ఓ పెద్ద ఊర్లో ఒక సమావేశం జరుగుతోంది. దానికి దేశదేశాలనుంచి ఓ వంద మంది గొప్ప గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనుష్యులు, అధ్యాపకులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, పండితులు, మతాధిపతులు, పీఠాధిపతులు, వేంచేసి యున్నారు. ఇంతకీ అక్కడ సమావేశంలో చర్చించే విషయం అత్యున్నత జీవనశైలి (ఐడియల్ లైఫ్ స్టైల్) గురించి.
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వారి వారి జీవితానుభవాలనుంచీ, వారు చదివిన పుస్తకాలు, మత గ్రంధాలు, శాస్త్ర గ్రంధాలనుండీ ఉదాహరణలు ఉటంకిస్తూ వారివారి అభిప్రాయాలను వెలి బుచ్చుతున్నారు. ఇష్టమున్నవాళ్ళు, ఆ అభిప్రాయలతో ఏకీభవించిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తూంటే, నచ్చనివాళ్ళూ, ఇష్టం లేనివాళ్ళూ వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు.
కొందరు ధనముంటే చాలంటే, మరికొందరు జ్ఞానవంతమైన జీవనానికి అనుకూలంగా వున్నారు. ఇంకొందరు దైవభక్తి, పాపభీతికి తలొగ్గితే, మరికొందరు అంగబలమూ, అధికారానికి పెద్దపీఠవేశారు. సాంకేతికంగా వృద్ధి చెందిన జీవనశైలే పరమావధిగా కొందరు భావిస్తే, ప్రశాంత మైన పల్లెజీవనానికి మించినదిలేదనేవారింకొందరు. ఈవిధంగా చాలా వేడి వేడిగా చర్చలు ఆరు రోజులుగా నడుస్తున్నా, ఇంతవరకూ ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. ఏకాభిప్రాయానికి రావటానికి ఇంకొక్కరోజు మాత్రమే గడువుండటంతో చివరకు నిర్వాహకులు ఓటింగ్ పద్ధతిని అనుసరించడానికి నిర్ణయించారు.
ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఒక్కొక్కళ్ళు వేడివేడిగా ప్రక్కవాళ్ళతో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలలోని పసను ప్రక్కవాళ్ళకు వినిపిస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రక్క వాళ్ళను ప్రభావితం చేసి ఇంకొన్ని ఓట్లను పొందుదామని తాపత్రయం. ఇలా అందరూ హడావుడిగా వుంటే, సాదా సీదాగా వున్న ఓ మధ్యవయసు వ్యక్తి ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓటింగ్ కార్యక్రమం పూర్తయ్యింది. లెక్కించేందుకు ముందు చివరిసారిగా నిర్వాహకులు అందరూ ఓటువేశారా అని కనుక్కుంటున్నారు.
నిర్వాహకుల్లో కొద్దిగా ఆలోచన కలిగిన ఓ చురుకైన వ్యక్తి, ముఖ్య నిర్వాహకుడు - మొదలునుంచీ ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాంతంగా వున్న మధ్య వయసు వ్యక్తిని గమనిస్తూవున్నాడు. అతనెప్పుడూ ఏ వ్యక్తితోనూ, ఎవరి అభిప్రాయంతోనూ ఏకీభవించడంగానీ, వ్యతిరేకించడంగానీ చేయలేదు. అసలు అతను అతని అభిప్రాయాన్ని కూడా ఎవరితోనూ పంచుకున్నట్లు కనబడనూలేదు. ఇప్పుడూ అలానే ప్రశాతంగా ఓ మూల కూర్చొని ఉన్నాడు. ఇదంతా చూసిన ఆ నిర్వాహకుడికి అతనికి కూడా ఓ అవకాశం ఇస్తే బాగుంటుందనిపించింది.
ఇంతలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందరూ ఎవరికి వారే తమ అభిప్రాయమే గెలుస్తున్న అభిప్రాయంలో వున్నారు. ఫలితం ప్రకటించేందుకు ఆ చురుకైన నిర్వాహకుడు ఫలితాల కాగితంతో మైకు ముందుకు వచ్చాడు. అందరికీ ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. వచ్చిన అందరికీ తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం వచ్చినా, ఒకవ్యక్తి మాత్రం తన అభిప్రాయాలను చెప్పలేకపోయాడనీ, చివరిగా అతనికీ ఓ అవకాశం ఇస్తున్నామనీ, దయచేసి అందర్నీ నిశ్శబ్ధంగా వుండమని ప్రార్థించాడు. మధ్యవయసు వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని స్టేజ్ మీదకు మాట్లాడడానికి ఆహ్వానించాడు.
ఆ మధ్యవయసు వ్యక్తి తన గురించి పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు. "నేను భారత దేశం లోని ఓ సాధారణమైన చిన్న పట్టణం నుంచి వచ్చాను. నాకు ముగ్గురు పిల్లలు. నాలుగెకరాలు కూరగాయలు పండించే పొలం, గ్రామ సభలో అకౌంటెంటు ఉద్యోగం."
ఈ మాటలు పూర్తయ్యీ కాకమునుపే సభలో మిగిలిన వారి ముఖాల్లో తేలికభావం, అసలెవరతన్ని ఈ సభకాహ్వానించారని గుసగుసలూ మొదలయ్యాయి. నిర్వాహకుడు వారించాక కొద్దిగా సద్దుమణిగారు. తిరిగి అతను మొదలు పెట్టాడు. "నేనేమీ ఈ సమావేశానికి వెళతాననలేదు, కానీ మా పట్టణ ప్రజలు, పెద్దల బలవంతం మీద వచ్చాను. కానీ ఇక్కడ మీలాంటి పెద్దల్నీ, పండితులనీ చూశాక నాలాంటి వాడు చెప్పేదేముంటుందని వూరకున్నాను."
ఇంతలో సభలోంచి ఎవరో నీ వెవరి అభిప్రాయానికి ఓటేసావన్నారు. "మీ రెవరి అభిప్రాయంతోనూ నేనేకీభవించలేక పోయాను కనుక ఓటే వెయ్యలేదు" అన్నాడతను.
"మీరెవరి అభిప్రాయంతోనూ ఏకీభవించలేక పోయానన్నారు. బాగుంది. అయితే మీ అభిప్రాయంకూడా చెప్పండి" అన్నాడు నిర్వాహకుడు.
"మీరింతవరకూ చెప్పిన అభిప్రాయాలన్నీ మనిషి సుఖజీవితానికి తోడ్పడతాయి తప్ప అర్థవంతమైన జీవనానికి కాదు. అర్థవంతమైన జీవితమంటే ఏమిటో మీకు తెలియనిదేమీ కాదు. ఏ శ్రమా, కష్టం లేకుండా గడిపే సుఖవంతమైన జీవితానికీ, భూమిలోపల ఆరడుగుల గోతిలోని జీవితానికీ తేడా ఏముంది? ఇబ్బందులనధిగమిస్తూ, కష్టాలనెదుర్కొంటూ, అసహాయులకు ఆసరా అందిస్తూ సాగే జీవనమే సామాజిక, దేశ పురోభివృద్ధికి మూలం. అదే అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్" అంటూ ముగించాడు.
సభలో ఏ ఒక్కరూ ఏమీ మాట్లాడలేదు. నిర్వాహకుడు మైకు ముందుకు వచ్చి ఈ వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఎవరికైనా వుంటే మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. తన చేతిలోని ఫలితాల కాగితాన్ని తెరవకుండానే చించేసి, ఆ మధ్య వయసు వ్యక్తికి ధన్యవాదాలతో సభను ముగించాడు.
6 comments:
Good one...:)..
Good Post.
చాలా రోజుల తరువాత రాసినా మంచి టపా రాసారు.
"ఇబ్బందులనధిగమిస్తూ, కష్టాలనెదుర్కొంటూ, అసహాయులకు ఆసరా అందిస్తూ సాగే జీవనమే సామాజిక, దేశ పురోభివృద్ధికి మూలం. అదే అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్"......నిజమే కదా!
hmm
Interesting topic. As it states, it may be the ideal lifestyle but may not be an enjoyable one (if one has to to live with poverty in that process)
చాల బాగా రాసారు
Post a Comment