Monday, August 30, 2004


సాక్షి - 1.2 (తరువాయి)


అంత చీకట్లోనూ అందంగా వుంది ముఖం. కాకపోతే చీప్ మేకప్ సామగ్రి వాడినట్లూంది, ముఖం మీది మేకప్ చెదిరి పోయి కొద్దిగా వికారంగా కనిపిస్తోంది. కురచ లంగా, వోణీ వేసుకుంది. " ఏమైందమ్మా... " అని అడగాలనుకున్న నా మాట నోట్లోనే ఆగిపోయింది. ఆకారం చూడగానే అర్థమైంది - బ్రోతల్ కేసని. ఎవరో బుక్ చేసుకుని పని అవ్వగానే అక్కడ పడేసిపోయారని. కాని అసలు ప్రశ్నేమిటంటే, ఒకటి - దింపకుండా పడెయ్యట మెందుకు?, రెండు - ఇక్కడెందుకు పడేసినట్లు? ఎందుకంటే ఆ ఏరియా నాకు పరిచయమున్నదే - పక్కా కమర్షియల్ ఏరియా - రాత్రి పూట మాత్రం అన్ని షాపులూ కట్టేసుంటాయి.


కాని "ఇవన్నీ మనకెందుకులే, లేని పోని తలకాయనెప్పి ... " అనుకుని వెనుదిరిగి రోడ్డు ముఖం పట్టా. ఇంతలో ఎవరో పిలిచి నట్టనిపించింది. ఆ సందులో ఆ పిల్ల, నేను తప్ప వేరొకరు లేరు. అనుమానంగా వెనక్కి తిరిగి చూశా. ఆ పిల్లే - 16-18 మధ్య వుండొచ్చు. ఓణీ సర్దుకుంటూ వడి వడిగా నావైపు వస్తోంది. కొంచెం బెరుకనిపించినా, ఏం చెయ్యాలో తొయ్యక నిలబడిపోయా. అర్థం కాని భాషలో ఏదో మాట్లాడుతోంది చేతులు అటూ ఇటూ తిప్పుతూ, చూపిస్తూ. పైట తొలగి చినిగిన రవికలోంచి కనిపిస్తోన్న ఆ పిల్ల రొమ్ము కేసి చూస్తుండిపోయా. అంత చీకట్లోనూ రొమ్ము మీద ఎర్రెర్రగా కనిపించింది - బహుశా గాట్లేమో!


నా చూపులెక్కడున్నాయో గమనించిన ఆ పిల్ల ఒక్కసారిగా ఆగిపోయింది. చటుక్కున చెయ్యి చినుగుకు అడ్డం పెట్టుకుని కూలబడిపోయింది. నాలుగైదు క్షణాలు పట్టింది నాకు ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తోందని అర్థమయ్యేందుకు. ఏం చెయ్యాలో అర్థంకాలా. ఓ రెండు నిమిషాల తరువాత " ఏ వూరమ్మా నీది, తెలుగొచ్చా? " అన్నా. నీళ్ళు నిండిన కళ్ళతో అయోమయంగా చూసింది.


"తెలుగు, తెలుగొచ్చా... హిందీ ఆతా ... ఎట్ లీస్ట్ ఇంగ్లీష్... ఫ్రం వేర్ యు కేం? "

కర్ణాటక లోని ఓ వూరి పేరు చెప్పింది. కొంకిణి మాట్లాడుతోందని అర్థమైంది. ఎప్పుడో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న వచ్చీ రాని కన్నడంలో వివరాలు అడిగా. కొద్దిగా తెలిసిన భాష వినపడేసరికి, ఒక్కసారి వరదలా పొంగుకొచ్చింది ఆ పిల్లకి ఏడుపు. భుజం దగ్గర చెయ్యి పట్టుకుని లేపి రోడ్డు మీదకు తీసుకు వచ్చా. ఫుట్ పాత్ మీద కూర్చోబెట్టి ప్రక్కన కూర్చున్నా. బొమ్మలా నాతో వచ్చినా ఏడుపాపలాపిల్ల. రెండు నిమిషాలు ఏడవ నిచ్చి మళ్ళా నెమ్మదిగా కన్నడంలో అడిగా. పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఆ పిల్ల ఇలా చెప్పింది.


(సశేషం)

No comments: