భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 63 సంవత్సరాలైందని పేపర్లో చూస్తే అనిపించింది ... అబ్బా అప్పుడే 63 సంవత్సరాల ముసలిదైపోయిందా భారద్దేశం అని.
వ్యక్తి పుట్టిన నాటినుండి సుమారు 25 - 30 సంవత్సరాలవరకూ శారీరకంగా ఎదుగుతూ వుంటాడు. 30 - 50 వరకూ ఎటువంటి ఎదుగుదలా కనిపించక పోయినా ఆతర్వాత మాత్రం తరుగుదల కనిపిస్తుంది. ఇదంతా మన కంటికి కనిపించేదే. కానీ మానసికంగా 16 - 18 సంవత్సరాల వరకూ శరవేగంగా అన్నిరంగాలలోనూ పెరిగే తెలివితేటలు ఆ తర్వాత అంత మోతాదులో కాకపోయినా దిశానుగుణంగా ఎంతో కొంత ఎదుగుదల 30 ఏళ్ళ వరకూ కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ భాగం సామాజిక స్పృహ పరంగా వుంటుది. ఆ తర్వాత 50 వరకూ ఎదుగుదల లేక పోయినా పరిధి విస్తృతమౌతుంది గమనించండి. ఇక పోతే 60 తర్వాత నుండీ దూరదృష్టి లేకపోవడం, కాలానుగుణంగా మారలేకపోవడం, తద్వారా సంకుచితత్వం, మూర్ఖత్వం ... ఇలా జీవితం సమసి పోతుంది.
మనిషి లాగానే దేశానికీ బాల్యం, యవ్వనం, వార్థక్యం లాంటి అవస్థలుంటాయా?
నా వరకూ వుంటాయనే అనుకుంటాను. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను గుర్తు చేసుకుంటూ... వ్యక్తి జీవితాన్ని దేశజీవనాన్ని అనుసంధానించండి. చాలా కొత్త విషయాలు (???) తెలుస్తాయి.
- స్వాతంత్ర్యం అంటే ఏమిటి?
- వ్యక్తి స్వాతంత్ర్యానికి దేశ స్వాతంత్ర్యానికి ఏమన్నా సంబంధం వుందా?
- భావ స్వాతంత్ర్యం, వ్యక్తి స్వాతంత్ర్యాని కేవిధంగా భిన్నం?
- ఎంత స్వాతంత్ర్యం సాధించామో తెలుసుకోవడానికేది కొలమానం?
- మనిషికి స్వాతంత్ర్యం వస్తే ఏం చేస్తాడు? అసలేం చేయాలి?
- మరి దేశానికి స్వాతంత్ర్యం వస్తే ...?
- ఈ స్వాతంత్ర్యానికి లింగ భేదం వుంటుందా? అలాగే ప్రాంతీయతా భేదం, కుల మత భేదాలుంటాయా?
ఆలోచిస్తే అన్నీ ప్రశ్నలే ...
ప్రశ్నలేనిదే వికాసం వుండదంటారు
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కొఱకు ప్రయత్నించండి ... అప్పుడర్థమౌతుంది మనమే మాత్రం స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామో!