Tuesday, December 23, 2008


కాకలు తీరిన వీరులు - 2(ఆ)


"అర్రెర్రే... ఇదేమిటిలా జరిగింది. ఎంతో ప్లాన్ చేసి పకడ్బందీగా అమలు చేసినా ఓడిపోయామేమిటి" అనుకుంటూ అమెరికన్లు కారణాలు వెతకటం మొదలెట్టారు. వీళ్ళేంచేసినా పద్ధతి ప్రకారం చేస్తారు కనుక, వెంటనే బడ్జెట్ కేటాయింది రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ కమిటీ ఒహటి వేసి దానికో బట్టతలని ఛైర్మన్ చేశారు. ఓ నెల్రోజులు అన్ని రకాలు గానూ స్టడీ చేసి వాళ్ళిలా చెప్పారు.

"ఇదంతా కో-ఆర్డినేషన్ ప్రాబ్లెం. తెడ్డేసే వాళ్ళు ఒకే రిథమ్ లో వేయక పోవడం వలన ముందు వెనకలయ్యి, డైరెక్షన్ బేలన్స్ కాక పడవ వంకర టింకరగా వెళ్ళింది. దాని వల్ల ప్రయాణం చేయాల్సిన 5 కి.మీ దూరానికి గానూ 5.78కి.మీ ప్రయాణం చేయాల్సి వచ్చింది." ఈ రిపోర్టు చదివిన తల పండిన గురూజీ గారు - దాన్ని అనలైజ్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చెయ్యటానికి ఓ అనలిస్ట్ ను రిక్రూట్ చేసుకున్నారు. ఈ అనలిస్టు గారు రిక్రూట్‌మెంట్ స్పెషలిస్టును, కోచ్‌ను, ఫిట్‌నెస్ ట్రైనర్‌నూ పిలిచి మీటింగ్ పెట్టాడు. మీటింగ్‌కు గురూజీకూడా హాజరయ్యారు. మరి గురూజీ వచ్చారంటే వారితో పాటూ పియ్యేగారు కూడా విచ్చేశారు. ఓ రోజంతా కష్టపడి విచారించీ విచారించీ ఇలా తేల్చారు.

రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ కమిటీ వారి రిపోర్టు ప్రకారం కో-ఆర్డినేషన్ లేదు కనుక, తెడ్డేసేవాళ్ళలో కో-ఆర్డినేషన్ తెచ్చేందుకు ఓ వారం రోజుల పాటు కో-ఆర్డినేషన్ మీద స్పెషల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ క్లాసు, పడవమీద వాళ్ళ వాళ్ళకు ఆన్ సైట్ సలహాలిచ్చేందుకు ఇద్దర్ని రిక్రూట్ చేసేందుకూ నిర్ణయించారు. ఇద్దరెందుకంటే ఒకరు కుడివైపువారికి, ఇంకొకరు ఎడమ వైపు వారికీ సలహాలిచ్చేందుకట.

జపనీయుల్ని కాంటాక్ట్ చేసి "రెణ్ణెల్లలో మళ్ళా పోటీ చేద్దాం -- ఓడిపోవడానికి సిద్ధంకండి" అంటూ మెస్సేజ్ పంపారు. జపనీయులు "ఓకే" అంటూ రెండక్షరాల రిప్లై పంపారు.

ఇక్కడ తెడ్డేసే వాళ్ళు ఫుల్ బిజీ - కో-ఆర్డినేషన్ క్లాసులూ, ఫిట్‌నెస్ ట్రైనింగులూ ... మరచిపోయా ... మీటింగ్‌లో ఇంకో విషయం కూడా డిసైడయ్యింది - తెడ్డేసే వాళ్ళ బలం పెరిగేందుకు బలవర్థకమైన ఆహారం ఇచ్చేందుకు డైటీషియన్, ప్రత్యేక కేటరర్‌ను కూడా నియమించారు. ఇలా వీటితో రెండు నెలలు గడిచాయి. పోటీ టైమ్ వచ్చింది.

యధాప్రకారం పడవలు నీళ్ళలో దించారు. 20 మంది తెడ్డేసేవాళ్ళు, కోచ్, మరిద్దరు కో-ఆర్డినేషన్ సలహాదార్లు. కానీ పడవలో 21 మందికే చోటు. చివరికి కో-ఆర్డినేషన్ లేకనే క్రితం సారి ఫెయిలయ్యారు కనుక కో-ఆర్డినేషన్ సలహాదార్లు తప్పనిసరని, వారికోసం ఇద్దరు తెడ్డేసేవాళ్ళని పడవ దించేశారు.

తుపాకీ పేలింది - పోటీ మొదలయ్యింది. మీరనుకుంటున్నట్లుగానే మళ్ళా ప్రాచ్యుల్నే విజయం వరించింది.

సస్పెన్సేమీ లేదు - ఈ పాటికి మీకు విషయం అర్థమయ్యేవుంటుంది. కానీ కథింకా అవలేదు.

రెండుసార్లు ఓడిపోయిన రోషంతో ఈ సారి గురూజీ గారే రంగంలోకి దిగారు - ఒక్కళ్ళే కాదు - సపరివార సమేతంగా. మీటింగులు, ఓటింగులయ్యాయి. ఓటమికి కారణాలు తెలిసాయి. (మీరనుకుంటున్నట్లుగా కాదు) ఫలితం ... కోచ్‌లూ, ఫిట్‌నెస్ ట్రైనర్‌లూ, కో-ఆర్డినేషన్ సలహాదార్లూ సరిగా పనిచేసినా, తెడ్డేసేవాళ్ళు సరిగా పని చెయ్యలేకపోవడం వలన ఇలాజరిగింది. కారణం మోటివేషన్ సరిగా లేకపోవడం. పైగా వీళ్ళలో కొందరు తొందరగా అలసిపోతున్నారు కూడా. మళ్ళీ పని మొదలెట్టారు. మోటివేషన్ క్లాసులూ, కోచింగూ, కో-ఆర్డినేషన్ క్లాసులూ, ఫిట్‌నెస్ ట్రైనింగులూ అన్నీ అయ్యాయి. యధా ప్రకారం జపనీయుల్ని కాంటాక్ట్ చేసి రెణ్ణెల్లలో మళ్ళీ పోటీ చేద్దాం అన్నారు - (ఎందుకైనా మంచిదని ఓడిపోవడానికి సిద్ధంకండని మాత్రం అనలా).

పడవలో ఎంతమంది పడతారో ఈ సారి ముందుగానే తెలుసు కనుక మొత్తం 21 మందీ రడీ అయ్యారు. ఈ సారి గురూజీగారు ప్రత్యక్షంగా తమ వాళ్ళ పెర్ఫార్మెన్సు చూడాలని ముచ్చట పడ్డారు కూడానూ. దాంతో పడవలో గురూజీ గారు, వారి తోక, గురూజీ వారి ఉత్సాహాన్ని చూసి ఉద్రేకపడ్డ అనలిస్టూ, కో-ఆర్డినేషన్ సలహాదార్లూ, కోచ్, కొత్తగా మోటివేషన్ స్పెషలిస్టూ, వీళ్ళేడుగురూ పోతే మిగిలిన 14 మంది తెడ్డేసేవాళ్ళతో ముచ్చటగా మూడవసారి పోటీ ప్రారంభమయ్యింది.

పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికి, ఈ ఏడుగురి సలహాలు, సూచనలూ మొదలయ్యాయి. ఒకడలా అంటే, ఇంకోడిలా అంటాడు. తొందరగా అంటారు, మెల్లిగా అంటారు, వార్మప్ అంటారు, కో-ఆర్డినేషనంటారు, మోటివేషనంటారు. తెడ్డేసేవాళ్ళకి ఓపిక నశించింది. వాళ్ళలో కొద్దిగా నోరుండేవాడు లేచి, "పనిచేసే వాళ్ళని తీసేసి, పనికిమాలిన సలహాలిచ్చే మీరందరూ ఎక్కితే ఇంక పడవెలా ముందుకు సాగుతుంది. 21 మంది తెడ్డేస్తేనే గెలవలేనివాళ్ళం, మీలాంటివాళ్ళెంత మందొచ్చి ఇలా బోడి సలహాలిచ్చినా 14 మందితో ఎలా గెలుస్తామనుకున్నారు. పైగా మీ బరువొకటి. ఓడిపోతే మళ్ళా మీరు మా బరువెక్కువైందని ఇంకో నలుగుర్ని పీకకామానరు. మాకిలాక్కాదు గానీ, మీరే తెడ్డేసి గెలచి ఆ కప్పేదో మీరే తీసుకోండి" అని 14 మందితో కలిసి నీళ్ళలో దూకి యీదుకుంటూ ఒడ్డుకొచ్చేసారు.

ట్విస్టేంటంటే, ఇంతకాలం కథనడిపిన మన పెద్దతలకాయలెవ్వరికీ తెడ్డేయటం కాదు కదా ఈత కూడా రాదు. కోచ్ ఏదో కష్టపడి భారీకాయంతో ఈదలేక ఈది రొప్పుతూ బయటపడ్డాడు. మిగిలినవారెవ్వరూ హెల్ప్ హెల్ప్ అని అరవటం మినహా మరేం చేయలేక పోయారు. చివరికి జపనీయులే వాళ్ళని ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రహసనమంతా విన్న అప్రాచ్య ప్రభుత్వం కమిటీని రద్దుచేసింది. అదండీ సంగతి.

1 comment:

Anonymous said...

ee padava potilu bagunnai-iwwh.blogspot.com