మేనేజరు ఒకాయన, వయసు 30-35 మధ్య వుండొచ్చు, అంతకు ముందే వీడియోలో మిగతా ఉద్యోగస్తులకి సందేశాలిచి, అవార్డులందుకున్నాడు. అతను పార్టీ ఉత్సాహంలో తాగి తన లగ్జరీ కారులో, సహోద్యోగులతో బయటకు వెళ్లబోయాడు. పార్కింగ్ ప్లేస్ నిండా వెహికల్స్ వున్నా మద్యం మత్తులో స్పీడుగా వచ్చాడు. ఆ రావటం అక్కడే నుంచుని వున్న ఓ క్యాబ్ డ్రైవర్ మీదుగా పోనిచ్చాడు.
సాక్షుల కథనం ప్రకారం, ఆ క్యాబ్ డ్రైవర్ కాలు, చేయి పోయాయి. తప్పు తనదైనా, కారు ఆపి క్యాబ్ డ్రైవర్ల మీద అరిచాడట సదరు మేనేజరు. దాంతో కోపించిన మిగిలిన క్యాబ్ డ్రైవర్లు అతన్ని కొట్టబోగా, తప్పించుకొనే ప్రయత్నంలో కారుని అలాగే రివర్సుచేసి దూకించాడట ఆ ప్రబుద్ధుడు.
ఎంత వేగంగా తోలాడోగాని ఓ ఫర్లాంగు దూరంలో వున్న ఓ రాయికి గుద్ది ఫల్టీ కొట్టించాడు. కోపంతో వున్న క్యాబ్ డ్రైవర్లు వెంబడించి, ఫల్టీ కొట్టివున్న కారులోంచి అతన్ని లాగి, అద్దం పగిలి ముఖమంతా రక్తమోడుతున్నా, చావచితక్కొట్టారట.
ఇంతలో పోలీసులు, ఆంబులెన్సు వచ్చి గాయపడిన ఇద్దరినీ తీసుకెళ్ళారట.
తర్వాత అతన్ని ఉద్యోగంలోంచి తొలగించారని వార్త.
కొన్ని ఛాయా చిత్రాలు...
చివరగా మూడు ముక్కలు
(1)
ఎంత తెలివి గలవాడైనా, ఎంత ఎత్తులో వున్నా సమయం వచ్చేసరికి చావుదెబ్బ తినాల్సిందే. అందులోనూ తప్పు మనదైతే పాపం సానుభూతి కూడా దక్కదు.
(2)
మద్యం ఎవడ్నైనా సరే పుచ్చిపోయేట్లు చేస్తుంది - తస్మాత్ జాగ్రత్త!
(3)
ఆవేశం అన్నిరకాల అనర్థాలకు మూలం - అహంకారం చూపకుండా కొద్దిగా సంయమనం పాటించి వుంటే నాలుగు దెబ్బలతో తినడంతో సరిపోయేది. పాపం!!
Tuesday, April 29, 2008
ఏన్యువల్ డే - ౩
Friday, April 18, 2008
ఏన్యువల్ డే - ౨
క్రితం టపాకి సంబంధించిన కొన్ని ఫొటోలు
పాశ్చాత్య నృత్య ప్రదర్శన (అ)
అవార్డులూ - రివార్డులూ (ఆ)
లేజర్ షో (ఇ)
ఫ్యూజన్ డాన్స్ - ౧ (ఈ)
ఫ్యూజన్ డాన్స్ - ౨ (ఉ)
ఫ్యూజన్ డాన్స్ - ౩ (ఊ)
ఫ్యూజన్ డాన్స్ పూర్తయ్యేలోపు చిత్రించిన చిత్తరువు (ఎ)
అబ్బ ఏం జనమండీ (హ్హ హ్హ) - ౧ (ఏ)
అబ్బ ఏం జనమండీ (హ్హ హ్హ) - ౨ (ఐ)
ఇకపోతే క్రితం సారి చెబుతానన్న సంఘటన .. క్షమించండి .. వచ్చే టపాలో!
Thursday, April 17, 2008
ఏన్యువల్ డే - ౧
ఓ ప్రముఖ కంపెనీ (పేరు గోప్యంగా వుంచడమైనది) ఆన్యువల్ డే (ఆంగ్లంలో ఏమంటారో?) సందర్భంగా పాలెస్ గ్రౌండ్సులో భారీ ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మా బామ్మర్ది అందులో పనిచేస్తుడడంతో నాకూ ఎక్స్టెండయ్యింది ఆహ్వానం. ఎప్పుడూ చూడలేదు కదా అని అంతా బయలుదేరాం.
ఏర్పాట్లు మాత్రం నిజంగానే బ్రహ్మాండం. ఏంకర్లుగా ఓ ఇద్దర్ని బయటనుంచి పిలిపించారట - ఏమీ లాభంలేదు. కుళ్ళు జోకులేస్తూ (ఇంగ్లీషు మరియు కన్నడంలో) నవ్వించడానికి ప్రయత్నిచారు - కానీ పెద్దగా ఫలితం లేదు - జనాల్లో స్పందన లేదు. నాలుగు డేన్సులూ, రెండు పాటలూ - బయటివారి ఆర్కెస్ట్రా. లైటింగెఫక్ట్స్ లో పస లేదు, కానీ లేజర్ షో మాత్రం బాగుంది కానీ చూపించిన కాన్సెప్టు పెద్దగా బాలేదు. మధ్య మధ్యలో అవుట్ స్టాండింగ్ (?) ఉద్యోగస్తులకు అవార్డులూ, రివార్డులూనూ. ఇందులోనూ ఓ మచ్చేమిటంటే మావాడికో అవార్డు రావలసి వుండగా, చదివే ఏంకరమ్మ వేరేవాడి పేరు చదివితే, వాడానందంగా పుచ్చుకున్నాడు. రెండ్రోజుల తర్వాత మా వాడికి సారీ చెప్పారనుకోండి. చివరికి ఫుడ్డు తాజ్ వాళ్ళకి ఆర్డరిచ్చినా (పెద్దగా పేరు రాయించారు) బాలేదు. అసలు తాజ్ వాళ్ళు ఇంత దరిద్రంగా చేస్తారా అనిపించింది.
కష్టపడి మారతహళ్ళి నుండి పేలెస్ గ్రౌండ్సు కెళితే ఇంత చప్పగా వుందేంటా ప్రోగ్రాం అనుకుంటుంటే మరచి పోలేని సంఘటనొకటి జరిగింది.
సంఘటన వట్టి మాటలతో కాకుండా - బొమ్మలతో చూపిస్తా వచ్చే టపాలో.
Wednesday, April 09, 2008
అరిచే కుక్క మొరగదు - మూడు
నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ సంవత్సరం బందరు నక్కలతోటలో ఫ్రెండుతో (కోడూరి సాయిబాబు) కలిసి రూమ్ తీసుకుని వున్నాను. ఓ రోజు క్లాసులో చాలా మంది "రోజూ వినేదేగా క్లాసులు - బోరు కొడుతోంది సినిమాకెళ్దాం" అన్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి - మా కాలేజీలో 50 మందిదాకా వుండేవాళ్లం (తెలుగు, ఇంగ్లీషు మీడియంలు రెండూ కలిపి), కానీ అందరికీ కలిపి ఒకే క్లాసు - పంతుళ్లు తెలుగు, ఇంగ్లీషు కలగలిపి చెప్పేవారు. ఈ 50 మందిమి ఒక్కమాట మీద వుండేవాళ్లం, ఒకరిద్దరు తప్ప (వాళ్లగురించి మరోసారెప్పుడైనా).
సినిమా అనుకోగానే అందరం కాలేజీ డుమ్మా కొట్టేసి సైకిల్లేసుకుని హాలుకు బయలుదేరాం. తీరా హాలు దగ్గరికెళ్లి చూద్దుంగదా, ఆల్రెడీ చూసిన సినిమా - పైగా మహిళా చిత్రం. మాకోపికలేదని వెనక్కి మళ్ళితే కొందరు 'కలాపోసన' కోసం ముందుకెళ్ళారు. నాతో పాటూ నా రూమ్మేటూ రూముకు చేరుకుని చేసేదేమీ లేక చెస్ ముందేసుక్కూచున్నాం. అప్పట్లో నెట్ కెఫేలూ, కంప్యూటర్ డ్రోములూ లేవు. అసలు మేమెవరమూ కంప్యూటరే చూడలేదు - ఇంగ్లీషు సినిమాల్లో తప్ప. ఓ అరగంటయ్యే సరికి ఇద్దరం పూర్తిగా ఆటలో మునిగిపొయ్యాం.
"దబ్" మన్న చప్పుడు - చూస్తే మా సుబ్రహ్మణ్యం. సుమారు ఏడడుగులు ఎత్తుంటుంది మేమద్దెకుంటున్న ప్రహరీ గోడ. రోడ్డుకు కొంచెం దిగువనుండడంతో ప్రహరీ ఎత్తుగా కట్టించారు బయటనుంచి ఎవరికీ కనపడకూడదని.
"ఏం సుబ్రమణ్యం ఏమైంది? అసలు ఈ పక్కనుంచెట్లా వచ్చావు-గేటు తీసుకు రావచ్చుకదా? అయినా అంతెత్తు ఎలా దూకావురా?" అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేశాం.
"ఇంత లోతుంటుందని తెలీక దూకేశా" మోకాళ్ళు నొక్కుకుంటూ లోపలికొచ్చాడు. చెస్ బోర్డు చూసి "మీకు చెస్సాడటం వచ్చా?" అన్నాడు బోర్డు పక్కనే చతికిలబడుతూ. సమాధానం కోసం ఎదురుచూడకుండా ఆటలో వేలు పెట్టాడు. ఓ పావు(కాలు) గంట తర్వాత ఆటైపోయాక అడిగాడు "అవును మీరిక్కడున్నారేంటి?" అని. వాడి ప్రశ్న మాకస్సలర్థం కాలా.
"మేమిక్కడున్నామని తెలీకుండానే గోడదూకావా?" ఆన్నాడు సాయి.
"గోడదూకాక తెలిసింది మీరిక్కడున్నారని. అయినా దీ** ఇంతలోతుందేంటిది. ఏ నా **కొడుకు కట్టించాడో, అబ్బ కాళ్ళిరిగి పోయాయనుకున్నా" అన్నాడు. మా సుబ్రహ్మణ్యం బ్రాహ్మణుడు. సంస్కృతంలో ఉద్ధండుడు. వాక్యానికో సంస్కృత సమాసం వాడందే కుదరదు వాడికి.
"మరెవరికోసం దూకావు .. లేడీస్ హాస్టలు కూడా కాదిది" అన్నాడు సాయి వ్యంగ్యంగా.
"దొంగ** కుక్క వెంటబడితే ముందూ వెనకా చూసుకోకుండా దూకాల్సొచ్చింది."
"ఛా..ఛా. కర్రతోనో, కాలుతోనో తన్నుండాల్సింది - వెధవది కుక్కుకు కూడా భయపడాలా" అన్నా.
"అమ్మో మానాన్న తంతాడు" అన్నాడు భయంగా.
"దారేపోయే కుక్కని కొడితే మీనాన్నకేంటిరా." అన్నాడు సాయి.
"అయినా కుక్కని కొట్టావన్న సంగతి మీనాన్నకెలా తెలుస్తుంది" అన్నా లా పాయింటు లాగుతూ.
"ఆ కుక్క మాదే .. ఆనుకునుండే పక్కిళ్లే మాది" అన్నాడు సుబ్రహ్మణ్యం దిగాలుగా.
...
...
...
ఓ ఆర్నెల్లు మాకు నవ్వుకోడానికి మంచి విషయం. అందరికీ చెప్పామని ఉడుక్కున్నా, చెస్సాడడానికి మళ్లీ వస్తూంటాడు మారూముకి - గోడదూకి కాదండోయ్, గేటు తీసుకునే.
Monday, April 07, 2008
ఉగాది (యుగాది) - మళ్లీ మొదలు!
సుమారు ఆరు నెలలయ్యింది సాక్షిలో పోస్టు రాసి. కర్ణుడి చావుకి కారణాలనేకం, అలాగే నాకు బోలెడన్ని. మునుపెపుడో చెప్పా - బద్ధకం వాటిలో ముఖ్యమైనదని. ఇప్పటికీ అదే నిజమనుకోండి.
మొన్నీ మధ్య బెబ్లాసం(బెంగళూరు బ్లాగర్ల సంఘం)కి వెళ్లినప్పుడు ప్రవీణ్ అడిగారు ఈ మధ్యేమీ రాయటంలేదని. రాయాలనివుంది కానీ కొత్త కొత్త పనుల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నాను. ఓ మంచి రోజు చూసుకు మళ్ళీ మొదలెడతానని.
ఆ మంచిరోజు ఇదే నేమో
అందరికీ సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం - సర్వధారి నామ సంవత్సర సాక్షిగా - రోజూ కాక పోయినా, కనీసం నెలకో రెండో మూడో బ్లాగుతానని ప్రమాణం చేస్తున్నాను.
(మనలో మాట - నాకు పెద్దగా ప్రమాణాలంటే నమ్మకం లేదండీ)