Friday, March 23, 2007


పాపం సుబ్బారావ్!


ఇంటి దగ్గర పెళ్ళాంతో దెబ్బలాడి విసుగ్గా రోడ్డు మీదకొచ్చాడు సుబ్బారావు. సాయంకా కావస్తోంది. నడుస్తోంది రోడ్డుకు ఎడమ వైపే అయినా బుర్ర నిండా అలోచనలతో రోడ్డుమీద ధ్యాసైతే లేదు పాపం సుబ్బారావుకి. ఐదు నిముషాలు అలా నడిచాడో లేదో సడన్ గా పాత టీవీయస్సొకటి గుద్దటంతో క్రిందపడ్డాడు సుబ్బారావుని. అసలే పెళ్ళాం మీది కాకతో వున్నాడేమో కోపంగా చూశాడు గుద్దిన వ్యక్తి వంక. గుద్దిందెవరో కాదు, పదో తరగతి చదువుతున్న ప్రక్కవీథి పుల్లారావు కొడుకు. తన వంక చూసుకున్నాడు. పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు. మోచేయి కొద్దిగా గీచుకు పోయింది, కానీ బట్టలు మాత్రం ఖరాబయ్యాయి. పుల్లారావు టీవియస్ కు మాత్రం బాగనే డామేజయ్యింది. హెడ్ లైటు అద్దం పగిలింది, ముందు మడ్ గార్డ్ సొట్ట పోయింది, రియర్వ్యూ మిర్రర్ పగిలింది, హేండిల్ బెండొచ్చినట్లుంది. కానీ పిల్లాడికేమీ అవలేదు.

లైసెన్సు లేకుండా, రోడ్డుమీద రాంగ్ రూట్లో రావడమే కాకుండా యాక్సిడెంట్ చెయ్యడంతో ఉన్న కోపం ఇంకొంచెం పెరిగింది. పిల్లోడు బిత్తర చూపులతో చూస్తుండడంతో, ఆ కోపం రెస్పాన్సిబిలిటీ లేకుండా పిల్లోడికి బండి నిచ్చిన పుల్లారావు మీదకి తిరిగింది. ఏం తిట్టకుండా బండి లాక్కుని, మీ నాన్నను తీసుకుని ఇంటికి వస్తే ఇస్తానని చెప్పి బండితో సహా ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళగానే పెళ్ళాం నవ్వు మొహం చూడగానే అప్పటివరకూ వున్న చిరాకు, కోపంతో పాటు బండి సంగతి కూడా మర్చిపోయాడు. రెండో రోజు కానిస్టేబులొచ్చి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళి పుల్లారావు తన మీద కిడ్నాప్ కేసు పెట్టాడని చెప్పేసరికి మతి పోయింది.

అసలు సంగతేంతంటే, రాత్రంతా కొడుకు ఇంటికి రాకపోయే సరికి పొద్దున్న వీధిలో విచారించిన పుల్లారావుకి, ముందురోజు సాయంత్రం తనకొడుకుతో సుబ్బారావు మాట్లాడాడన్న విషయం తెలిసింది. అంతే ముందూ వెనుకా అలోచించకుండా సుబ్బారావు తన కొడుకుని కిడ్నాప్ చేశాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు.

అందరూ అనుకోవడం పుల్లారావు కొడుకు టెన్త్ పరీక్షలకు సరిగ్గా చదవక పోవడం, దానికి తోడు తండ్రికి చెప్పకుండా బండిని తీసుకు రావడమే కాకుండా యాక్సిడెంట్ చేయడంతో భయపడి పారిపోయింటాడు. అదంతా అటూ ఇటూ తిరిగి, సుబ్బారావు మీదకొచ్చింది. పాపం సుబ్బారావు ... ఢెబ్బై వేలు కట్టి జామీను మీద బయటకొచ్చినా, ఇప్పుడు ప్రతి రోజూ పోలీసు స్టేషన్ లో హాజరేసుకుంటున్నాడు. పారిపోయిన పుల్లారావు కొడుకు కడుపు కాలి ఇంటికి తిరిగొచ్చేదాకా సుబ్బారావుకీ అవస్థ తప్పదేమో!

(సుబ్బారావేమీ పుల్లారావుకు జరిగింది చెప్పి కేసును విత్ డ్రా చేయించుకోవచ్చుగా అనుకుంటారేమో. ఆ పనీ అయ్యింది. తానేమీ అనలేదనీ, తండ్రిని పిలిచి చెబితే పిల్లాడికి బుద్ధి చెపుతాడని మాత్రమే బండి తీసుకెళ్ళానని వివరించినా వినలేదు పుల్లారావు. పుల్లారావు వాదన ప్రకారం తాను ఇల్లు (లంచం సొమ్ముతో) కట్టుకున్నానన్న దుగ్దతో సుబ్బారావే ఈ పని చేసుంటాడు ... లేదా తన కొడుకుని బాగా తిట్టి కొట్టడంతో నయినా పారిపోయిండాలి. ఏదేమైనా తన కొడుకు పారిపోవడానికి కారణం సుబ్బారావే కనుకు, తన కొడుకు క్షేమంగా తిరిగొస్తే కాని కేసు వాపస్ తీసుకోనంటాడు పుల్లారావు.)

Monday, March 19, 2007


శాలివాహన శకం... ఉగాది ఆవిర్భావం


బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజును గుర్తుచేసుకుంటూ జరుపుకొనే పండుగ ఉగాది పండుగ. యుగాదిని నిరంతరం గుర్తుంచుకోవాలన్న విషయం దీని వెనుక ఉంది. ఈ విషయాన్ని బ్రహ్మాండ పురాణం లాంటి పురాణాలు చెబుతున్నాయి. సృష్టిని ప్రారంభించిన తరువాత దాన్ని పరిపాలించమని బ్రహ్మదేవుడు కొంతమంది దేవతలకు బాధ్యతలను అప్పగించాడు. వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలను పాలించడానికి ముందుకు వచ్చిన శుభసందర్భాన్ని పండుగగా జరుపుకోవడం ఆ దేవతల మీద భక్తిని ప్రకటించడం అవుతుంది. అలాగే జ్యోతిషశాస్త్ర సంబంధంగా కూడా ప్రజా పరిపాలనకు సంబంధించిన విషయం ఒకటి పంచాంగంలో ప్రకటితమవుతుంది. ఉగాది నాటి పర్వదిన విధివిధానాలలో పంచాంగ శ్రవణం ఒకటి. పంచాంగాన్ని వినేటప్పుడు శాస్త్రజ్ఞుడు నవనాయకులను గురించి ప్రస్తావిస్తాడు. వారిలో రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి (వాణిజ్య పంటలకు అధిపతి), ధాన్యాధిపతి (వరి ధాన్యంలాంటి ధాన్యపంటలకు అధిపతి), అర్ఘాధిపతి (మెట్టపంటలకు అధిపతి), మేఘాధిపతి (వర్షాలు, నీటిపారుదలకు అధిపతి), రసాధిపతి (నూనెలు, చమురు ధాన్యాల అధిపతి), నీరసాధిపతి (లోహాలు, గనుల అధిపతి) అనే తొమ్మిది మంది అధిపతుల విషయం ప్రస్తావితమవుతుంది. ఈ తొమ్మిదింటికీ మనకున్న నవగ్రహాలలో ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. గ్రహాలన్నీ దైవ సంబంధాలే. కనుక ఆ దైవాలంతా తమ బాధ్యతలను ఉగాది నాడే స్వీకరిస్తారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పండుగ జరుపుకోవడం కూడా ఉగాది వెనుక ఉన్న ఓ పరమార్ధంగా పెద్దలు చెబుతారు.

చైత్ర శుక్ల పాడ్యమి ఇలా సంవత్సరాదిగా (ఉగాదిగా) తరతరాలుగా జరుపుకుంటున్నారు. ఈ ఉగాదికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. ఇది విక్రమార్క, శాలివాహనుల పరిపాలనకు సంబంధించినదిగా ప్రచారంలో ఉంది. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్నది శాలివాహన శకమని, ఉత్తరాన ఉన్నది విక్రమార్క శకమని ప్రచారంలోకి రావడానికి ఉన్న కారణాన్ని ఈ కథ వివరిస్తుంది.

పూర్వం పురంధరపురంలో ఓ వర్తకుడు ఉండేవాడు. గొప్ప ధనవంతుడైన ఆ వర్తకుడికి నలుగురు కుమారులు కలిగారు. కాలక్రమంలో వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైంది. అయినా ఆ వర్తకుడు తన నలుగురు కుమారులకు సంపదలను పంచి ఇవ్వలేదు. కానీ మరణించే ముందు తన నలుగురు కుమారులను పిలిచి మూతలు బిగించి ఉన్న నాలుగు పాత్రలను ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరిచి చూడమని, వాటిలో ఎవరు ఏ పని చేయాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు. అతడి కుమారులు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరిచి చూశారు. మొదటి పాత్రలో మట్టి, రెండో దానిలో బొగ్గులు, మూడో దానిలో ఎముకలు, నాలుగో దానిలో తవుడు మాత్రమే కనిపించాయి. దాని అర్ధం వారికి తెలియక నాటి రాజైన విక్రమార్కుడి దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పారు. విక్రమార్కుడికి కూడా ఆ ప్రాతల విషయం బోధపడలేదు. ఆ నలుగురు కుమారులు ఎలాగా అని ఆలోచించి ప్రతిష్ఠానపురం వెళ్ళి అక్కడున్న వారిని కూడా అడిగారు. కానీ ఎవరూ చెప్పలేకపోయారు. అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు.

ఆ బాలుడు ఓ వితంతువు కుమారుడు. అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చిందంటారు. ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయం ఇచ్చాడు. కుమ్మరి ఆశ్రయంలో ఉన్నప్పుడే ఆమె బాలుడిని ప్రసవించింది. పుట్టిన బిడ్డకు శాలివాహనుడు అని పేరుపెట్టింది. శాలివాహనుడు నాలుగు పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు. వర్తకుడి కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను, ఎముకలతో నిండిన పాత్ర వచ్చినవాడు పశుసంపదను, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన వాడు ధాన్యాన్ని పంచుకోవాలని, అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహనుడు తేల్చిచెప్పాడు. శాలివాహనుడి మాటలు నలుగురికీ నచ్చి అలాగే పంచుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి విక్రమార్కుడి దాకా చేరింది. విక్రమారుడు శాలివాహనుడిని చూడాలని కుతూహలపడి కబురు చేశాడు. కానీ శాలివాహనుడు తాను రానని ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని అన్నాడు. దాంతో విక్రమార్కుడికి కోపం వచ్చి శాలివాహనుడిని సంహరించడానికి చతురంగ బల సమేతుడై వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు చేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీదకు పంపాడు. ఇద్దరి మధ్య భీకరంగా పోరు సాగింది. చివరకు శాలివాహనుడు సమ్మోహన శస్త్రాన్ని ప్రయోగించి విక్రముడి సేన అంతా నిద్రపోయేలా చేశాడు. విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజును ప్రార్ధించి తన సేనలకు మెలుకువ వచ్చేలా చేశాడు. ఆ తరువాత ఇద్దరికీ రాజీకుదిరింది.

ఈ కథకే మరి కొంత మార్పుతో మరి కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి. దాని ప్రకారం శాలివాహన, విక్రమార్కుల యుద్ధ సమయంలో ఎవరి విజయమూ తేలనప్పుడు ఆకాశవాణి వినిపించిందట. నర్మదా నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు, దక్షణ దిక్కున ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుడు పాలించమని ఆకాశవాణి చెప్పిన తరువాత ఆ ఇద్దరూ యుద్ధాన్ని మానివేశారట. అలా శాలివాహనుడు ఒక శకానికి స్థాపకుడయ్యాడు. ఆ శక స్థాపన జరిగింది చైత్ర శుక్ల పాఢ్యమినాడనీ, ఆ అపూర్వ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతరకాలంలో ఉగాది ఆవిర్భవించిందని ప్రజల్లో ప్రచారంలో ఉంది.

డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు -
(ఈనాడు)