Wednesday, April 09, 2008


అరిచే కుక్క మొరగదు - మూడు


నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ సంవత్సరం బందరు నక్కలతోటలో ఫ్రెండుతో (కోడూరి సాయిబాబు) కలిసి రూమ్ తీసుకుని వున్నాను. ఓ రోజు క్లాసులో చాలా మంది "రోజూ వినేదేగా క్లాసులు - బోరు కొడుతోంది సినిమాకెళ్దాం" అన్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి - మా కాలేజీలో 50 మందిదాకా వుండేవాళ్లం (తెలుగు, ఇంగ్లీషు మీడియంలు రెండూ కలిపి), కానీ అందరికీ కలిపి ఒకే క్లాసు - పంతుళ్లు తెలుగు, ఇంగ్లీషు కలగలిపి చెప్పేవారు. ఈ 50 మందిమి ఒక్కమాట మీద వుండేవాళ్లం, ఒకరిద్దరు తప్ప (వాళ్లగురించి మరోసారెప్పుడైనా).

సినిమా అనుకోగానే అందరం కాలేజీ డుమ్మా కొట్టేసి సైకిల్లేసుకుని హాలుకు బయలుదేరాం. తీరా హాలు దగ్గరికెళ్లి చూద్దుంగదా, ఆల్రెడీ చూసిన సినిమా - పైగా మహిళా చిత్రం. మాకోపికలేదని వెనక్కి మళ్ళితే కొందరు 'కలాపోసన' కోసం ముందుకెళ్ళారు. నాతో పాటూ నా రూమ్మేటూ రూముకు చేరుకుని చేసేదేమీ లేక చెస్ ముందేసుక్కూచున్నాం. అప్పట్లో నెట్ కెఫేలూ, కంప్యూటర్ డ్రోములూ లేవు. అసలు మేమెవరమూ కంప్యూటరే చూడలేదు - ఇంగ్లీషు సినిమాల్లో తప్ప. ఓ అరగంటయ్యే సరికి ఇద్దరం పూర్తిగా ఆటలో మునిగిపొయ్యాం.

"దబ్" మన్న చప్పుడు - చూస్తే మా సుబ్రహ్మణ్యం. సుమారు ఏడడుగులు ఎత్తుంటుంది మేమద్దెకుంటున్న ప్రహరీ గోడ. రోడ్డుకు కొంచెం దిగువనుండడంతో ప్రహరీ ఎత్తుగా కట్టించారు బయటనుంచి ఎవరికీ కనపడకూడదని.

"ఏం సుబ్రమణ్యం ఏమైంది? అసలు ఈ పక్కనుంచెట్లా వచ్చావు-గేటు తీసుకు రావచ్చుకదా? అయినా అంతెత్తు ఎలా దూకావురా?" అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేశాం.

"ఇంత లోతుంటుందని తెలీక దూకేశా" మోకాళ్ళు నొక్కుకుంటూ లోపలికొచ్చాడు. చెస్ బోర్డు చూసి "మీకు చెస్సాడటం వచ్చా?" అన్నాడు బోర్డు పక్కనే చతికిలబడుతూ. సమాధానం కోసం ఎదురుచూడకుండా ఆటలో వేలు పెట్టాడు. ఓ పావు(కాలు) గంట తర్వాత ఆటైపోయాక అడిగాడు "అవును మీరిక్కడున్నారేంటి?" అని. వాడి ప్రశ్న మాకస్సలర్థం కాలా.

"మేమిక్కడున్నామని తెలీకుండానే గోడదూకావా?" ఆన్నాడు సాయి.
"గోడదూకాక తెలిసింది మీరిక్కడున్నారని. అయినా దీ** ఇంతలోతుందేంటిది. ఏ నా **కొడుకు కట్టించాడో, అబ్బ కాళ్ళిరిగి పోయాయనుకున్నా" అన్నాడు. మా సుబ్రహ్మణ్యం బ్రాహ్మణుడు. సంస్కృతంలో ఉద్ధండుడు. వాక్యానికో సంస్కృత సమాసం వాడందే కుదరదు వాడికి.
"మరెవరికోసం దూకావు .. లేడీస్ హాస్టలు కూడా కాదిది" అన్నాడు సాయి వ్యంగ్యంగా.
"దొంగ** కుక్క వెంటబడితే ముందూ వెనకా చూసుకోకుండా దూకాల్సొచ్చింది."
"ఛా..ఛా. కర్రతోనో, కాలుతోనో తన్నుండాల్సింది - వెధవది కుక్కుకు కూడా భయపడాలా" అన్నా.
"అమ్మో మానాన్న తంతాడు" అన్నాడు భయంగా.
"దారేపోయే కుక్కని కొడితే మీనాన్నకేంటిరా." అన్నాడు సాయి.
"అయినా కుక్కని కొట్టావన్న సంగతి మీనాన్నకెలా తెలుస్తుంది" అన్నా లా పాయింటు లాగుతూ.
"ఆ కుక్క మాదే .. ఆనుకునుండే పక్కిళ్లే మాది" అన్నాడు సుబ్రహ్మణ్యం దిగాలుగా.
...
...
...
ఓ ఆర్నెల్లు మాకు నవ్వుకోడానికి మంచి విషయం. అందరికీ చెప్పామని ఉడుక్కున్నా, చెస్సాడడానికి మళ్లీ వస్తూంటాడు మారూముకి - గోడదూకి కాదండోయ్, గేటు తీసుకునే.

No comments: