సుమారుగా 3 సంవత్సరాల నుండీ ఈ తెలంగాణా గురించి వినీ వినీ విసిగిపోయిన జనాలెంతమందో. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో కేసీయార్ నిరాహారదీక్ష, ఉపసంహరణ ప్రహసనం సందర్భంగా మా ఆఫీసు వాళ్ళ మాటల సారాంశం.
* తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలి ... ఎందుకు? ఏ ప్రాతిపదిక పైన?
* ప్రత్యేకంగా తెలంగాణా అనే వివక్షతో తెలంగాణా ప్రాంతం వారికి జరిగిన నష్టం ఏమిటి?
* అసలు నష్టం ఏమిటి, అంతా లాభమే కదా. ఎన్నడూ లేనంతగా భూమి రేట్లు పెరిగాయి, ఉద్యోగావకాశాలు పెరిగాయి, కొత్త కంపెనీలు పెరిగాయి, జీతాలు పెరిగాయి, జనాభా పెరిగింది.
* గవర్నమెంటు తెలంగాణేతరులనే పరిశ్రమలు స్థాపించమనీ, తెలంగాణేతరులకే ఉద్యోగాలిమ్మనీ చెప్పిన దాఖలాలైతే ఏమీ లేవు.
* వనరులన్నీ కొల్లగొట్టు కెళ్ళిపోతున్నారనే దాంట్లోనూ పస లేదు. ఒకవేళ అదే నిజమైతే అక్కడి వారు (తెలంగాణేతరులు) ఉద్యోగాల కోసం ఇక్కడి(తెలంగాణా) కెందుకొస్తారు.
* వీటన్నింటినీ మించి కె.సి.ఆర్., నరేంద్ర, వగైరా రాజకీయనాయకుల ఆస్తిపాస్తుల్ని చూడండి ... ఒకప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడానో!
* ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం అంటూ వూరికే అరవడం కాదు, అసలు ప్రత్యేక రాష్ట్రం అంటూ వస్తే వీళ్ళే రకంగా లాభపడతారో సవివరంగా చెప్పమనండి.
* ప్రత్యేక తెలుగు రాష్ట్రం గురించి పొట్టి శ్రీరాములు గారు చేసినట్లు కేసీయార్నో, నరేంద్రనో, లేక విజయశాంతినో చెయ్యమనండి ... తెలంగాణా రాకపోతే చూడండి.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరొచ్చింది కనుక కొన్ని విషయాలు ఇక్కడ చదవండి.
Friday, August 25, 2006
తెలంగాణా - ప్రత్యేక రాష్ట్రం
Friday, August 11, 2006
ఇది పరాకాష్ట ... కొనసాగింపు
"నిన్న జెమిని టివీలో “బంగారం మీకోసం” చూస్తున్నాను. అందులో ఒక ప్రశ్న “Sun flower” పువ్వుని తెలుగులో ఏమంటారు అని! మన జీవిత కాలంలోనే ఇలాంటి క్విజ్ ప్రశ్నలు ఇంకా వినాల్సి వస్తుంది కాబోలు!" అంటూ చరసాల గారి బ్లాగు లోని ఇది పరాకాష్టలో చూసి, క్రింద సుధాకర్, త్రివిక్రమ్ గార్ల కామెంట్లు చదివిన తర్వాత ...
ఆగండి సారూ! అంత కష్టమైన (నిజమా?) ప్రశ్నలు వేస్తున్న ఝాన్సీనో, ఉదయభానునో లేక రమ్యకృష్ణనో చూసి కాదు తల జుట్టు పీక్కోవాల్సింది - వాటిక్కూడా సమాధానాలు చెప్పలేక బహుమతి కోసం క్లూ (clue)ల కోసం బతిమాలాడే పెద్దవాళ్ళని చూసి.
టీవీ వాళ్లనేంచెయ్యమంటారు? సమాధానం చెబితేనే బహుమతివ్వాలి. బహుమతులివ్వకపోతే జనాల్లో కార్యక్రమం పాపులరవ్వదు. కాబట్టే అంతలేసి ఖస్టమైన ప్రశ్నలడుగుతున్నారు మరి. గట్టిగా మాట్లాడితే ద్రౌపది భర్తలైదుగురి పేర్లూ (ఇంతకీ ఐదని కూడా తెలుసా లేదో) చెప్పలేని వాళ్ళని చూసి పీక్కోవాలండీ తలో, జుట్టో, మరోటో!
Thursday, August 10, 2006
నల్లికి నరుడే మందు !
డబ్బుల కోసం రక్తదానం చేసేవారిని మించిపోయి ... రెండు రూపాయిల కోసం ఆ రక్తాన్ని నల్లులకు స్వచ్ఛందంగా సమర్పించుకుంటున్నారు పశ్చిమ బెంగాల్లోని పేదలు. ఇక్కడ నగరాల శివార్లలోను, పట్నాల్లోనూ దాబాల సంఖ్య తక్కవేమీ కాదు. చాలా దాబాల్లో కుర్చీలు, టేబుళ్ళకు బదులు నులకమంచాలే వాడుతుంటారు. ఈ మంచాలకు కొబ్బరి లేదా జనపనారతో పేనిన తాళ్ళను పట్టీలుగా వాడడంతో నల్లుల సమస్య చాలా ఎక్కువ.
వేడినీళ్ళు పోయడం, క్రిమిసంహారక మందులు వాడడం వాటిని నివారించవచ్చు కానీ దాబాల యజమానులు అవి చాలా ఖరీదైన చర్యలుగా భావిస్తున్నారు. అందుకు వారో చవకరకం ఉపాయాన్ని కనుక్కున్నారు. గ్రామాల్నుంచి వచ్చే పేదల్నే పురుగుమందులుగా మారుస్తున్నారు.
సాయంకాలం దాబా తెరుస్తూనే ఓ వ్యక్తి 90 (౯౦) శాతం నగ్నంగా నల్లులు రక్తం పీల్చుకుని సంతృప్తి పడేదాకా పడుకుంటాడు. తరువాత ఆ నల్లులు తృప్తి చెంది మంచం కోళ్ళలోని ఇరుకు సందుల్లోకి జారుకుంటాయి. తర్వాత ఎవరు కూర్చున్నా మర్నాటి దాకా కుట్టవు. ఇలా మంచం మీది నల్లుల్ని తృప్తిపరచినందుకు అతడికి దక్కేది రెండ్రూపాయలే.
దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లాలోని దాబా యజమాని దల్బీర్ ఖేత్రి మాట్లాడుతూ "మంచాల్ని పూర్తిగా వేణ్ణీట్లో ముంచితే నల్లల్ని నివారించవచ్చు. కానీ అని ఆరడానికి ఒక రోజంతా పడుతుంది. అందుకని అలా చేయలేక పోతున్నాం. పురుగుమందులు వాడదామంటే ఖరీదు చాలా ఎక్కువ. మా కస్టమర్లంతా ట్రక్కు డ్రైవర్లూ, క్లీనర్లే. అంత భరించలేక ఈ మార్గాన్ని ఎంచుకున్నాం." అని వివరించారు. "ఏదో ఒక ఉపాది దొరికింది - అంతే చాలు" అని జాబువా జిల్లాలో నల్లులకు తన రక్తాన్ని ఆహారంగా పెడుతున్న ఓ వ్యక్తి పేర్కొన్నాడు.
-- ఈనాడు వార్త
Saturday, August 05, 2006
ఓ మంచిమాట
"ప్రపంచంలో వుండే జీవులన్నింటిలో సిగ్గు పడే లేక సిగ్గు పడాల్సిన అవసరం వున్న జీవి మనిషి ఒక్కడే."