నాస్తి ధ్యాన సమం తీర్థమ్
నాస్తి ధ్యాన సమం దానమ్
నాస్తి ధ్యాన సమం యజ్ఞమ్
నాస్తి ధ్యాన సమం తపమ్
తస్మాత్ ధ్యానం సమాచరేత్
ధ్యానానికి సమమైన తీర్థం లేదు.
ధ్యానానికి సమమైన దానం లేదు.
ధ్యానానికి సమమైన యజ్ఞం లేదు.
ధ్యానానికి సమమైన తపస్సు లేదు.
అందువల్ల రోజూ ధ్యానం చేయాలి.
ధ్యానమంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాసే ధ్యానం. సూర్యోదయానికి ముందే లేచి, నిత్య కర్మలు ఆచరించి, ఉచితాసనం మీద పద్మాసనం వేసుకుని, శరీరానికి చక్కగా పరిశుభ్రమైన గాలి తగిలేలా - అవసరం అయితే అగరువత్తి వెలిగించుకుని - రెండు చేతులనూ ధ్యానముద్రలో మోకాళ్లపై వుంచి కూర్చోవాలి. కనులు మూసుకుని, దృష్టిని భ్రూ మధ్యమున నిలిపి దీర్ఘశ్వాసను తీసుకోవాలి. శ్వాసను కొద్దిసేపు లోపలే ఆపి వుంచి, వీలైనంత నెమ్మదిగా శ్వాసను బయటకు విడిచి పెట్టాలి. ఇది చేస్తున్నంత సేపూ మనస్సును శ్వాస ప్రక్రియ మీద కేంద్రీకరించాలి. ఈ విధంగా ఏడు సార్లు (అంటే సుమారు పది నిమిషముల సమయం) చేసిన పిమ్మట ఐదారు నిమిషములు శాంతంగా కూర్చోవాలి.
దీని వలన మనస్సు శాంతించి, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుతాయి. బుద్ధి తీక్షణమౌతుంది. శరీరం చైతన్యవంతమవుతుంది.
Sunday, July 30, 2006
ధ్యానము
Sunday, July 16, 2006
గుర్తుకొస్తున్నాయి
మా టీవీ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 కు 'గుర్తుకొస్తున్నాయి' అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. అప్పుడప్పుడు సినిమాల కోసం, పాటల కోసం టీవీ పెట్టే నేను ఈ రోజెందుకో ఛానల్స్ స్కాన్ చేస్తూండగా మా టీవీ లో ఈ కార్యక్రమం చూట్టం జరిగింది. క్లుప్తంగా కార్యక్రమం ఏమిటంటే సమాజంలోని అలనాటి (మరచిపోయిన)లబ్దప్రతిష్ఠులను పిలిచి వాళ్ళ మధురస్మృతులను మనతో పంచుకొనే కార్యక్రమం. నిజంగానే బాగుంది. చాలా టీవీల్లో చూసే ఇంటర్వ్యూల్లోలాగా కాకుండా ఇందులోని ఏంకర్ /ఇంటర్వ్యూయర్ రఘు కుంచే పిలిచిన వాళ్ళచేతే ఎక్కువ సేపు మాట్లాడించాడు.మొదట పొడి పొడిగా మొదలైనా కొద్ది సేపట్లో వాళ్ళు తమ మనసు పొరల్లోకి వెళ్ళి ఎన్నో సంగతులు చెప్పారు.
ఈ రోజు బి.వసంత గారితో 'గుర్తుకొస్తున్నాయి'. వాగ్ధానం చిత్రంతో గాయనీమణిగా ప్రవేశం చేసిన వసంత గారు ఎన్నో విషయాలు చెప్పారు. తన మొదటి పాటలు, తోటి గాయకుల విశేషాలు, తను పనిచేసిన సంగీతదర్శకులు తో అనుభవాలు ఎన్నో గుర్తు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఆవిడ సంగీత దర్శకత్వం వహించిన ఒక కన్నడ, ఒక తెలుగు చిత్రాల గురించీ చెప్పారు. సుమారు 3000 పాటలు పాడిన ఆవిడ, వాటితో పాటు ఇంకా పదును తగ్గని ఆవిడ కంఠస్వరంతో ఆపాత మధురాలనీ వినిపించారు.
ఆసక్తి వున్నవాళ్ళు చూడండి. వచ్చేవారం ఒకప్పటి సూపర్ హీరోయిన్ 'కృష్ణవేణి' గారితో కార్యక్రమం. కృష్ణవేణిగారి గురించి ఓ రెండు ముక్కలు. అక్కినేని 'కీలుగుఱ్ఱం' సినిమాలో హీరోయిన్ ఈవిడ. రామారావు గారి మొదటి సినిమా 'మనదేశం' కు నిర్మాత ఈవిడే. ఇంకా ఎన్నో విషయాలు ఆవిడా నోటిద్వారా తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం 10:30 కు మాటీవీ చూడండి.
(ఇది మాటీవీ వారికి సంబంధించిన ప్రకటన మాత్రం కాదు)
Saturday, July 01, 2006
పాపం - ప్రాయశ్చిత్తం
"దాసుని తప్పు దండం(దణ్ణం) తో సరి"
"చేసిన తప్పు చెబితే పోతుంది"
"పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు"
వీటి గురించి మీ అభిప్రాయం ఏమిటి?
వెనకటికెవరో ఏదో బ్లాగులో(దొరక్కానే లింకిస్తాను) భక్తి గురించి వ్రాస్తూ కొన్ని ప్రశ్నలేసారు. అందులో ఒకటి అజామిళుడి గురించి. అవి చదివిన తర్వాతే ఈ ఆలోచననొచ్చింది.
నిజమే, మొదలు సద్బ్రాహ్మణుడైనా, తరువాత వేశ్యాలోలుడై భ్రష్టుడైనా, అవసానకాలంలో యమభటులను చూచి భీతితో తన కిష్టమైన చిన్న కొడుకుని "నారాయణా" అని పిలిచినందుకు విష్ణు దూతలు అతన్ని కాపాడారు. పశ్చాత్తాపుడైన అజామిళుడు దైవచింతనామగ్నుడై కొంతకాలం తరువాత విష్ణుసాయుజ్యం పొందాడు. ఇదీ కథ స్థూలంగా.
ఇదే విషయం గురించి మాట్లాడుతుంటే మావాడొకడు "హిందూ మతం పర్లేదు, అట్లీస్ట్ ఏం చేయాలో సొల్యూషన్ చెబుతుంది తుడిచెయ్యకుండా. అదే కిరస్తానీ మతమైతే (ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం లేదు) చేయాల్సిన తప్పులన్నీ (ఎంజాయ్)చేసి, ఆదివారం పొద్దుట చర్చ్‌కెళ్ళి ఫాదరీతో దేవుడా! తప్పులు చేశాను - క్షమించంటే చాలు, అన్ని పాపాలూ క్లాస్ వన్ ఫినాయిల్‌తో కడిగినట్లు కడిగేస్తాడట తెలుసా" అంటూ చిన్న సైజు లెక్చరిచ్చాడు. మరి ముసల్మానుల సంగతేంటో మరి (వాళ్ళు పరమ స్ట్రిక్టేమో - కన్నుకు కన్ను, కాలుకు కాలు!!)
ఈ మతాల ఉద్దేశ్యం తేలిగ్గా కడుక్కునే మార్గముంది కనుక యధేచ్ఛగా పాపాలు చేయమని, లేదా ఏ రకంగా చేసినా తప్పు తప్పే(పాపం) కనుక క్షమించకూడదని మాత్రం కాదనుకుంటా? ఎనీ సెకండ్ ఒపీనియన్?
అసలు పాపం అంటే ఏమిటి?
పాపం యొక్క తీవ్రత ఎలా తెలుస్తుంది?
అసలు మనం పాపం అంటున్న దాన్ని పాపం అని ఎవరు/ఎప్పుడు/ఎందుకు సెలవిచ్చారు?
For every action there is an equal & opposite reaction - Einstein
కాబట్టి, తప్పేంటో, దాని తీవ్రతేంటో తెలిస్తేనే కదా దానికి చెయ్యాల్సిన ప్రతిచర్య/ప్రతిక్రియ గురించి అలోచించడనికి.
ఇలా అలోచిస్తే, తప్పు/పాపం తెలియక చేసినవాడికి, తెలిసి చేసిన వాడికి తేడా ఏమిటి? అంటే సంఘటన కాంటెక్స్‌ట్ గురించి కూడా ఆలోచించాలా, వద్దా?
ఏమిటో అన్నీ ప్రశ్నలే? ఇంకొంచెం ప్రశాంతంగా, దీర్ఘంగా, తార్కికంగా ఆలోచించాలనుకుంటాను. ఎవరన్నా సాయం చేద్దురూ? Can anybody lend a hand?