Thursday, August 09, 2007


అనుభవం


ఆర్నెల్ల క్రితమే కొన్న ఓ భారీ షిప్పొకటి ఒక్క ట్రిప్పుకే మూల పడేసరికి సొంతదారులకి బండ పడినట్లయింది. షిప్పు తయారీదారులకి కబురు పెడితే వాళ్లు షిప్పును తమ దగ్గరికి తీసుకు వస్తేకానీ రిపేరు చేయలేమన్నారు. ఆగిన షిప్పును వాళ్ల దగ్గరికి చేర్చడానికయ్యే ఖర్చు ఎంతవుతుందాని లెక్కేసేసరికి కళ్ళు బైర్లుకమ్మి లోకల్ మెకానిక్కుల కోసం వెతికారు. ఓ పేరు మోసిన కంపెనీ నుండి ట్రక్కులో బోల్డన్ని టూల్స్ తీసుకుని నలుగురు ఎక్స్‌పర్ట్స్ వచ్చారు. నాల్రోజులపాటూ పరీక్షించీ పరీక్షించీ చివరికి ప్రాబ్లెమేంటో అర్థం కాలేదు కాబట్టి రిపేరు చార్జీలు లేకుండా ఒట్టి సర్వీసు చార్జీలు మాత్రం కట్టండి అని పాతిక వేలకు బిల్లిచ్చారు.

పని కాకపోయినా చేతి చమురొదిలేసరికి బేజారైపోయి, పనైతేనే డబ్బులంటూ వేరే మెకానిక్కులకు కబురు పెట్టారు. మినిమం సర్వీసు చార్జీల్లేందే ఎవ్వరూ రామన్నారు. ఇక తప్పక ఒప్పుకున్నారు. వారాలు గడుస్తున్నాయి, పెద్ద చిన్నా కంపెనీల మెకానిక్కులొస్తున్నారు - చూస్తున్నారు - పోతున్నారు. డబ్బులయితే ఖర్చవుతున్నాయి గానీ, ఇంజను మాత్రం మాట్లాడటంలేదు. రెండునెలలనుంచీ ఈ తతంగం అంతా చూస్తున్న ఓ కళాసీ (ఓడలో పని చేసే కూలీ), యజమాని దగ్గరికి అతనికి తెలిసిన పాత ముసలి మెకానిక్కు తీసుకొచ్చాడు. ఇంతమంది పెద్ద పెద్ద కంపెనీ మెకానిక్కులకే పనిచేయనిది ఆఫ్ట్రాల్ ఈ ముసలోడి కేమవుతుంది అని కొట్టిపారేశారు. కానీ షిప్పింజనీరు ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని - పనైతేనే డబ్బులని చెప్పి ముసలి మెకానిక్కుని రమ్మన్నాడు.

మరుసటి రోజు పొద్దున్నే ఓ మూట భుజానేసుకొచ్చాడు. మూటను పక్కన పెట్టి,ఒక్కడే ఇంజనును పరీక్షచేయసాగాడు. మధ్యాహ్నం గడచిపోయింది. అందరూ భోజనాలు కానిచ్చేశారు, కానీ ముసలి మెకానిక్కు మాత్రం భోజనం సంగతే ఆలోచించకుండా చెమటలు కారుతున్నా అలాగే పరీక్షిస్తూ వున్నాడు. సుమారు నాలుగవుతూండగా బయటకొచ్చి మూటవిప్పి పాత గుడ్డతో చెమట తుడుచుకొని, పాత పనిముట్లన్నింటిలోంచీ ఓ చిన్న సుత్తి బయటకు తీసాడు. ఇంజను దగ్గరకువెళ్ళి చేత్తో సవరదీస్తూ సున్నితంగా సుత్తితో నాల్గు దెబ్బలేసాడు. అంతే ఇంజను పని చేయడం మొదలు పెట్టింది. ఓడ యజమానుల ఆనందానికి లెక్కేలేదు. ముసలోడిని బిల్లిమ్మన్నారు - బిల్లిచ్చాడు.

బిల్లుచూసి ఆశ్చర్యపోయి వాళ్ళు డీటెయిల్డు బిల్లు కావాలన్నారు. ముసలాడిచ్చిన డీటెయిల్డు బిల్లు చూసిన తర్వాత మారుమాట్లాడకుండా అడిగినంతా యిచ్చి, అతన్నే షిప్పు మెకానిక్కుగా ఖాయం చేసుకున్నారు.

అతనిచ్చిన బిల్లు ..


1) సుత్తితో కొట్టినందుకు ............... రూ. 10.00
2) సుత్తితో ఎక్కడ కొట్టాలో కనుక్కున్నందుకు ... రూ. 9,990.00
-----------------
వెరసి మొత్తం .................. రూ.10,000.00
-----------------

3 comments:

spandana said...

చాలా బాగుందీ సుత్తి కథ!
అంతేమరి అనుభవం యొక్క విలువ చాలా ఎక్కువే!


--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక said...

ముసలాయన గొప్పగా ఇచ్చాడు బిల్లు.అలా పూర్తి సమాచారం ఇవ్వడం లో కూడా ఆయన అనుభవం సంపాదించినట్టున్నాడు.

Anonymous said...

బాగుంది, అనుభవానికి పెద్దపీట వేసారు. అందుకే కొత్త డాక్టరు కన్న, పాత రోగి మేలన్నారు మన పెద్దలు. ఈ సామెత ను నేటి కాలానికి, మీ కథకి, అన్వయించుకుంటే .. కొత్త స్పెషలిస్ట్ కన్నా, పాత ఫిజిషియన్ బెటరు అని.