Saturday, September 22, 2007


పిల్లలు - పార్టీలు


గురువారం మధ్యాహ్నం హంగేరియన్ సహోద్యోగిని సెలవు తీసుకుంది - కారణం తెలీదు. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో అడిగింది - కంప్యూటర్లో ఫొటోషాప్‌తో ఫొటోలు ట్రిమ్ చేసి బోర్డర్ ఫ్రేమ్ జతచేయటం నేర్పమని. అంతకు ముందొకసారి నేను నా ఫొటోలు మాడిఫై చేస్తుంటే చూసి అడిగింది తనకు కూడా నేర్పమని. అప్పుడు సరేనని చెప్పడంతో ఇప్పుడడిగింది. అప్పుడే పెన్ డ్రైవ్ నుండి కాపీ చేసిన ఫొటోలను ఫొటోషాప్ లో తెరిచినప్పుడు చూసాను - చిన్నపిల్లల పార్టీ ఫొటోలు. ఓ చిన్నపిల్లెవరో కానీ చాలా క్యూట్‌గా ముద్దొస్తోంది. అడిగితే చెప్పింది వాళ్ల పాపేనని - అ పార్టీ పుట్టిన రోజు పార్టీ అనిన్నూ. నిన్న మధ్యాహ్నం సెలవు పెట్టి మరీ వెళ్ళడానికి కారణం కూడా అదేననీ. వాళ్ళ పాప ఆరు నిండి ఏడో సంవత్సరంలోకి అడుగు పెట్టిందిట. ఫ్రేమ్ ఎలా జత చేయాలో ఒకట్రెంటికి చూపించిన తరువాత మిగిలినవాటికి తనే చేసుకుంది. ఆరోజు సాయంకాలం కూతుర్ని బయటకు తీసుకు వెళ్తానని చెప్పడంతో ఆఫీసు నుండి ముందే వెళ్ళిపోయింది.

అసలు విషయమేమిటంటే, ఇక్కడలాగా పిల్లల పుట్టిన రోజుకి పెద్దలెవరినీ బొట్టుపెట్టి పిలవరట. సాధారణంగా పిల్లలు పిల్లల్నిమాత్రం పిల్చి పార్టీ ఇస్తారట. పిల్లల పార్టీకి పిల్లలే పెద్దలు. పార్టీ ఎలా జరగాలో, ఎక్కడ జరగాలో, ఎవరెవర్ని పిలవాలో ... అన్నింటిలోను పిల్లల ప్రమేయం వుంటుందిట. పెద్దలు పక్కన సపోర్టివ్‌గా మాత్రం వుంటారట. తప్పుచేస్తే సరిదిద్ది ఎలా చేయాలో చెబుతారట.

ఇదంతా వింటున్నప్పుడనిపించింది, చిన్నప్పటినుంచే పిల్లలకి బాధ్యతలు మీదవేసుకోవటం, సరైన నిర్ణయాలు తీసుకోవటం లాంటివి ఎంత చక్కగా నేర్పిస్తున్నారని. మనదగ్గర చూడండి. పేరుకి పిల్లల పుట్టిన రోజనే గానీ, పెత్తనం అంతా పెద్దలదే. పిల్లాణ్ణి (పిల్లదాన్ని) మాత్రం కొత్తబట్టలంటూ ఒకదానిపై ఒకటి వేసి, ఆడపిల్లలైతే మరీను - అన్నిరకాల షోకులూ చేసి, ఊపిరాడకుండా బిగించి పారేస్తుంటారు. ఎటైనా కదులు తూంటే సవాలక్ష జాగ్రత్తలు - అటెళ్ళకు, ఇది చేయకు, కొత్త పట్టు పరికిణీ నలిగి పోతుంది, ఫాంటు మాసిపోతుంది అంటూ ముకుతాడేస్తూ వుంటారు. వాళ్ళేది చేయాలన్నా పెద్దల అనుమతి కావాల్సిందే. పాపం అనిపిస్తోందిప్పుడు.

6 comments:

ప్రదీపు said...

బొమ్మరిల్లు, బొమ్మరిల్లు

Unknown said...

అవును నిజమే...
మనవారు వారినెలా ముద్దు చేద్దామా ? ఏమి కొనిద్దామా అనే ఆలోచిస్తారు కానీ వారికి బాధ్య్తతలు ఎలా నేర్పించాలో ఆలోచించరు.
మనమే అమలు చేయాలి మరి :)

Srini said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం. పిల్లల పుట్టినరోజు వస్తే ఎంత గొప్పగా చేయలా అని చూస్తారే కాని అసలు పిల్లలకేది ఇష్టమో కనుక్కోరు. ఇకనుంచి కనీసం మన తరం వాళ్లమైనా ఈ విషయంలో కొంచం మారితే బాగుంటుంది.

మురళీ కృష్ణ said...

@ప్రవీణ్, @శ్రీనివాస్
పాశ్చాత్యాన్ని దిగుమతి చేసి మనదేశాన్ని పాడుచేస్తున్నారనకుండా, మంచి అనేది ఎవరు చెప్పినా పాటించొచ్చు అని ఆలోచిస్తే - మీరన్నట్లు మన తరమే మారాలి.
@ప్రదీప్
బొమ్మరిల్లు అంటే మొదట అర్థంకాలేదు. కొలీగ్ నడిగితే చెప్పాడు (సినిమాలు బాగా చూస్తాడు). ప్రకాష్ రాజ్, సిద్ధార్థని ఇలాగే చూస్తాడు అని. మీకు నెఱ్లు.

రాధిక said...

ఇలా పిల్లల పార్టీలు మనదగ్గర కూడా నాలుగేళ్ళ క్రితమే ప్రారంభం అయ్యాయి కదా.

Unknown said...

మీరు మన భారత సమాజపు భవిష్యత్తు చూడాలంటే నేటి అమెరికా సమాజాన్ని చూడండి. పక్కనోడి అనుభవంతో పాఠాలు నేర్చుకోవటం అందరికీ సాధ్యం కాదు