ఈ నిజాన్ని మరోసారి నిరూపించింది నిన్నటి సంఘటన.
నిన్న రాత్రి నైట్‍షిఫ్ట్ కోసం ౧౦ గంటలకు మోటర్‍బైక్ మీదొస్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఆఫీసొక అరకిలోమీటరు దూరముందనగా, తాగి రోడ్డుమీద అడ్డ దిడ్డంగా నడుస్తున్న ఓ ఐదుగురు అడ్డమొచ్చారు. హారన్ కొడితే తప్పుకున్నట్టు తప్పుకుని మళ్ళా మీదకొచ్చారు. అనుకోకుండా అలా వచ్చేసరికి రియర్ వ్యూ మిర్రర్ వాళ్ళకు తగిలి బండి అదుపు తప్పింది. పడబోయి కొద్దిలో నిలదొక్కు కున్నాడు. కోపంతో 'రోడ్డు మీద ఎలా నడవాలో తెలీదా తాగుబోతు నాయాల్లారా' అని వాళ్ళను తిట్టాడు. వాళ్ళు పట్టించుకోక పోయేసరికి, బండి పక్కకి తీసి ఆపి, వాళ్ళనాపి పోలీసులకు కంప్లైంటు చేస్తామన్నా వాళ్ళు పట్టించు కోకుండా ఎదురు మాట్లాడేసరికి మనోడికి తిక్క రేగి (?) మొబైల్ తీసి నిజంగానే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేయబోయాడు.
ఇంకేముంది, వీడొక్కడు, వాళ్ళయిదుగురు. సుబ్బుగాడెంత ప్రతిఘటించినా, ఐదుగురి దాటికి తట్టుకోలేక పోయాడు. వాళ్ళతన్ని కొట్టి పడేసి వెళ్ళి పోయారు. ఆ దారిన పోయే వాళ్ళెవరూ పట్టించుకోక పోయినా, ఒక్కతను మాత్రం (పాపం పూనా నుంచి ఏదో పనిమీద వచ్చాట్ట) చూసి జాలిపడి దగ్గర్లోవున్న ఓ హాస్పిటల్ లో చేర్పించాడు. రోడ్డు పక్కన బండరాళ్ళు వుండటంతో తల మీద, తలవెనుక మెడ పై భాగాన బాగా దెబ్బలు తగిలాయి. బాటిల్తో కూడా కొట్టినట్టున్నారు, పగిలిన గాజు పెంకులు క్రింద వున్నాయి. కుడి కంటి క్రిందుగా చీరుకు పోయింది. సుబ్బు సెల్లోంచే లాస్ట్ డయల్డ్ నెంబరు చూసి పూనా ఆసామి ఫోన్ చేస్తే అదృష్టవశాత్తు మా ఆఫీసతనికే చేరింది. విషయం తెలియగానే మావాళ్ళు పరిగెత్తు కెళ్ళారు.
తప్పు తనది కాకపోయినా, తాగినోళ్ళతో మనకెందుకులే అనుకుని సుబ్బుగాడనుకొని వుంటే ఈ ఖర్మే వుండేది కాదు. వాళ్ళయిదుగుర్ని చూసైనా ఒక్క క్షణం అలోచించినా సరిపోయుందును. తప్పుచేయలేదు కనుక నేను భయపడాల్సిన పనిలేదను కున్నాడు - ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఈ కాలంలో నిజం చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. అందుకే మన పెద్దవాళ్ళన్నారు "అనువుగాని చోట అధికుల మనరాదని".
దురదృష్టకరమైన సంగతేమిటంటే, రోడ్డు మీద ఎందరు వెళుతున్నా, ఈ సంఘటన చూసి స్పందించిన వెధవ ఒక్కడూ లేడు. వాడెవడో ప్రక్క రాష్ట్రం నుంచొచ్చినోడికి తప్ప ఇక్కడి వాళ్ళెవరికీ పట్టలేదు.
మందు తాగడం తప్పా ఒప్పా అన్నదిక్కడ ప్రశ్నకాదు గానీ, పబ్లిగ్గా .. అదీ నడిరోడ్డుమీద తాగుతూ వచ్చే పోయే వాహనాలకూ, పాదచారులకూ ఇబ్బందిగా మారటం ఖచ్చితంగా తప్పే. ఇలా చేయడం తప్పురా నాయినా అని చెప్పినోణ్ణి చితగ్గొట్టటం ఇంకా పెద్ద తప్పు. ఇవన్నీ క్షమించవచ్చేమో కానీ, చూస్తూకూడా పట్టించుకోక పోవడం మాత్రం క్షమించరాని తప్పు. కానీ వీళ్ళకేశిక్షా వుండదు.
ఏమిటోనండీ ... లోకంతీరు ఓ పట్టాన అర్థంకాదు.
లోకా సమస్తా సుఖి:నోభవన్తు!
Saturday, November 11, 2006
అనువు గాని చోట అధికుల మనరాదు
Subscribe to:
Posts (Atom)