు. మీకు మీరే మార్గదర్శకులు!!!