Sunday, August 29, 2004


సాక్షి - 1.1


నేను రోడ్డు మీద నడుస్తూ వున్నాను. అర్థరాత్రి ఒకటిన్నర కావస్తోంది. ఆల్మోస్ట్ రోడ్డంతా ఖాళీగా వుంది. ఆఫీసులో తప్పనిసరై పూర్తి చేయాల్సిన పని వుండటం వలన అప్పుడప్పుడూ అలా లేటౌతూ వుంటుంది. ఒక్క బస్సూ కనబడటం లేదు. నాకు బండేమీ లేకపోవడంతో నడకే దిక్కయ్యింది. చెదురు మదురుగా మోటారు సైకిళ్ళూ, ఒకటీ అరా ఆటోలూ కనబడుతున్నాయి. బేరం కోసం దగ్గరకొచ్చి స్లో చేసిన ఆటోలను పట్టించుకోకుండా నడవడం మూలాన వాళ్ళు నిరాశగా వెళ్ళి పోతున్నారు.

నాకు ఆటోలంటే కొద్దిగా అలర్జీ. ఎంతో అవసరమైతే తప్ప ఎక్కను. అలాగే 'setwin' బస్సులున్నూ... ఎందు కంటారేమో... ఆ సంగతి తర్వాత చెప్తాను.

బాగా అలవాటైన దారవటం మూలాన, చకచకా నడుస్తున్నాను. బుర్ర ఖాళీగా వుండటం ఇష్టం లేక ఆలోచనల్లో పడింది. కాళ్ళు వాటంతటవే దారి చూసుకుంటున్నాయి. సవాలక్ష ఆలోచనలు - ఒకదాని కొకటి పొంతన లేకుండా బుర్రంతా గిరగిరా తిరుగుతున్నాయి. రకరకాల సమస్యలు... వింతైన పరిష్కారాలు. బుర్రలోని ఆలోచనలను సాగదీస్తూ, సర్రియలిస్టిక్ గా థింక్ చేస్తూ పోతే వచ్చే సమాధానాలు భలే సరదాగానూ, నిజమైతే బాగుండేమో అనిపించేట్లు ... పైగా ... రిలాక్సింగానూ వుంటాయి.

ఇంతలో ' దబ్ ' అన్న చప్పుడు - ఆటో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్న శబ్దం. ఆలోచనల్లోంచి తేరుకుని చుట్టూ చూస్తే ... రోడ్డుకుకుడి వైపునున్న ఓ చిన్న సందులోంచి ఆటో రోడ్డుమీదికొచ్చి రాంగ్ రూట్లో ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. ఒక్క క్షణం యాక్సిడెంటేమో ననిపించింది. కొద్దిగా తేరిపార చూడగా, దూరంగా నున్న లైటు వెలుతురు క్రీనీడలో ఓ యువతి ఆకా రం కనిపించింది. జుట్టు ముడేసుకుని నడుం రుద్దుకుంటూ గొణుక్కుంటోంది. అప్పటిదాకా ఎన్నెన్నో ఆలోచనల్లో తిరుగాడివచ్చిన బుర్ర ఒక్కసారిగా స్తబ్దమైపోయింది. అప్రయత్నంగా కాళ్ళు రోడ్డుదాటాయి, ఏమైందో కనుక్కుందామన్న కుతూహలంతో.

(సశేషం)

No comments: