మీలో కుక్కలంటే ఎందరికి భయం ? లేదా భయం లేనిదెంతమందికి?
ఇప్పటిదాకా నా పరిశీలన ప్రకారం (నేనేం పనిగట్టుకునేం రీసెర్చ్ చెయ్యలేదు - జస్ట్ క్యాజువల్ అబ్జర్వేషన్) కుక్కలంటే భయం లేనివారు లేరు. ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు, ఎంతోకొంచెం ప్రతి ఒక్కరూ కుక్కలకి భయపడే వుంటారు.
'కుక్కవున్నది జాగ్రత' అన్న బోర్డు చూసికూడా ధైర్యంగా తలుపు తట్టే దమ్మెవరికుందండీ <-
రోడ్డు మీద నడుస్తుంటే అకస్మాత్తుగా వెనకనుండి ఓ కుక్క భౌమంటే గుండె ఝల్లుమననిదెవరికి <-
అంతేకాదు రాత్రిపూట ఒంటరిగా వస్తూంటే వాళ్ళ సామ్రాజ్యంలోకి చొరబడ్డ శత్రువుల్లాగా మనల్ని క్రూరంగా చూస్తూ మొరిగే కుక్కల్ని చూసి బిక్కచచ్చిపోనివాడెవడు <-
కానీ పగలు వెనక రాత్రి, రాత్రి వెనుక పగలు వున్నట్లు ఈ ప్రపంచంలో కుక్కల్నిచూచి భయపడేవాళ్ళే కాదు, పెంచుకునే వాళ్ళూ వుంటారు. ఈ పెంచుకునే వాళ్ళు రెండు రకాలు. ప్రేమగా పెంచుకునేవాళ్ళు కొందరైతే, అవసరం కోసం పెంచుకునే వాళ్ళు మరికొందరు. (స్టేటస్ కోసం కూడా పెంచుకునే వాళ్ళను కూడా చూశాను)
వీళ్ళ దగ్గరో తమాషా వాదనొకటి నేను తరచూ వింటూవుంటాను. అదేంటంటే, 'ప్రపంచంలో అత్యంత విశ్వాస పాత్రమైన జంతువు కుక్క - అలాంటి కుక్కని చూచెందుకండీ భయపడతారు?' అంటూ వుంటారు కుక్కల్ని పెంచుకునే శునక ప్రేమికులు. నిజమే సుమా! ఓ ఎంగిలి ముద్ద పడేస్తే మనం పొమ్మన్నా పోకుండా మనచుట్టూ తిరుగుతూ వుంటుంది. (ఓ ముద్ద సరిపోలేదు కాబోలు)
'భయపడక చావాలా. ఎంతమంది కుక్కలబారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగట్లేదు. బొడ్డు చుట్టూ ఫధ్నాళుఘు ఇండీషన్లేసుకున్నవాడికి తెలుస్తుంది దాని బాధేంటో' అనేవాళ్ళూ వున్నారు - ప్రత్యక్ష లేక పరోక్షానుభవం మరి.
తార్కికంగా ఆలోచిస్తే, కుక్క ఎవరికి విశ్వాస పాత్రమైనది? మనిషికి అన్నది ఆబ్వియస్ సమాధానం.
మరి మనిషి కుక్కకి విశ్వాస పాత్రుడా కాదా? స్టాటిస్టికల్గా మనిషి కరచిన కుక్కల కంటే, కుక్కలు కరచిన మనుషులే ఎక్కువ కాబట్టి కాదనే అనిపిస్తుంది. అందువల్ల కుక్కలు మనుషుల్ని కరవడంలో విచిత్రమేమీ లేదు. కరవడం వాటి జన్మహక్కు. (ఔ అనండి, వెనక మేనగాగాంధీ కర్రట్టుకు నుంచుంది). 'ఆగండాగండి. మనిషి కుక్కల్ని కరవడమేమిటండీ' అంటారా. మరి కుక్కలు మనుషుల్ని కరుస్తున్నాయిగా అందుకన్నమాట. ఓకే!
...మ్మ్. ఇంకా ఏదో లోపం కనిపిస్తోందా నా తర్కంలో. ఒక్కక్షణం.
వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముల్లుని ముల్లుతోనే తియ్యాలి అంటారు పెద్దలు అవునా.
కుక్క జంతువు, నాలుగు కాళ్ళుంటాయి - మనిషినీ నాలుక్కాళ్ళ జంతువంటారు. సారూప్యత సరిపోయింది.
'మరి మనిషి కుక్కని కొడతాడు కదా' అనొచ్చు. వాడెవడో తిట్టాడు, నువ్వూ తిట్టు - సరికి సరి. కానీ నువ్వెళ్ళి కొట్టావనుకో, పోలీసోడు నీ తాట తీస్తాడు. అలాగే కావాలంటే కుక్కని కూడా కొట్టమనండి. (వితండవాదమా ... మజాకానా)
తర్కం చెప్పేదేంటంటే...
మనిషి కుక్కల్ని నమ్ముతాడు [1]
కానీ కుక్కలు మనుషుల్ని నమ్మవు [2]
అందువలన మనుషులు కుక్కల్ని నమ్మకూడదు [3]
కాబట్టి ఫైనల్గా మన జాగ్రతలో మనం వుండటం మంచిది.
ఈ సందర్భంగా నిజంగా జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తోంది. మా అన్నయ్యకో కుక్క వుంది - పేరు మార్కీ. ఓ సారి బయటనుంచి తిరిగీ తిరిగీ వచ్చి 'నొప్పిగా వున్నాయి కాళ్ళు తొక్కు' అన్నాడు. 'నేను తొక్కను' అన్నా. (నాకెందుకో చిన్నప్పటినుండీ ఇంకొకళ్ళకి కాళ్ళు తొక్కడం, తల పట్టడం,పీక నొక్కడం లాంటి పనులెందుకో ఇష్టం వుండవు - అలాగే నేనూ ఎవరినీ అడగను కూడా). ప్రక్కనే వున్న మా పిన్నిగారబ్బాయి నడిగాడు. 'సరే'నని లేచి తొక్కటానికి కాలు మీద పెట్టాడో లేదో - 'ఖయ్యి'మనరుస్తూ మీద కొచ్చి కాలు పట్టుకొంది మార్కీ - మా అన్నయ్య మీద కెవరో వచ్చారన్నది దాని కోపానికి కారణం. బిక్కచచ్చిపోయాడు మా తమ్ముడు. ఎక్కడో వేరే గదిలో మంచంకింద బొమిక చీక్కుంటూ హాయిగా కూచుంది అంత సడన్గా రావడానికి కారణం - ఇందాక వాళ్ళు చెప్పిన విశ్వాసమేనా?
కానీ ఇప్పుడు బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు చేయించుకునేంత అంత బాధక్కర్లేదు - యాంటీరేబీస్ ఇంజక్షన్లు మూడేసుకుంటే చాలుట (మావాడికీ వేయించాం, కుక్కకి ఆల్రడీ వేక్సీన్ చేయించి వున్నా మావాడికి భయం తగ్గటానికి).
ఆలోచిస్తే శునక ప్రేమికులు చెప్పిన దాంట్లో నిజముంది (కుక్క విశ్వాసానికి మారుపేరు). తన యజమానికి ఏమన్నా హాని జరుగుతుందన్న అనుమానం వస్తేచాలు - తెలుగు సినిమా హీరోలా యాక్షన్లో దూకి కాపాడటానికి రెడీగా వుంటుంది. మనం చేసే పనులు యజమానికి హాని చేయని తెలిస్తే అది ఎవరినీ ఏం చేయదన్నది వీరి వాదం. (హాని కాకపోయినా హానిచేస్తున్నట్లనిపించే పనులు చేసినా వాటికి కోపం వస్తుంది - జాగ్రత)
మరి యజమాని లేని కుక్కల సంగతేంటి? మేనకా గాంధీనో, మునిసిపాలిటీ వాళ్ళనో అడగాల్సిన ప్రశ్నిది.
మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం.
Saturday, September 01, 2007
అరిచే కుక్క మొరగదు - ఒకటి
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
కట్టమంచి రామలింగా రెడ్డిగారు ఏదో ఊరెళ్ళినప్పుడు, ఇక్కడకు వచ్చాంగదా, అని ఏవరినో పలకరిద్దాం అని తన స్నేహితుడితో కార్లో బయలుదేరారంట. ఆ ఇంటికి చేరుకున్నారు. గేటు వేసిఉంది. దానిమీద బోర్డ్ ఉంది. అది చదివినతరువాత,కిందకు దిగకుండానే కారుని వెనక్కి తిప్పమన్నారంట. "అదేంటి, ఇంత దూరం వచ్చింది వారిని కలవడానికికదా, మరి కలవకుండానే వెళ్ళిపోతున్నారు", అని ఆ మిత్రుడు అడిగాడంట."ఆ గేటు మీద బోర్డు చదివాను."కుక్కలున్నవి జాగ్రత్త!" అని వ్రాసి ఉంది. నేనేమో మనుషులున్నారనుకున్నాను. కుక్కలతో నాకు పనేమిటి అని అన్నారంట.
జంఘాల శాస్త్రి లేవల్లో బ్లాగుదమనా?
Post a Comment