మొదటికి మోసం
అకస్మాత్తుగా పిడుగు (?) లాంటి వార్త హెఢాఫీసు నుండి వచ్చింది. పది రోజుల్లో క్లయింటు ప్లేసు కెళ్ళాల్సుంటుందనీ, పాస్‌పోర్టు పార్క్‌లేన్లో వున్న ట్రావెల్ ఏజెంటు కివ్వమనీ చెప్పారు. టెక్నికల్ కాన్ఫరెన్సుకాల్లో కూచున్నాక తెలిసింది - వెళ్ళాల్సింది నెదర్లాండు, హంగరీ, రొమేనియాల్లో ఒకదానికని. క్లయింట్లు అడిగిన ప్రశ్నల్నిబట్టి అర్థమైందేమిటంటే వాళ్ళేదో PHPలో ప్రాజెక్టు చేస్తున్నారు, దానికి అవసరమైన భారీ మార్పులు చేర్పుల కొఱకు టెక్నికల్ టీమ్ లీడ్, సీనియర్ ప్రోగ్రామరూ కావాలనిన్నూ. అయితే ట్విస్టేటంటే, మా కంపెనీలో పూర్తిస్థాయి పిహెచ్పీ ప్రోగ్రామరెవరూ లేరు.
ఏదారీ లేకపోయినా దారి చేసుకు వెళ్ళేవాడే పైకొస్తాడన్నారు పెద్దలు. మరి దారున్నప్పుడేం ఖర్మ అనుకుని ప్రొసీడైపోయారు మా వాళ్ళు. నిజానికి నాదాకా రాకపోదురు వాళ్లు. మూడు సంవత్సరాల అనుభవం వున్న కొత్తోణ్ణొకడ్ని(కొత్త మా కంపెనీకి) తెస్తే పెదవి విరచారవతలి వాళ్ళు. ఇంకోయిద్దర్ని తెచ్చినా నచ్చక పోయేసరికి వేరేకంపెనీని వెతుక్కోడానికి నిర్ణయించుకున్నారు అవతలివాళ్ళు. ఆ దెబ్బకి హుటాహుటిన టెక్నికల్ కాల్ పెట్టించారు నాకు. నేనేదో పొడుస్తాననికాదు గానీ, పూర్వాశ్రమంలో మల్టీలింగువల్ (బహుభాషా?) ప్రాజెక్టొకటి పీహెచ్పీలో చేసివున్నా - దాంతో చివరి ప్రయత్నంగా నన్ను తోసారు. నా రెజ్యూములో పాత ప్రాజెక్టుని పైకి తెచ్చి వాళ్ళకి కాజా తినిపించారు మావాళ్ళు.
అన్నీ వున్నవాడు డీలాగా వెళితే, ఏమీలేనివాడు కాలరెగరేసుకు మరీ వెళతాట్ట. ఎలాగైతేనేం మొత్తానికి వాళ్ళని బురిడీ కొట్టించి ఒప్పించేశాం. (ఎలా అని అడక్కండి - ట్రేడ్ సీక్రెట్!) రెండ్రోజుల తర్వాత తెలిసింది వెళ్ళాల్సింది హంగరీ లోని బుడాపెస్తు కని. కానీ వీసా వచ్చినప్పుడు కదా ప్రయాణం అని తాపీగా కూర్చన్నా. కానీ మరుసటి రోజే హంగేరియన్ ఎంబసీ నుంచి ఫోను - ఇంటర్వ్యూకు రమ్మని. ఆఫీసులో మా మేనేజరు దగ్గర్నుంచి ట్రావెలేజెంటు వరకూ ఒహటే టెన్షను. టెన్షను లేనిదల్లా నాకొక్కడికే. ఎందుకంటే బయటి దేశాలు మనకి అచ్చిరావు - రెండుసార్ల అనుభవం మరి.
ఢిల్లీలో చాణక్యపురిలో వున్న నీతి మార్గ్‌లో వున్న హంగేరియన్ ఎంబసీలో అనుభవం బహు చిత్రమైనది - ఇంకోసారి డీటెయిల్డుగా బుర్రతింటా!!
వీసా కన్ఫర్మ్ (నిర్ధారణ - బాగున్నట్టు లేదు) అయిన తర్వాత వెంటనే ఆఫీసుకూ, ట్రావెలేజంటుకూ ఫోన్చేసి వాళ్ళ టెన్షన్ తగ్గించా. నేను తిరిగి హైదరాబాదు వచ్చేసరికి సర్‌ప్రైజ్ న్యూసేంటంటే, తర్వాతి రోజు తెల్లవారు ఝామున-మూడు గంటలకే ప్రయాణం అని.
టెక్నికల్ కాన్ఫరెన్సుకాలు (పదిహేను జూలై మధ్యాహ్నం మూడున్నర) జరిగినప్పటినుండీ విమానం ఎక్కేవరకూ (ఇరవైయ్యొకటి జూలై ఉదయం మూడున్నర), ఈ ఐదున్నర రోజుల్లో ఊహిచని వెన్నో జరిగాయి.
అయ్యో, అసలు విషయం చెప్పటం మర్చేపోయా. ప్రస్తుతం డాట్నెట్ ప్రోగ్రామర్ని కదా, బయటకు (దేశం వదిలి) వెళ్తున్నందుకు అందరూ, ముఖ్యంగా జూపోలు (జూనియర్ ప్రోగ్రామర్లు) ఆనందంగానే వున్నా (అంతేకదా, వాళ్ళని పనయ్యిందాని బెత్తం పుచ్చుకునేవాణ్ణి నేనుండనుకదా), సీపోగాడు (సీనియర్ ప్రోగ్రామర్) మాత్రం ఏడుస్తున్నాడు. మా జూపోలకీ వీడికీ అస్సలు పడదు. నేన్లేకపోతే వాడి మాటెవరూ వినరు. నేనుండను కనుక వాడే ప్రస్తుతం రెస్పాన్సిబుల్ - క్లయింటు కూడా సరే అన్నాడు మరి (మా సీపో కోతలు బాగా కోస్తాడు తెండి). వారం క్రితం ఫోను చేస్తే సీపో ఏడుస్తున్నాడు - ఎవడూ పనిచెయ్యటంలేదని. పని కాకపోతే మేనేజ్‌మెంటు వాడి పెర్ఫామెన్స్ అలవెన్సు కోస్తుంది. ఏడవకేం చేస్తాడు మరి. అంతేకాక, ఆల్రెడీ క్లయింటోసారి వీడి మీద అరిచాడట - క్లయింటు ప్రాజెక్టు కాన్సిల్ అన్నాడంటే వీడికి తిరునామాలే. ఏ మవుతుందో వేచి చూడాల్సిందే.
Sunday, August 19, 2007
ఫ్లాష్ బాక్ - ఒకటి (మొదటికి మోసం)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment