మీలో ఎవరైనా అగ్నిప్రమాదం పూర్తిగా చూసారో లేదో గానీ, నాకు మాత్రం ఇదే మొదటి సారి.
బుడా పెస్టులో ఓ వీధిలోని అపార్టుమెంటులో నేనుంటున్నాను. 'ఓ వీధి' అంటే ఏదో ఒక వీధి కాదు - నేనుండే వీధిపేరే 'ఓ వీధి'. (Ó utca) ఓ ఉట్స - O street ఆంగ్లంలో. సాయంకాలం సుమారు ఏడున్నర ఎనిమిది మధ్యలో బాల్కనీలోకి వచ్చి సంజ వెలుగులో సిటీ అందాలు చూస్తున్నాను. మా వీధి మొదల్లో వుండే మరొక అపార్టుమెంట్లోంచి మెఱుపులాంటిదొచ్చింది. ఏమిటా అని చూస్తూండగానే అదొక మంటలాగా తయారయింది. ఓ నిమిషానిగ్గానీ నాకర్థంగాలా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంట వచ్చిందని. మంట పెరిగి పెద్దదవుతూంది - ఆ యింట్లో ఎవరైనా వున్నారో లేదో తెలీదు. ఆశ్చర్యంగా చూస్తూండిపోయా. మంట తగ్గి పొగ సుడులు తిరుగుతూ కిటికీలోనుండి వస్తూండగా వినిపించింది ఫైరింజను సౌండు.ప్రత్యక్షంగా చూస్తున్నాను కనుక చెబుతున్నాను - మంట మొదలైన మూడు లేదా నాలుగో నిమిషంలో ఫైరింజను సౌండు వినిపించింది.
దగ్గర్నుంచి చూద్దామన్న ఉత్సాహంతో అక్కడకి పరిగెత్తాను. దానయ్యలు, విదేశీయులు (నేనుకూడా విదేశీయుడినే - హహ్హ) కెమెరాలతోనూ, మొబైల్లతోనూ ఫొటోలు తీసుకోవడం చూసి హడావుడిలో కెమెరా తీసుకు రావటం మరచిపోయినందుకు నన్నునేనే తిట్టుకున్నాను. నేనక్కడికి చేరుకునే సరికి రెండు బుల్లి బుల్లి (ఒక్కోటి మన సుమో అంత వుంటుందేమో) ఫైరింజన్లు వచ్చాయి. ఇక అక్కడ్ణుంచి ఇంగ్లీషు సినిమా మొదలయ్యింది. ఒక్క నిచ్చెనొక్కటే తక్కువ. (మీలో చాలా మంది ఇంగ్లీషు సినిమాలో అగ్నిప్రమాదాలనార్పడం చూసేవుంటారు - అది విజువలైజ్ చేసుకోండి. చూడనివాళ్ళు -క్షమించండి-చూసినవాళ్ళనడికి తెలుసుకోండి) అచ్చంగా అలాగే జరిగింది. నలుగురు ఫైర్‌డ్రస్సు వేసుకుని, గొట్టాలు పట్టుకుని పైకి (7వ అంతస్తుకి) పరిగెత్తారు. ఇద్దరు క్రిందనుండి (డ్రైవర్లు కామోసు) రోడ్డుమీదుండే ఎర్ర పైపులకు గొట్టాలను తగిలించారు. వాళ్లు లోపలనుండి ఆర్పితే, వీళ్ళిద్దరూ క్రిందనుండి ఒకరి తర్వాత ఒకరు పైకి నీళ్ళు పిచికారీ చేశారు. వావ్, పాయింటెడ్ ఫౌంటెను లాగా ఏడంతస్తుల పైకి నీటిధార వెళుతుంటే, నిజంగా భలేగుంది సార్.
కాకపోతే మీరు తెరమీద చూశారు,నేను నాలుగు కళ్ళతో చూశాను. మీరు దర్శకుడు చూపించిందే చూశారు నేను చుట్టుపక్కల జరుగుతున్నదీ చూశాను. ఫైరింజన్లు రోడ్డు ప్రక్కగా, పార్కింగు చేసినట్లుగా నిలిపారు ట్రాఫిక్కుకు ఇబ్బందిలేకుండా. ఓ అంబులెన్సూ వచ్చింది కానీ దాని అవసరం పడినట్లు లేదు. రోడ్డు బ్యారికేడ్లూ లేవు, బ్లాకింగూ లేదు. యధావిధిగా ట్రాములూ నడుస్తున్నాయి, కార్లూ తిరుగు తూన్నాయి. నో ట్రాఫిక్ జామ్స్. కాకపోతే రెండ్ణిమిషాలకో, మూడ్ణిమిషాలకో రయ్యికయ్యి రయ్యికయ్యంటూ పోలీసు కార్లు దుమ్ములేపకుండా వచ్చి చూసి వెళుతున్నారు. ఎవరూ ఎవరితో మాట్లాడటంలేదు.
ఓ పదీ పన్నెండు నిమిషాల తర్వాత పొగచూరిన కిటికీ, తడిసిన బిల్డింగూ, నోళ్ళెల్లబెట్టుకుని చూస్తున్న నేను, నా సహోద్యోగి, మరికొందరు దానయ్యలూ, దానమ్మలూ తప్ప అంతా మామూలే. అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించిన విషయమేమిటంటే, ఏడో అంతస్థు(స్తు)లో మంటలొస్తుంటే గ్రౌండు ఫ్లోరులో వుండే షాపోడు (పెద్దదే - ఎలక్ట్రానిక్సూ, నావెల్టీసు) సుబ్బరంగా అమ్ముకుంటున్నాడు.
(వీడెవడండీ, ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే చుట్టకాల్చుకోడానికి నిప్పడిగినట్టు వాళ్ళేదో మంటలార్పడానికి కుస్తీ పడుతుంటే - సినిమాచూసి నట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. లాప్‌టాప్‌లో ఈ ఉదంతం టైపు చేస్తున్నప్పుడు నాగురించి నాకనిపించిన వాక్యం అది. నిజంగానే భలే చేశారు, భలేగ జరిగింది, భలేగుంది అని తప్ప ఒక్క క్షణంకూడా అయ్యో పాపం అనిపించలేదు. మరీ మెటీరియలిస్టుగా అయిపోతున్నానా?)
Sunday, September 23, 2007
హంగరీ - అగ్నిప్రమాదం
లేబుల్స్:
హంగెరీ
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
సినిమాల్లో నరుక్కోడాలు చంపుకోడాలు చూసి చూసి ,పేపర్లలో రోడ్డు ప్రమాదాలు చదివి చదివి అవి నిజం గా కళ్ళెదుట జరుగుతుంటే వాటిని కూడా ఏదో అలవాటుగా చూసినట్టు ,వార్త చదివినట్టు భావించెయ్యడం బాగా కామన్ అయిపోయింది.మొదట్లో ఇలాగే బాధ పడేవాళ్ళము మరీ మెటీరియలిస్టు అయిపోయామా అని.ఇప్పుడు అదీ లేదు.పరిణామక్రమం అంటే ఇదేనేమో?
ఇక ఫైరింజన్, అంబులెన్స్ ఒచ్చేటప్పుడు కార్లు పక్కకి జరిగి దారివ్వడం కూడా చూసే ఉంటారు. అదే మన ఇండియాలో అయితే, పక్కకి జరిగి దారి ఇవ్వాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఎవ్వరికీ ఉండదు.
Post a Comment